విశ్వామిత్రుడి భంగపాటు | Vishwamitra of Puraniti story | Sakshi
Sakshi News home page

విశ్వామిత్రుడి భంగపాటు

Published Sun, Jul 24 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

విశ్వామిత్రుడి భంగపాటు

విశ్వామిత్రుడి భంగపాటు

పురానీతి
గాధి కొడుకైన విశ్వామిత్రుడు తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యాన్ని తన బలసంపదతో అపారంగా విస్తరించాడు. అతడిని ఎదిరించే రాజులే ఉండేవారు కాదు. దాంతో బలగర్వం పెరిగి, క్షాత్రబలాన్ని మించినది లేదనే భ్రమలో బతికేవాడు. రోజూ సభలో కొలువుదీరి వందిమాగధుల స్తోత్రపాఠాలు వింటూ పొద్దుపుచ్చేవాడు.  ఇలా ఉండగా, విశ్వామిత్రుడికి ఒకనాడు వేటకు వెళ్లాలనే సరదా పుట్టింది. విశ్వామిత్రుడు, అతడి పరివారం ఆయుధాలు ధరించి వేట కోసం అరణ్యమార్గం పట్టారు. కీకారణ్యానికి చేరుకుని, పొద్దంతా వేట సాగించారు. పొద్దుగూకే వేళకు బాగా అలసట చెందారు.

ఇక వేట చాలించి, ఆహారాన్వేషణలో పడ్డారు. కొంత దూరం ముందుకు వెళ్లగా, కొందరు ముని బాలకులు కట్టెలు, దర్భగడ్డి ఏరుకుంటూ కనిపించారు. అక్కడకు కనుచూపు మేరలోనే ఒక ఆశ్రమం కనిపించింది.
 విశ్వామిత్రుడు ఆ మునిబాలకుల దగ్గరకు వెళ్లి ‘అదిగో! అక్కడ కనిపిస్తున్న ఆశ్రమం ఎవరిది?’ అని అడిగాడు.
 ‘మహారాజా! అది మహర్షి వశిష్ఠుల వారి ఆశ్రమం. మేము ఆయన శిష్యులమే’ అని బదులిచ్చారు.  
 శిష్యుల ద్వారా విశ్వామిత్రుడి రాక గురించి సమాచారం తెలుసుకున్న వశిష్ఠుడు వెంటనే విశ్వామిత్రుడికి ఎదురేగి, స్వాగతం పలికాడు. అర్ఘ్య పాద్యాదులిచ్చి సత్కరించాడు.
 వశిష్ఠుడి వద్ద నందిని అనే హోమధేనువు ఉండేది. కామధేనువులాంటి ఆ హోమధేనువు కోరినవన్నీ ఇచ్చేది. వేటలో అలసి సొలసిన విశ్వామిత్రుడికి, అతడి పరివారానికి హోమధేనువు మహిమతో పంచభక్ష్య పరమాన్నాలు తృప్తిగా వడ్డించాడు.
 
నందిని మహిమను చూశాక విశ్వామిత్రుడికి వశిష్ఠుడి వైభోగంపై కన్ను కుట్టింది. కోరినదల్లా ఇచ్చే ఇలాంటి ధేనువు తన వద్ద ఉండాలే తప్ప ముక్కుమూసుకుని అడవుల్లో తపస్సు చేసుకునే వశిష్ఠుడి వంటి ముని వద్ద కాదని అనుకున్నాడు. నయాన అయినా భయాన అయినా వశిష్ఠుడి నుంచి నందినిని ఎలాగైనా దక్కించుకోవాలని కూడా అనుకున్నాడు.
 భోజనాదికాలు ముగిశాక విశ్వామిత్రుడు, అతడి పరివారం విశ్రమించారు. విశ్వామిత్రుడికి మాత్రం వశిష్ఠుడి హోమధేనువును ఎలా దక్కించుకోవాలా అనే ధ్యాసతో కునుకు పట్టలేదు. ఉదయాన్నే నిద్రలేచి, స్నాన సంధ్యలు ముగించుకున్న తర్వాత విశ్వామిత్రుడి పరివారం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది.
 
వీడ్కోలు పలకడానికి వచ్చిన వశిష్ఠుడిని నందినిని తనకు ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు. ‘మునివర్యా! అడవులలో తపస్సు చేసుకునే మీకు సంపదలనిచ్చే హోమధేనువు దేనికి? పాల కోసమే అయితే వేరేదైనా ధేనువును పెంచుకోవచ్చు కదా! దీనిని నాకు అప్పగిస్తే, దీని బదులు పాలిచ్చే లక్ష గోవులను నీకు ఇస్తా’ అని పలికాడు.
 ‘రాజా! దీని బదులు లక్ష గోవులు దేనికి? వాటిని నేనెలా మేపగలను? అయినా, ఇది పవిత్రమైన హోమధేనువు. దీనిని ఇతరులకు ఇవ్వతగదు’ అని వశిష్ఠుడు బదులిచ్చాడు.
 వశిష్ఠుడి సమాధానంతో విశ్వామిత్రుడికి చర్రున కోపం వచ్చింది. ‘మునివర్యా! నయాన ఇవ్వకుంటే, బలవంతంగానైనా నీ ధేనువును తీసుకుపోగలను. నువ్వు నన్నేమీ చేయలేవు’ అన్నాడు.

నందినిని వెంట తీసుకు రమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. భటులు దానిని పట్టి తేవడానికి వెళ్లారు. ఉన్న చోటు నుంచి కదలడానికి నందిని మొరాయించింది. భటులు బలప్రయోగం చేశారు. ఆర్తనాదాలు చేస్తూ అది వశిష్ఠుడి వద్దకు వచ్చింది.
 ‘మునివర్యా! నన్ను ఈ దుర్మార్గులకు ఎందుకు ఇచ్చేస్తున్నావు?’ అని దీనంగా అడిగింది. వశిష్ఠుడు బదులు పలకలేదు.
 వశిష్ఠుడు తనను వారికి ఇవ్వలేదని నందినికి అర్థమైంది. విశ్వామిత్రుడి భటులు మళ్లీ దానిని బలవంతంగా లాక్కుపోవడానికి ప్రయత్నించారు.
 
ఈసారి నందిని నిస్సహాయంగా ఆక్రందనలు చేయలేదు.
 క్రోధావేశంతో తోక ఝాడించి, కొమ్ములు ఝుళిపించింది.
 నందిని శరీరం నుంచి వేలాదిగా సాయుధ సైనికులు పుట్టుకొచ్చారు. ఒక్కుమ్మడిగా దాడి చేసి విశ్వామిత్రుడి సైనికులను తరిమి తరిమి కొట్టారు.
 క్షాత్రబలమే గొప్పదనే భ్రమలో ఉన్న విశ్వామిత్రుడికి కళ్లు తెరుచుకున్నాయి. తపోబలమే క్షాత్రబలం కంటే గొప్పదని గ్రహించాడు. తపోసాధనకు ఉపక్రమించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement