
మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు, షరతు మేరకు పన్నెండేళ్లపాటు అరణ్యవాసం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇక సంవత్సరకాలం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే మాటలు కాదు, ఎవరి కంటా పడకుండా బతకాలి. అందుకోసం వారు మత్స్యదేశాధిపతి విరాటరాజు కొలువులో చేరాలనుకున్నారు. ధర్మరాజు కంకుభట్టు పేరుతో జూదమాడి రాజును సంతోషపెట్టేవాడిగానూ, భీముడు వలలుడనే పేరుతో వంటవానిగానూ, అర్జునుడు నపుంసకుడిగా ఉంటూ అంతఃపుర స్త్రీలకు సంగీతం, లలిత కళలు నేర్పుతూ, చక్కటి కథలు చెబుతూ బృహన్నల అనే పేరుతోనూ, నకులుడు గ్రంథికుడనే పేరుతో గుర్రాలను రక్షిస్తూ, అశ్వపాలకుడిగానూ, సహదేవుడు తంత్రీపాలుడి పేరుతో గోపాలకుడిగానూ, ద్రౌపది సైరంధ్రి పేరుతో రాణివాసపు స్త్రీలకు జడలు వేసి, పూలు మడిచే పనిలో ఉంటూ, రాణిగారి ప్రధాన పరిచారికగానూ ఉండాలనుకుంటారు.
ధర్మరాజు తమ పురోహితుడైన ధౌమ్యుడిని పిలిచి, తమ అభిప్రాయాన్ని చెబుతాడు. అప్పుడు ధౌమ్యుడు ‘‘రాజా, మీరు రాజాస్థానంలో ఉండబోతు న్నారు. మీకు తెలియనిదేమీ లేదు. అయినా, మీ మేలుకోరి నేను మీకు కొన్ని సూత్రాలను చెబుతాను. జాగ్రత్తగా వినండి. రాజులను పూర్తిగా నమ్మరాదు. రాజుగారి వాహనమో, మంచమో, ఏనుగో, ఆసనమో అధిరోహింపరాదు. ఏ ఆసనంలో కూర్చుంటే దుష్టులు సందేహపడతారో అక్కడ కూర్చోరాదు. రాజు అడగనిదే దేనినీ చెప్పరాదు. రాజస్త్రీలతో మైత్రి, పరిహాసం చేయరాదు. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోరాదు. రాజు సమ్మతించిన పనులు మాత్రమే చేయాలి. హితాన్నైనా, ప్రియంగానే తెలపాలి. రాజుకు ఇష్టంలేని వాటిని ఆచరించరాదు. రాజుగారి అహితులతో మాట్లాడరాదు. రాజుగారికి కుడివైపో, ఎడమవైపో మాత్రమే కూర్చోవాలి. రాజు సమక్షంలో ఆవులించడం, ఉమ్మివేయడం, గట్టిగా నవ్వడం పనికిరాదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎప్పుడూ రాజును, వారి పుత్రాదులను పొగుడుతూ ఉండాలి. సత్యాన్నే పలకాలి. ఎప్పుడూ చురుకుగా ఉండాలి. రాజుగారిచ్చిన రథమో, వస్త్రాలో, అలంకారమో ప్రతిరోజూ ధరించాలి. అప్పుడే రాజుకు ప్రీతిపాత్రమైన వారిగా ఉంటారు. ఇలా నడుచుకుని ఒక సంవత్సర కాలం పాటు గడిపి మీ దేశం వెళ్లి సుఖంగా జీవించండి’’ అని చెప్పి ఆశీర్వదించాడు. ధౌమ్యుడు ధర్మరాజుకు చెప్పిన ఈ నీతి సూత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయాలే. ఇప్పుడు రాజులు ఉండకపోవచ్చు, ఉన్నతాధికారులు కూడా మనకు రాజులే కదా!
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment