
సాక్షి, కోల్‌కతా : బాహుబలి ఫీవర్ ఇంకా భారతీయులను వదలడం లేదు. తాజాగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్‌కతాలో బాహుబలిలోని మాహిష్మతి నగర నమూనాలో మండపాన్ని నిర్మించి అందులో దుర్గమ్మను ప్రతిష్టించి భక్తులు ఆరాధిస్తున్నారు. కలకత్తా కాళిగా కొలువైన అమ్మవారిని బెంగాలీలు నవరాత్రుల్లో భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు. అందులో భాగంగా విభిన్న రకాల కళాకృతులతో కూడిన మండపాలను ఏర్పాటు చేస్తారు.
అంతేకాక ప్రతి ఏడాది నవరాత్రుల సందర్భగా అద్భుతైన కళాఖండాలతో మండపాలను రూపొందించేవారి మధ్య పోటీలను సైతం అక్కడివారు నిర్వహిస్తారు. ఈ పోటీలో భాగంగా.. శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ వారు.. మాహిష్మతి నగరాన్ని (బాహుబలి చిత్రంలో ఎలా చూపారో అలా) రూపొందించి అమ్మవారిని అందులో ప్రతిష్టించారు.
బాహుబలి సెట్టింగ్‌లో ఏర్పాటు చేసిన దుర్గమ్మను చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సెట్టింగ్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ వచ్చిందని.. ఇక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

