చౌహాన్‌ చక్రం మళ్లీ తిరిగేనా? | Madhya Pradesh election 2018 | Sakshi
Sakshi News home page

చౌహాన్‌ చక్రం మళ్లీ తిరిగేనా?

Published Mon, Oct 22 2018 2:54 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

 Madhya Pradesh election 2018 - Sakshi

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: వచ్చే నెల 28న మధ్యప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రధానంగా పోటీ రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉండనుంది. ఓ వైపు 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ, మరోవైపు ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్న కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీని దాదాపు ఓడించినంత పనిచేసిన కాంగ్రెస్‌.. మధ్యప్రదేశ్‌లోనూ అదే హవా కొనసాగించి అధికారంలోకి రావడం ద్వారా వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లోనూ సత్తా చాటొచ్చని భావిస్తోంది. మరోవైపు సాధారణ ఎన్నికలు దాదాపు ఇంకో ఐదు నెలలే మిగిలి ఉన్నందున ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఓటమి పాలైతే బీజేపీకి అదో గట్టి ఎదురుదెబ్బ. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలూ ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలేవో పరిశీలిద్దాం.



సాధారణ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా?
లోక్‌సభలో మొత్తం స్థానాల సంఖ్య 545 కాగా, అందులో మధ్య ప్రదేశ్‌ నుంచి 29 సీట్లున్నాయి. విస్తీర్ణం పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద రాష్ట్రం మధ్యప్రదేశే. ఈ రాష్ట్ర మొత్తం జనాభా 7.25 కోట్లు (2011 జనాభా లెక్కల ప్రకారం). జనాభా పరంగా ఐదో అతిపెద్ద రాష్ట్రం. ఈ లెక్కలు చాలు మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు సాధారణ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తాయని చెప్పడానికి. అందుకే బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుజరాత్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు సాధారణ ఎన్నికల్లో గెలుపు రేసులో నిలవడానికి కాంగ్రెస్‌కు మధ్యప్రదేశ్‌ ఎన్నికలు ఓ మంచి అవకాశం. అలాగే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా బీజేపీకి సాధారణ ఎన్నికల్లోనూ సునాయాసంగావిజయ ఢంకా మోగించే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటుందా?
మధ్యప్రదేశ్‌లో 2003 నుంచీ బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ గత 13 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్నారు. ఈసారి కూడా ఆయన నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే దాని కారణంగా బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయి కానీ విజయం మాత్రం కాషాయపార్టీదేనని ఇప్పటికే సర్వేలు అంచనా వేశాయి.   

కుంభకోణాల ప్రభావం ఎంత?
ప్రస్తుత ప్రభుత్వంపై అనేక అవినీతి, కుంభకోణాల ఆరోపణలున్నాయి. వాటిలో ‘వ్యాపం’ బాగా పేరుమోసిన కుంభకోణం. 2013లో జరిగిన ఈ కుంభకోణం సంచలనం సృష్టించింది. వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలను, ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షలను వ్యాపం బోర్డు నిర్వహిస్తుంది. 2013లో ఏకంగా 13 పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయనీ, అభ్యర్థులు, విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకుని అసలైన వారి స్థానంలో వేరొకరిని పరీక్షకు అనుమతించడం, లంచం ఇచ్చిన అభ్యర్థులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి వారికి సమాధానాలు అందివ్వడం తదితర విషయాలు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం వివిధ పట్టణాల్లో రూ.500 కోట్ల విలువైన భూములను ఆరెస్సెస్‌కు ధారాదత్తం చేసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ‘సింహస్త’ కుంభకోణంలో రూ. 2,500 కోట్ల అవినీతి జరిగిందనీ, అక్రమ ఇసుక తవ్వకాలు, చెరువులు, ఆనకట్టల నిర్మాణంలో అక్రమాలు, మధ్యాహ్న భోజన పథకంలో అవినీతి తదితర ఆరోపణలు బీజేపీ ప్రభుత్వంపై ఉన్నాయి.  అక్రమ ఇసుక తవ్వకాల కుంభకోణంలో స్వయంగా చౌహాన్‌కు అతి దగ్గరి బంధువు హస్తం ఉందని ఆరోపణలున్నాయి.

రైతు ఆత్మహత్యలతో బీజేపీకి చేటు
జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం గత 9 ఏళ్ల బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్‌లో 11 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి భారీగా పెరుగుతున్నా కర్షకులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యల అంశం కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రచారాస్త్రం కానుంది.  

‘స్థానిక’ ఎన్నికల ప్రభావం ఉంటుందా?
మధ్యప్రదేశ్‌లో ఇటీవలే పలు పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని చౌహాన్‌ వాదిస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరోలా ఉన్నాయి. రాగోగఢ్‌ పురపాలక సంఘంలో 24 వార్డులకుగాను కాంగ్రెస్‌ 20, బీజేపీ కేవలం 4 వార్డుల్లో గెలుపొందాయి. చిత్రకూట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 14,133 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే మొత్తంగా 20 పురపాలికల కు 2018లో ఎన్నికలు జరగ్గా 13 చోట్ల బీజేపీ గెలిచింది.   

మత సమీకరణాలూ...: రాష్ట్రంలో మొత్తం జనాభాలో 90.9 శాతం హిందువులే. అటు బీజేపీకి హిందుత్వ పార్టీగా పేరుంది. కాబట్టి మధ్యప్రదేశ్‌లో బీజేపీ సులభంగా గెలిచేందుకు అవకాశం ఉంది. ముస్లింలు 6.6% మంది ఉన్నారు.

బీజేపీ పాలనలో..
గత 15 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినా.. కొంతవరకు అభివృద్ధి కూడా కనిపిస్తోంది. ప్రజల్లో బీజేపీ పాలనపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై సానుకూలత ఉంది. అత్యంత వెనుకబడిన రాష్ట్రాలైన బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌)ల్లో ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని శివరాజ్‌ అభివృద్ధి దిశగా నడిపించారు. విద్యుత్‌ ఉత్పత్తిలో మిగులును సాధించారు. ప్రైవేటు రంగంలో గణనీయ అభివృద్ధిని చూపారు. విద్య, వైద్యరంగాల్లోనూ పురోగతి కనిపిస్తోంది. రాష్ట్ర వృద్ధి రేటును రెండంకెలకు తీసుకువెళ్లారు. మౌలిక వసతుల కల్పనలోనూ పురోగతి ఉంది.  రైతుల కోసం కూడా పలు పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యమైంది ‘భవంతర్‌ భూఘటన యోజన’.

ఈ పథకం ప్రకారం.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ ధర, కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా ఉంటే.. ఆ తేడాను రైతుల ఖాతాల్లోకే నేరుగా జమ చేస్తారు. ఈ పథకంలో 16 లక్షల మంది రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే, ఈ పథకం కూడా రైతుల కన్నా దళారులకే ఎక్కువ ఉపయోగపడుతోందన్న క్షేత్రస్థాయి విమర్శ. మరోవైపు రైతు ఆత్మహత్యల్లో పెరుగుదల శివరాజ్‌ ప్రభుత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. 2014–16 మధ్య రైతు ఆత్మహత్యల్లో 21% పెరుగుదల నమోదైనట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆ కాలంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఏడాది క్రితం ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులకు పాల్పడి ఐదుగురు రైతుల మృతికి కారణమైన ‘మాంద్‌సౌర్‌’ ఘటన కూడా ప్రభుత్వంపై మరకలా పడింది. బీజేపీ పాలనలో దళితులు, ఆదివాసీలపై అఘాయిత్యాలు కూడా పెరిగాయని నివేదిక తెలిపింది.



బీజేపీకి కొత్త ముఖాలు.. కాంగ్రెస్‌కు పాత ఎమ్మెల్యేలు
మధ్యప్రదేశ్‌లో ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై అవి తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. 15ఏళ్ల పాలన కారణంగా పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనే లక్ష్యంతో ప్రస్తుతమున్న 165 మందిలో 70 నుంచి 80 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వవద్దని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. జన ఆశీర్వాదయాత్రలో భాగంగా రాష్ట్ర పర్యటన చేస్తున్న సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు పలువురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందాయని, వారికి టికెట్లు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు  పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. సీఎంగా శివరాజ్‌కు మంచిపేరే ఉన్నా.. ఎమ్మెల్యేల వైఫల్యం కారణంగా పార్టీ పరాజయం పాలు కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. 2013లోనూ బీజేపీ దాదాపు 25% టికెట్లను కొత్త ముఖాలకే ఇచ్చింది. వారిలో 75% విజయం సాధించారు. మరోవైపు, కాంగ్రెస్‌ మెజారిటీ సభ్యులకు టికెట్లు ఖాయం చేసిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతమున్న 57 మంది ఎమ్మెల్యేల్లో 42 మందికి అభయ ‘హస్తం’ ఇచ్చేశారని చెప్పాయి. సరైన కారణం లేకుండా సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించవద్దని పార్టీ రాష్ట్ర చీఫ్‌ కమల్‌నాథ్‌ నిర్ణయించారన్నాయి.

కాంగ్రెస్‌లో ముగ్గురు సీఎం అభ్యర్థులు!
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారంటూ ఇటీవలే ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్‌ సింగ్, కమల్‌నాథ్‌లే మోదీ వ్యంగ్యంగా చెప్పిన ఆ ముగ్గురు సీఎం ముఖాలు. అదీకాక, ఆ ముగ్గురి మధ్య కూడా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఈ ముగ్గురు కూడా సీఎం శివరాజ్‌ సింగ్‌ స్థాయి మాస్‌ లీడర్లు కాకపోవడం కాంగ్రెస్‌కు మైనస్‌ కానుంది. ఇటీవలి సర్వేలోనూ ఆ విషయం స్పష్టమైంది. ఆ సర్వేలో.. పై ముగ్గురు కాంగ్రెస్‌ నేతల మొత్తం పాపులారిటీ కూడా శివరాజ్‌సింగ్‌కున్న ప్రజాభిమానంతో సరిపోలలేదు. పదవుల పంపకంలో భాగంగా.. కమల్‌నాథ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా, సింధియాను ప్రచారకమిటీ చీఫ్‌గా పార్టీ నియమించింది. నిధుల సమీకరణ బాధ్యతను కూడా కమల్‌నాథ్‌కే అప్పగించింది.


జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్

అసంతృప్తులను బుజ్జగించే ‘బ్యాక్‌రూమ్‌ మేనేజ్‌మెంట్‌’ను దిగ్విజయ్‌ చేతుల్లో పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘నేను ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు పడే ఓట్ల సంఖ్య తగ్గే ప్రమాదముందం’టూ దిగ్విజయ్‌ చేసిన కామెంట్‌ వీడియో ఇటీవల బాగా వైరల్‌ అయింది. మాజీ సీఎం అయిన దిగ్విజయ్‌ను పార్టీ పక్కనపెడ్తోందన్నది ఆయన, ఆయన అనుచరుల ప్రధాన ఫిర్యాదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్‌ ఎంత వరకు ఓట్లుగా మార్చుకోగలదన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎస్పీ, బీఎస్పీలతో పొత్తు కుదరకపోవడం కాంగ్రెస్‌కు మరో దెబ్బ. ముస్లింలకు కూడా శివరాజ్‌పై సానుకూల అభిప్రాయమే ఉండటం బీజేపీకి కలిసొచ్చే మరో అంశం. ఇటీవల ఏబీపీ, సీఎస్‌డీఎస్‌ సర్వేలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశముందంటూ తేలడం కాంగ్రెస్‌కు కొంత ఊరటనిచ్చే విషయమే అయినా.. అంతకుముందు దైనిక్‌భాస్కర్‌ చేసిన సర్వేలో బీజేపీ ఘనవిజయం సాధించబోతోందంటూ తేలిన విషయం గమనార్హం.

వారం ముందు సీఎం అభ్యర్థి
పోలింగ్‌కు వారం రోజుల ముందు రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించనుందన్న వార్త చక్కర్లు కొడుతోంది. పంజాబ్‌లో ఎన్నికలకు వారం ముందు కెప్టెన్‌ అమరీందర్‌ను ఇలాగే సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాకపోతే, అక్కడ కెప్టెన్‌కు పోటీదారులెవరూ లేరు. సింధియాను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. ‘కిసాన్‌ పుత్ర’ వర్సెస్‌ ‘మహారాజ పుత్ర’గా ప్రచారాన్ని ఉధృతం చేయాలని బీజేపీ యోచిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement