తొందరపాటు | this story about of Puraniti Kadruva | Sakshi
Sakshi News home page

తొందరపాటు

Published Sun, Sep 18 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

తొందరపాటు

తొందరపాటు

పురానీతి
కశ్యపప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువ లకు సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ అత్యంత పొడవుగా, బలమైన దేహం కలిగిన వెయ్యిమంది పుత్రులను, తేజోవంతమైన శరీరంతో అత్యంత చురుకయిన ఇద్దరు కుమారులు కావాలని కోరుకుంటారు. దాంతో కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కొంతకాలానికి కద్రువకు ఆదిశేషుడు, కర్కోటకుడు, వాసుకి మొదలైన పొడవాటి శరీరం గల వెయ్యిసర్పాలు పుడతాయి. వినత కు మాత్రం ఇంకా పుట్టరు. దాంతో తొందరపడి ఒక అండాన్ని పగులకొడుతుంది.

ఆ అండం నుంచి కాళ్లులేకుండా, మొండెం మాత్రమే ఉన్న తేజోరూపుడు పుడతాడు. అతడు పుడుతూనే ‘‘నువ్వు సవతిని చూసి కుళ్లుపడి, గుడ్డును పగలగొట్టి నా అవిటి జన్మకు కారకురాలైనావు కాబట్టి నీ సవతికే దాసీగా ఉంటావు’’ అని శపిస్తాడు.
 
తన తప్పిదానికి కుమిలిపోతున్న తల్లితో బాధపడకు. ‘‘కనీసం రెండో అండాన్నైనా జాగ్రత్తగా ఉంచు. అందులోనుంచి జన్మించినవాడు నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడు’’ అని చెప్పి, సప్తాశ్వాలను పూన్చిన సూర్యుని రథానికి సారథిగా వెళ్లిపోతాడు. అతడే మాతలి. సూర్యుని రథసారథి. అయితే తొడలు లేవు కాబట్టి అనూరుడుగానే సుపరిచితుడయ్యాడు. ఇది ఇట్లా ఉండగా వినత, కద్రువలు ఒక రోజు సముద్రతీరానికి విహారానికి వెళ్తారు. వారికి అక్కడ ఇంద్రుని రథాన్ని లాగే ఉచ్ఛైశ్రవం అనే గుర్రం కనిపిస్తుంది. దాన్ని చూపిస్తూ కద్రువ వినతతో ‘‘చూడు, ఆ గుర్రం ఎంతో తెల్లగా ఉంది కానీ, దాని తోక మాత్రం నల్లగా ఉంది’’ అంటుంది.

ఆపాదమస్తకం గుర్రం తెల్లగా ఉండటాన్ని చూసిన వినత ‘‘లేదక్కా, గుర్రం తోక కూడా పాలలా తెల్లగానే ఉంది కదా’’ అంటుంది. ఆ విషయంలో ఇద్దరి మధ్యా వాదులాట జరుగుతుంది. ఆ పూట ఇక చీకటి పడింది కాబట్టి, మరునాడు వచ్చి, ఆ గుర్రాన్ని చూసి, దాని తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను. నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి అని పందెం వేస్తుంది కద్రువ. అందుకు అంగీకరిస్తుంది వినత.

ఆ రాత్రి కద్రువ తన కుమారులను పిలిచి, మీలో ఎవరైనా వెళ్లి ఉచ్ఛైశ్రవం తోకకు చుట్టుకుని, దానిని నల్లగా కనిపించేట్లు చేయండి అని అడుగుతుంది. అందుకు కర్కోటకుడనే నాగు తప్ప మిగిలిన ఎవరూ అంగీకరించరు. దాంతో కోపగించిన కద్రువ తల్లిమాట వినలేదు కాబట్టి మీరందరూ పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి చస్తారని శపిస్తుంది. కర్కోటకుడు వెళ్లి గుర్రం తోకను చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తాడు. పందెం ప్రకారం వినత కద్రువకు దాస్యం చేస్తుంటుంది.
 కొంతకాలానికి రెండవ అండం పగిలి, అందులోనుంచి అత్యంత పరాక్రమవంతుడైన గరుడుడు పుడతాడు.

అతణ్ణి చూసిన కద్రువ ‘‘నువ్వు నాకు దాసీవి కాబట్టి నీకుమారుడు కూడా మాకు దాసుడే’’ అవుతావు అని చెప్పి, అతని చేత చాకిరీ చేయించుకుంటుంది. కద్రువ కుమారులైన సర్పాలను తన వీపుమీద ఎక్కించుకుని రోజూ వినువీధికి వ్యాహ్యాళికి తీసుకెళ్లడం గరుత్మంతుడి విధుల్లో ఒకటి. ఓ రోజున అలా గరుడుడు సూర్యమండలం దాకా వెళ్లడంతో సర్పాలన్నీ నల్లగా మాడిపోతాయి. దాంతో కోపించిన పెద్దమ్మ గరుత్మంతుణ్ణి తిడుతుంది. మనస్తాపానికి గురైన గరుత్మంతుడు తన తల్లిని దాస్యం నుంచి విడిపించాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు తల్లీకొడుకులు బాగా ఆలోచించుకుని అసాధ్యమైన కార్యం కాబట్టి దేవలోకం నుంచి అమృతం తెచ్చిపెట్టమని అడుగుతారు.
 
గరుత్మంతుడు ఎట్లాగో కష్టపడి అమృతాన్ని తీసుకొచ్చి తల్లిని దాస్య విముక్తురాలిని చేసి, తానూ దాస్యం నుంచి బయటపడతాడు. అయితే అమృతం తాగితే నాగులకు అమరత్వం సిద్ధిస్తుందన్న భయంతో ఇంద్రుడు ఆ అమృతాన్ని వాటికి దక్కకుండా చేయడం వేరే కథ. గరుత్మంతుడి వేగానికి ముచ్చటపడిన విష్ణుమూర్తి అతణ్ణి తన వాహనంగా స్వీకరిస్తాడు. వినత కుమారుడు కాబట్టి అతడే వైనతేయుడుగా కూడా ప్రఖ్యాతి చెందుతాడు.
 ఇక్కడ మనం గ్రహించలసినదేమంటే మత్సరం అంటే కుళ్లుబోతుతనం, తొందరపాటు తనం వల్లే కదా, వినత, ఆమె కుమారుడు అంత కష్టపడవలసి వచ్చింది! అందుకే ఆ రెండు అవలక్షణాలనూ వదిలిపెట్టాలని చెబుతారు పెద్దలు.
- డి.వి.ఆర్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement