Friendship Day gift
-
మిత్రుడి పేరిట స్కూల్.. హ్యాపీ ఫ్రెండ్సిప్ డే..
కరీంనగర్: పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన యాదిలో చిన్ననాటి మిత్రులు ఏదైనా చేయాలని నిర్ణయించున్నారు. గాజుల శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూఎస్ఏ సిరిసిల్ల పట్టణ శివారులో 22 గుంటల స్థలం కొనుగోలు చేసి, రూ.30 లక్షలతో 2006లో దయానంద్ మెమోరియల్ స్కూల్ స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్నారు. రాజీవ్‌నగర్ కార్మిక క్షేత్రంలోని పేదవాళ్లు తమ పిల్లలను ఇక్కడికి పంపిస్తున్నారు. ప్రస్తుతం 65 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ నిర్వహణకు ఏటా రూ.5 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో ఎక్కువ మొత్తాన్ని శ్రీనివాస్ భరిస్తున్నారు. బోడ రవీందర్, సిరిసిల్ల తిరుపతి, కట్కం గోపి, పయ్యావుల శ్రీనివాస్, బి.రాము, బొడ్డు శ్రీధర్, లింగమూర్తి, సిరిసిల్ల తిరుమలేశ్, వూరడి రవి, కోడం సుధాకర్ పాఠశాల నిర్వహణలో భాగస్వాములవుతూ స్నేహానికి నిజమైన నిర్వచనంగా నిలుస్తున్నారు. -
ఫ్రెండ్‌షిప్‌డే: 46 లక్షలు పంచేశాడు!
భోపాల్ : ఫెండ్షిప్ డే రోజు బ్యాండ్లు కట్టుకోవడం.. లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్‌కు స్థాయికి తగ్గ గిఫ్ట్‌లు ఇచ్చుకుంటాం. కానీ ఓ పదోతరగతి విద్యార్థి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తన క్లాస్‌మేట్స్‌కు ఏకంగా రూ.46 లక్షలు పంచేశాడు. అలా పంచడానికి అతనేమన్న ధనవంతుడా అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే అతను తన తండ్రి సొమ్మును దొంగలించి పేకముక్కల్లా పంచేశాడు. తన హోంవర్క్ చేసినోడికి మూడు లక్షలు, రోజువారీ కూలీ పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి రూ.15 లక్షలు ఇలా మొత్తం 35 మంది క్లాస్‌మేట్స్‌కు ఉదారంగా ఇచ్చేశాడు. ఇందులో ఈ సొమ్ముతో ఒకరు కారు కొనుక్కోగా.. మరి కొంత మంది విలువైన బ్రాస్లెట్స్, వస్తువులు కొనుక్కున్నారు.మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తీరా ఈ విషయం తెలిసిన ఆ కుర్రాడి తండ్రి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగు చూసింది. వృత్తిరీత్యా బిల్డర్ అయిన ఆ కుర్రాడి తండ్రి ఓ ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చిన రూ.60 లక్షలను ఇంట్లోని కప్బోర్టులో దాచాడు. ఆ తర్వాత చూసుకుంటే అందులో రూ.46 లక్షలు మాయమయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనానికి అవకాశం లేకపోవడంతో పోలీసులు రకరకాల కోణాల్లో విచారణ ప్రారంభించారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఆ బిల్డర్ కన్న కొడుకే తన క్లాస్‌మేట్స్‌కి ఈ డబ్బులు పంచేసినట్టు విచారణలో తేలింది. ఆ కుర్రాడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్న కొందరి విద్యార్థుల పేర్లు ఆధారంగా వారిని సంప్రదించామని, పెద్దమొత్తంలో సొమ్ము అందుకున్న ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి ఐదు రోజుల్లోగా సొమ్ము తిరిగిచ్చేయాలని చెప్పామని ఎస్ఐ తోమర్ మీడియాకు తెలిపారు. ఇంతవరకూ రూ.15 లక్షలు సొమ్ము తిరిగి రాబట్టామని, తక్కిన సొమ్ము కూడా రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అందరూ మైనర్లు కావడంతో ఎవరిపై కేసునమోదు చేయలేదన్నారు. -
విశాఖ ఎయిర్‌పోర్టులో 'బుల్లెట్' కలకలం
విశాఖపట్నం: స్నేహితుల దినోత్సవం రోజున ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఓ యువతిని జైలు పాల్జేసింది. అనుమానాస్పద వస్తువు ఉందన్న అనుమానంతో గురుప్రీత్ కౌర్(22) అనే యువతిని విశాఖ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద రివాల్వర్ బుల్లెట్ ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆమెను అదుపులోకి విచారించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ బుల్లెట్ తనకు ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిందని ఆమె తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు. పూణెలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న కౌర్ మంచి ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చింది. పూణెకు తిరిగి వెళుతూ బుల్లెట్ తో దొరికిపోయింది. ఆమె తండ్రి నావికాదళంలో పనిచేస్తున్నారు. బుల్లెట్ కలిగివున్నందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనుట్టు పోలీసులు తెలిపారు.