ఆమె ఒక రాకుమార్తె. పేరు పృథ. తండ్రి పేరు కుంతిభోజుడు కాబట్టి ఆమెను కుంతి అన్నారు సన్నిహితులు. దాంతో లోకానికి అదే పేరుతో పరిచయమైంది ఆమె. ఒకరోజు కుంతిభోజుడి ఆస్థానానికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఆ సమయంలో కుంతిభోజుడు రాజకార్యాలలో తల మునకలుగా ఉండటం వల్ల తన కుమార్తెను ఆయన సేవకు నియోగించాడు. దుర్వాస మహర్షి కుంతిభోజుడి అతిథిగా ఉన్నంతకాలం రాకుమార్తె కుంతి స్వయంగా ఆయనకు అవసరమైన సకల సదుపాయాలూ సమకూరుస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉంది. రాకుమార్తె వినయ విధేయతలకు దుర్వాసుడు అమితంగా ఆనందించాడు. తాను వెళ్లేటప్పుడు అడక్కుండానే ఆమెకు ఓ వరం ఇచ్చాడు. అది మహా మహిమాన్వితమైన పుత్ర ప్రదాన మంత్రమని, ఆ మంత్రాన్ని మననం చేస్తూ ఏ దైవాన్ని ధ్యానిస్తే ఆ దైవం ప్రత్యక్షమై ఆ మంత్రాన్ని ఆవాహన చేసిన స్త్రీ గర్భంలో తన అంశని ప్రవేశపెడతాడని చెప్పి, ఆశీర్వదించి వెళ్లిపోయాడు.
తానొక కన్య. తాను చేసిన సేవ పరమ కోపిష్టిగా పేరొందిన దుర్వాస మహర్షికి. ఆయనను మెప్పించడమే చాలా కష్టమని ఆయన కోపానికి జడిసి ఎవరూ ఆయన జోలికి వెళ్లరు. అటువంటిది తన ను ఆ మహర్షి మెచ్చుకోవడమేగాక వరమిచ్చాడని ఆమెకు అమితానందం కలిగింది. అంతలో ఆమెకు ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. మహర్షి చెప్పిన మంత్రం నిజంగా అంతటి మహిమగలదేనా? ఆ మంత్రానికి దేవతలు దిగి వస్తారా... అని. అంతే! యవ్వన చాపల్యం వల్ల ముందు వెనకలు ఆలోచించకుండా తన మందిరంలోనికి వెళ్లి, తలుపులు వేసుకుని మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉండగా గవాక్షం గుండా సూర్యకిరణాలు కనిపించాయి. తలెత్తి చూసేసరికి సూర్యబింబం అందంగా కనిపించింది. అంతే! సూర్యుడు తనకు ప్రత్యక్షం కావాలని కోరుకుంది. తక్షణం సూర్యుడు మానవ రూపంలో ఆమె ముందుకు వచ్చి నిలుచున్నాడు.
తన రూపురేఖలు చూస్తూ అప్రతిభురాలై నిలుచుండి పోయిన కుంతితో ‘‘రాకుమారీ! నీవు కోరిన విధంగా నీకు నా అంశతో కూడిన కుమారుని ప్రసాదిస్తున్నాను’’అన్నాడు. తాను కన్యనని, తనకు ఇప్పుడు కుమారుడు పుడితే లోకంలో అపవాదు వస్తుందని, కనుక వచ్చిన దారినే వెళ్లిపొమ్మంటూ చేతులు జోడించింది కుంతి. తాను ఆ మంత్రానికి వశుడినని, తాను వచ్చి, ఊరికే వెళ్లడానికి వీలు లేదనీ, అయినా ఆమెకు వచ్చిన ముప్పు లేదని, ఆమె కన్యత్వం ఏమీ చెడదని వరమిచ్చాడు. తన కిరణాల ద్వారా తన అంశను ఆమెలో ప్రవేశ పెట్టి, ఆమె అలా చూస్తూ ఉండగానే అంతర్థానమైపోయాడు. వెంటనే కుంతి గర్భం దాల్చడం, దివ్యతేజస్సుతో కూడిన కుమారునికి జన్మనివ్వడం, లోకనిందకు వెరచి ఆ కుమారుని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టడం, ఆ పెట్టె కాస్తా పిల్లలు లేక బాధపడుతున్న సూతుడికి దొరకడం, అతను ఆ పిల్లవాడికి కర్ణుడని పేరు పెట్టి పెంచుకోవడం, ఆ తర్వాత జరిగిందేమిటో అందరికీ తెలిసిందే.
దుర్వాసుడు ఆమెకు అనాలోచితంగా వరమివ్వడం, ఆ వర ప్రభావాన్ని ఆమె పరీక్షించాలనుకోవడం, సూర్యుడు ప్రత్యక్షం కావడం, కన్య అని తెలిసినా ఆమెకు పుత్రుణ్ణి ప్రసాదించడం... ఇవన్నీ చాలా చిత్రంగా తోస్తున్నాయి కదూ... అయితే, అదే జరక్కపోతే మహాభారతంలో కర్ణుడు ఎలా ఉద్భవించేవాడు? ఆ తర్వాత కథంతా ఎలా జరిగేది? అదంతా లోకకల్యాణానికే జరిగిందనుకోవాలి మనం. మనం ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే, అవతలి వారి అర్హత, అవసరం ఏమిటో తెలుసుకోకుండా మన వద్ద ఉన్నది కదా అని ఏది పడితే అది అయాచితంగా ఇచ్చెయ్యడం తప్పు... దీనినంతటినీ మనం నేటికాలంలో పిల్లలు అడక్కుండానే సమకూరుస్తున్న సదుపాయాలతో పోల్చుకోవచ్చు. అది అత్యాధునిక హంగులున్న చరవాణి కావచ్చు. ఖరీదైన వాహనం కావచ్చు... వాటి ఫలితాలు, పర్యవసనాలు మనం చూస్తూనే ఉన్నాం కదా...
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment