జ్యోతిరాదిత్య సింధియా తనయుడు మహానార్యమన్ సింధియా (ట్విటర్ ఫొటో)
భోపాల్ : మధ్యప్రదేశ్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రచార కమిటీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియా తనయుడు మహానార్యమన్ రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. రాజవంశానికి చెందిన మహానార్యమన్ డెహ్రాడూన్‌లో హై స్కూల్ విద్యనభ్యసించారు. ప్రస్తుతం అమెరికాలో ఎంబీఏ చేస్తున్న మహానార్యమన్ వేసవి సెలవుల నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వచ్చారు. తరతరాలుగా గ్వాలియర్- చంబల్ ప్రాంతంలో సింధియాల కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తనయుడిని సైతం రాజకీయాల్లోకి తీసుకురావాలని జ్యోతిరాదిత్య భావిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ ప్రచార కార్యక్రమాలకు తనతో పాటు కుమారుడిని కూడా వెంట తీసుకువెళ్తున్నారు.
శివపురి నియోజక వర్గంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరైన మహానార్యమన్ తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగే తండ్రి హాజరుకాలేని కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజలతో మమేకమయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. రాజవంశీకుడు అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా ఉండే మహానార్యమన్ ఎక్కడికి వెళ్లినా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడంటూ.. ఇది అతడి రాజకీయ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని సింధియా కుటుంబ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా సింధియా కుటుంబం దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా మొదట జన్ సంఘ్ నుంచి పోటీ చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారారు. కాగా అదే కుటుంబానికి చెందిన బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయ రాజే సింధియా, ఆమె కుమార్తెలు వసుంధరా రాజే(రాజస్థాన్ సీఎం), యశోదర రాజే(మధ్యప్రదేశ్ ఎంపీ) బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ సింధియాలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు పోటీకి నిలబడలేదు. గ్వాలియర్- చంబల్ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో సుమారు 34 అసెంబ్లీ స్థానాల్లో సింధియా కుటుంబ సభ్యులు, వారి అనుచరులు గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వారి బాటలోనే..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలు రాజకీయ నాయకుల వారసులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్థన్ సింగ్ గత ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కొడుకు కార్తికేయ కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జ్యోతిరాదిత్య కూడా వారసుడి రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment