వ్యాసుడి పలుకులు | Dhitarashtra Story In Puranithi | Sakshi
Sakshi News home page

వ్యాసుడి పలుకులు

Published Sun, Jul 21 2019 8:06 AM | Last Updated on Sun, Jul 21 2019 8:06 AM

Dhitarashtra Story In Puranithi - Sakshi

కురుక్షేత్రంలో తన కుమారులందరూ మృతిచెందారన్న వార్త తెలిసిన ధృతరాష్ట్రుడు తీవ్రమైన దుఃఖంతో మూర్ఛిల్లాడు. పరిచారికలు అతడి ముఖం మీద నీళ్ళు చిలకరించి సేద తీర్చారు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. మూర్ఛనుండి తేరుకున్న ధృతరాష్ట్రుడు వ్యాసుడికి నమస్కరించి ‘మహామునీ! నా దుర్గతి చూశావా! కుమారులంతా మరణించారు. బంధుమిత్రులు నశించారు. సంపదలంతా ఊడ్చుకు పోయాయి. అయినా నా ప్రాణాలు నన్ను అంటిపెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి‘ అని దుఃఖించాడు.

ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి వ్యాసుడు ‘కుమారా! సకల శాస్త్రాలూ తెలిసిన వాడివి. చనిపోయిన కుమారులకోసం దుఃఖించటం సమంజసం కాదు. పుట్టినవాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికీ శాశ్వతం కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు. కుమారా! అసలు నీ కుమారులకూ పాండుసుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా! జూదక్రీడా సమయాన విదురుడు నీకు అనేక విధాల చెప్పినా నీవు వినక ఫలితం అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే. నీ మేలు కోరి నీకు ఒక దేవరహస్యం చెప్తాను విను.

ఒకసారి నేను దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు, నారదాది మహామునులు ఉండగా భూదేవి అక్కడకు వచ్చి ‘దేవతలారా! నాకు రోజురోజుకు భారం పెరిగి పోతోంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి‘ అని అడిగింది. అప్పుడు విష్ణువు  ‘భూదేవీ! నీవడిగిన దానికి తగు సమయం ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు నూరుగురు కుమారులు కలుగుతారు. వారిలో జ్యేష్ఠుడైన దుర్యోధనుడు మహాబలిష్టుడు, కోపిష్టి. పరుల ఉన్నతిని సహించ లేని వాడూ అవుతాడు. అతడు అందరితోనూ వైరం పెట్టుకుంటాడు. దుర్యోధనుడి కారణంగా కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. అతడికి తోడుగా అతడి మేనమామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుడు అనుచరులుగా ఉంటారు.

అతడికి ఈ భూమిలోని రాజులంతా సాయానికి వచ్చి నశించి పోతారు. అప్పుడు నీ భారం తగ్గ కలదు‘ అని పలికాడు. ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడనుండి వెళ్ళిపోయింది. విష్ణువు ఆదేశానుసారం కలిపురుషుడు దుర్యోధనుడిగా జన్మించాడు. నీ కుమారుడికి భూమిని అంతా పాలించాలని దుర్బుద్ధి పుట్టి పాండవుల రాజ్యాన్ని అన్యాయంగా అపహరించి వారి రాజ్యాన్ని వారికి ఇవ్వక కీడు తలపెట్టాడు. ఇప్పుడు ఫలితం అనుభవించాడు. ఇదంతా దైవనిర్ణయం. దీనిని ఎవరూ తప్పించలేరు కనుక నీ కుమారుల కొరకు నీవు చింతించనవసరం లేదు. నీ శోకాన్ని జ్ఞానాగ్నిలో  దగ్ధం చెయ్యి. ప్రశాంతతను పొందు‘ అని పలికాడు వ్యాసుడు.

ధృతరాష్ట్రుడు వ్యాసుడితో ‘మహానుభావా! అమృతతుల్యమైన నీ మాటల వల్ల నాకు దుఃఖోపశమనం కలిగింది. నేను ఇక పాండవులను నా కుమారుల వలె ఆదరిస్తాను‘ అని పలికాడు. ఆ మాటలు విని వ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించి వెళ్ళాడు. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement