అంగారపర్ణుడి గర్వభంగం | Puraniti story | Sakshi
Sakshi News home page

అంగారపర్ణుడి గర్వభంగం

Published Sun, Jul 17 2016 3:09 AM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

అంగారపర్ణుడి గర్వభంగం

అంగారపర్ణుడి గర్వభంగం

పురానీతి
అంగారపర్ణుడు అనే గంధర్వుడు కుబేరుడి స్నేహితుడు. కుబేరుడంతటి వాడు తనకు స్నేహితుడైనందున గర్వం తలకెక్కించుకున్నాడు. ఎంతటి వారినైనా లెక్కచేయకుండా విచ్చలవిడిగా సంచరించేవాడు. పైగా స్త్రీలోలుడు. అర్ధరాత్రి వేళలో తన భార్యతో, అంతఃపుర కాంతలతో గంగానది వద్దకు వచ్చి జలక్రీడలతో వినోదం పొందేవాడు. అంగారపర్ణుడు జలక్రీడలాడే సమయంలో అటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. ఒకవేళ కర్మకాలి వచ్చినా, అతడి చేతిలో చచ్చి పరలోకగతులయ్యేవారు.
 అంగారపర్ణుడు ఇలా స్వైరవిహారం చేస్తున్న కాలంలో పాండవులు ఏకచక్రపురంలో ఉండేవారు.

బకాసురుడిని భీముడు వధించాక ఇక ఏకచక్రపురంలో ఉండి చేసేదేమీ లేదని వారు భావించారు. ఈలోగా ద్రుపద మహారాజు ద్రౌపదీ స్వయంవరాన్ని ప్రకటించాడు. స్వయంవరానికి వెళ్లాలని పాండవులు ఉవ్విళ్లూర డంతో కుంతీదేవి అందుకు సమ్మతించింది. పాంచాల రాజ్యంలో సురక్షితంగా ఉండవచ్చని కూడా ఆమె తలపోసింది. ఒకనాడు పాండవులు ఏకచక్రపురాన్ని వీడి పాంచాల రాజ్యానికి కాలినడకన బయలుదేరారు. ఒకనాటి రాత్రి పాండవులు గంగానది సమీపానికి చేరుకున్నారు.

గంగాతీరంలోని సోమశ్రవ తీర్థంలో స్నానమాచరించి, గంగను పూజించాలని వారు సంకల్పించారు. అదే మార్గంలో అర్జునుడు ముందు నడవగా మిగిలిన వారు అతడిని అనుసరిస్తూ నడక సాగించారు. వారు నది ఒడ్డుకు చేరుకునే సమయానికి అంగారపర్ణుడు తన అంతఃపురకాంతలతో నదిలో జలక్రీడలు ఆడుతూ కేళీవినోదంలో మునిగి ఉన్నాడు. అపరిచితుల పదఘట్టనలు వినిపించడంతో చిరాకుపడి ఒడ్డుకు వచ్చి, అర్జునుడిని అడ్డగించాడు. అకస్మాత్తుగా గంధర్వుడు ప్రత్యక్షం కావడంతో అర్జునుడితో పాటు, అతడి వెనుకగా వస్తున్న మిగిలిన పాండవులు, కుంతీదేవి తటాలున నిలిచిపోయారు.
 
‘ఓరీ నరుడా! సంధ్యవేళలు, అర్ధరాత్రి సమయాలు యక్షగంధర్వ దానవులు స్వేచ్ఛగా సంచరించే సమయాలు. ఎంతటి బలవంతులైన రాజులైనా నరులు ఈ సమయాల్లో ఈ ప్రాంతాల్లో సంచరించరు. అర్ధరాత్రివేళ నేను సంచరించే ప్రాంతంలోకి ఎందుకు అడుగుపెట్టారు? నేనెవరినో తెలియదా? నా పేరెప్పుడూ వినలేదా? నేను అంగారపర్ణుడిని. కుబేరుడి అనుంగు మిత్రుడిని... ఇప్పటికైనా మించినది లేదు. వెనుదిరిగి ప్రాణాలు దక్కించుకోండి’ అంటూ గద్దించాడు.
 
అర్జునుడు వాని పలుకులు విని నవ్వుతూ ‘సంధ్యా సమయాలు, అర్ధరాత్రి వేళల్లో సంచరించడానికి అశక్తులు, అర్భకులు భయపడతారు. మాకు అలాంటి భయాలేవీ లేవు. నువ్వు కుబేరుడి మిత్రుడివి కావచ్చు గాక. ఇది పవిత్ర గంగానది. ఈ నదిలో స్నానమాచరించే హక్కు, పూజలు చేసుకునే హక్కు అందరికీ సమానమే. ఇది నీ సొత్తు కాదు’ అని బదులిచ్చాడు.
 
అర్జునుడి ప్రత్యుత్తరంతో అంగారపర్ణుడు మండిపడ్డాడు. ‘నన్నే ధిక్కరిస్తావా..? ఎంత ధైర్యం..?’ అంటూ అస్త్రాలను ఎక్కుపెట్టాడు. అర్జునుడు ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తన గాండీవాన్ని సంధించాడు. ఇద్దరికీ హోరాహోరీ పోరు జరిగింది. చివరకు అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించడంతో అంగారపర్ణుడు సొమ్మసిల్లి నేలకూలాడు. అర్జునుడు అతడిని పట్టి తెచ్చి ధర్మరాజు కాళ్ల ముందు పడేశాడు. ఈలోగా అంగారపర్ణుడి పట్టమహిషి కుంభీనన విలపిస్తూ కుంతీదేవి కాళ్లపై పడి తనకు పతిభిక్ష పెట్టాలంటూ వేడుకుంది. కుంతి ఆమెకు అభయమిచ్చింది. ఈలోగా అంగారపర్ణుడు స్పృహలోకి వచ్చాడు. కుంభీననకు తల్లి అభయమివ్వడంతో ధర్మరాజు ఆమె కోరికను మన్నించి, అంగారపర్ణుడిని ఆమెకు అప్పగించాడు.
 
‘కుబేరుడంతటి వాడు నా స్నేహితుడనే గర్వం తలకెక్కి మిమ్మల్ని అడ్డుకున్నాను. మీ శౌర్యప్రతాపాలను తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించండి’ అంటూ అంగారపర్ణుడు వేడుకున్నాడు. ’బలగర్వంతో ఎవరినీ కించపరచకు. ఎవరినీ హింసించకు. ప్రకృతి ఏ ఒక్కరి సొత్తుకాదు’ అంటూ ధర్మరాజు అతడికి హితబోధ చేసి, విడిచిపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement