ప్రతీకాత్మక చిత్రం
భోపాల్ : ఫెండ్‌షిప్ డే రోజు బ్యాండ్‌లు కట్టుకోవడం.. లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్‌కు స్థాయికి తగ్గ గిఫ్ట్‌లు ఇచ్చుకుంటాం. కానీ ఓ పదోతరగతి విద్యార్థి ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా తన క్లాస్‌మేట్స్‌కు ఏకంగా రూ.46 లక్షలు పంచేశాడు. అలా పంచడానికి అతనేమన్న ధనవంతుడా అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే అతను తన తండ్రి సొమ్మును దొంగలించి పేకముక్కల్లా పంచేశాడు.
తన హోంవర్క్ చేసినోడికి మూడు లక్షలు, రోజువారీ కూలీ పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి రూ.15 లక్షలు ఇలా మొత్తం 35 మంది క్లాస్‌మేట్స్‌కు ఉదారంగా ఇచ్చేశాడు. ఇందులో ఈ సొమ్ముతో ఒకరు కారు కొనుక్కోగా.. మరి కొంత మంది విలువైన బ్రాస్‌లెట్స్, వస్తువులు కొనుక్కున్నారు.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తీరా ఈ విషయం తెలిసిన ఆ కుర్రాడి తండ్రి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగు చూసింది.
వృత్తిరీత్యా బిల్డర్ అయిన ఆ కుర్రాడి తండ్రి ఓ ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చిన రూ.60 లక్షలను ఇంట్లోని కప్‌బోర్టులో దాచాడు. ఆ తర్వాత చూసుకుంటే అందులో రూ.46 లక్షలు మాయమయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనానికి అవకాశం లేకపోవడంతో పోలీసులు రకరకాల కోణాల్లో విచారణ ప్రారంభించారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఆ బిల్డర్ కన్న కొడుకే తన క్లాస్‌మేట్స్‌కి ఈ డబ్బులు పంచేసినట్టు విచారణలో తేలింది.
ఆ కుర్రాడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్న కొందరి విద్యార్థుల పేర్లు ఆధారంగా వారిని సంప్రదించామని, పెద్దమొత్తంలో సొమ్ము అందుకున్న ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి ఐదు రోజుల్లోగా సొమ్ము తిరిగిచ్చేయాలని చెప్పామని ఎస్ఐ తోమర్ మీడియాకు తెలిపారు. ఇంతవరకూ రూ.15 లక్షలు సొమ్ము తిరిగి రాబట్టామని, తక్కిన సొమ్ము కూడా రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అందరూ మైనర్లు కావడంతో ఎవరిపై కేసునమోదు చేయలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment