ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు | Rich people building underground homes amid war fears | Sakshi
Sakshi News home page

ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు

Published Sun, Dec 1 2024 8:11 AM | Last Updated on Sun, Dec 1 2024 8:11 AM

Rich people building underground homes amid war fears

వర్తమాన ప్రపంచం శాంతిధామంగా ఏమీ లేదు. 
ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుకుంటున్నాయి. అణ్వాయుధాలను అమ్ములపొదిలో దాచుకున్న ధూర్తదేశాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికైనా వెనుకాడబోమని అడపా దడపా హెచ్చరికలు చేస్తూ, మిగిలిన దేశాలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింతగా ముదిరితే, మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినా రావచ్చు. యుద్ధంలో ఏ దేశమైనా తెగబడి అణ్వాయుధాలను ప్రయోగిస్తే, జరగరాని అనర్థాలు జరగవచ్చు. అణ్వాయుధ దాడులు జరిగిన చోట సామాన్యులు బతికి బట్టకట్టే అవకాశాలు కల్ల! అయితే, అణ్వాయుధాల దాడులు జరిగినా, క్షేమంగా బతికి బట్టకట్టడానికి వీలుగా ఆగర్భ శ్రీమంతులు ముందస్తుగా భూగర్భ స్వర్గాలను నిర్మించుకుంటున్నారు.

గడచిన శతాబ్దం స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. ఈ రెండు యుద్ధాలు గడచిన శతాబ్ది పూర్వార్ధంలోనే జరిగాయి. రెండు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా వివిధ దేశాల మధ్య అనేక యుద్ధాలు, కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ముంచుకు రావచ్చనే ముందుచూపుతో కొందరు ఆగర్భ శ్రీమంతులు ఇప్పటికే భూగర్భ దుర్గాలను నిర్మించుకున్నారు. మరికొందరు శ్రీమంతులు అదే పనిలో ఉన్నారు. బయటి నుంచి చూస్తే, అవి మామూలు నేలమాళిగల్లాగానే కనిపిస్తాయి. 

లోపలికి అడుగుపెడితే తెలుస్తుంది, వాటి అసలు సంగతి. అవి మామూలు నేలమాళిగలు కావు, కట్టుదిట్టమైన భూగర్భ దుర్గాలు. అణ్వాయుధాలకు కూడా చెక్కుచెదరవు. భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినా, అవి తట్టుకోగలవు. వాటి లోపల ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రళయం వచ్చి, ప్రపంచం అంతమైపోయినంత పని జరిగినా, వాటిలో ఉండేవారు నిక్షేపంగా, క్షేమంగా ఉండగలరు. ఈ భూగర్భ దుర్గాల లోపలి సౌకర్యాలను, విలాసాలను పరిశీలిస్తే, ఇవి భూగర్భ దుర్గాలు మాత్రమే కాదు, భూగర్భ స్వర్గాలు అనక తప్పదు.

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భూగర్భ స్వర్గాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్క ఏదీ లేదు. కొందరు సంపన్నులు బాహాటంగా ఇలాంటివి నిర్మించుకుంటుంటే, మరికొందరు అత్యంత గోప్యంగా రహస్య ప్రదేశాలలో నిర్మించుకుంటున్నారు. పలు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో అణ్వాయుధాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కొన్ని బహిరంగ నిర్మాణాలనే కట్టుదిట్టం చేశాయి. ఉదాహరణకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లోని భూగర్భ మెట్రో మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్లన్నింటినీ అణ్వాయుధ దాడులను తట్టుకునేలా నిర్మించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్‌ ప్రభుత్వం రాజధాని వాషింగ్టన్‌ డీసీ పరిసరాల్లో అణ్వాయు«ధ దాడులను తట్టుకునే భూగృహ స్థావరాలను నిర్మించింది. దేశంలోని అత్యున్నత వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని నిర్మించింది. 

అమెరికాలోని జంట భవంతులపై 2001 సెప్టెంబర్‌ 11న ఉగ్రవాద దాడి తర్వాత ‘కంటిన్యూయిటీ ఆఫ్‌ గవర్నమెంట్‌’ (ప్రభుత్వ కొనసాగింపు) పథకం కింద ఇలాంటి మరిన్ని భూగృహ స్థావరాల నిర్మాణానికి నిధుల కేటాయింపులు ప్రారంభించింది. ప్రమాదాలు ఎదురైనప్పుడు పౌరుల సంగతి పట్టించుకోకుండా, ప్రభుత్వం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తూ, గారెట్‌ గ్రాఫ్‌ అనే జర్నలిస్టు ‘రేవెన్‌ రాక్‌: ది స్టోరీ ఆఫ్‌ యూఎస్‌ గవర్నమెంట్స్‌ సీక్రెట్‌ ప్లాన్‌ టు సేవ్‌ ఇట్‌సెల్ఫ్‌– వైల్‌ ది రెస్ట్‌ ఆఫ్‌ అజ్‌ డై’ అనే పేరుతో పుస్తకం రాశాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని రేవెన్‌ రాక్‌ మౌంటెయిన్‌ కాంప్లెక్స్‌లో అమెరికా ప్రభుత్వం ‘కంటిన్యూయిటీ ఆఫ్‌ గవర్నమెంట్‌’ పథకం కింద ఇలాంటి భూగృహ స్థావరాలను నిర్మించింది. 

ఇవి జనాలకు తెలిసిన స్థావరాలు. ఇలాంటి రహస్య భూగృహ స్థావరాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. అణ్వాయుధ యుద్ధాలు సంభవిస్తే, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తాయనే ఎరుక కలిగిన అపర కుబేరులు కొందరు ముందు జాగ్రత్తగా ప్రళయ భీకర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా, బతికి బయటపడటానికి వీలుగా భూగర్భ స్వర్గాలను సొంత ఖర్చులతో నిర్మించుకుంటున్నారు. వీటి కోసం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భూగర్భ స్వర్గాలను నిర్మించుకున్న ఆగర్భ శ్రీమంతుల కథా కమామిషూ ఒకసారి చూద్దాం..

బిల్‌ గేట్స్‌ ఇళ్లన్నింటిలోనూ భూగృహాలు
మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్‌ మెడీనా ప్రాంతంలోని 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న భవంతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు ఆయనకు దాదాపు అరడజనుకు పైగా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెల్‌ మార్, రాంకో శాంటా ఫే, ఇండియన్‌ వెల్స్‌ ప్రాంతాల్లోను; ఫ్లోరిడాలోని హోబ్‌ సౌండ్, వెల్లింగ్టన్‌ ప్రాంతాల్లోను; మోంటానా బిగ్‌స్కై ప్రాంతంలోను బిల్‌ గేట్స్‌కు సొంత భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు అన్నింటిలోనూ సమస్త సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన సురక్షిత భూగృహాలు ఉన్నాయి. అణ్వాయుధ దాడులు జరిగినా, బయటి ప్రపంచంలో మహమ్మారులు వ్యాపించినా, భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినా చెక్కుచెదరని విధంగా వీటిని నిర్మించుకున్నారు. 

ఎలాన్‌ మస్క్‌ సైబర్‌ హౌస్‌
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ‘టెస్లా’, ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ తన కోసం అత్యంత సురక్షితమైన ‘సైబర్‌ హౌస్‌’ నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైబర్‌ హౌస్‌ను ఎప్పుడు ఎక్కడ నిర్మించ నున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఎలాన్‌ మస్క్‌ ఆలోచనలకు అనుగుణంగా రష్యన్‌ డిజైనర్‌ లెక్స్‌ విజెవ్‌స్కీ సైబర్‌ హౌస్‌ నమూనాకు రూపకల్పన చేశారు. అత్యంత దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన బహుళ అంతస్తుల భూగృహంగా దీనిని డిజైన్‌ చేశారు. అణ్వాయుధ దాడులకు చెక్కు చెదరకుండా ఉండటం ఒక్కటే దీని విశేషం కాదు, వైరస్‌లు, బ్యాక్టీరియాలు వంటి సూక్ష్మజీవుల నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారు. విద్యుదుత్పాదన కోసం సోలార్‌ ప్యానెల్స్, విండ్‌ టర్బైన్స్‌ వంటి వసతులతో పాటు, మంచినీటి సరఫరా కోసం వాటర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలకైనా చెక్కుచెదరని ఎయిర్‌లాక్‌ డోర్స్, మెటల్‌ రోల్‌ షట్టర్స్‌ తదితర వసతులతో సైబర్‌ హౌస్‌ను నిర్మించనున్నారు. సైబర్‌ హౌస్‌ డిజైన్‌ మూడేళ్ల కిందటే పూర్తయినా, దీని వాస్తవ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది.

హవాయి దీవిలో జూకర్‌బర్గ్‌ భూగృహం
‘ఫేస్‌బుక్‌’ అధినేత మార్క్‌ జూకర్‌బర్గ్‌ హవాయి దీవుల్లోని ఒకటైన కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని 100 మిలియన్‌ డాలర్లకు (రూ.843 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులోని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షితమైన భూగర్భ స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినా, నిర్మాణంలో ఉన్న భూగృహం ఫొటోలు మీడియాకు చిక్కాయి. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార సరఫరాకు  అంతరాయం లేనివిధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, నిరంతర మంచినీటి సరఫరా కోసం వాటర్‌ ప్యూరిఫికేషన్‌ సిస్టమ్, కీబోర్డు ద్వారా పనిచేసే సౌండ్‌ప్రూఫ్‌ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్‌ ఎలివేటర్లు, మెకానికల్‌ రూమ్, స్విమింగ్‌ పూల్, జిమ్, సినిమా థియేటర్‌ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో దీని నిర్మాణం సాగిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కల్పించగల ఈ భూగృహ నిర్మాణానికి 270 మిలియన్‌ డాలర్లు (రూ.2,278 కోట్లు) ఖర్చు కాగలదని అంచనా.

జెఫ్‌ బెజోస్‌ ఇళ్లలో భూగృహాలు 
అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ ఇప్పటికే ఫ్లోరిడా పరిధిలోని ఇండియన్‌ క్రీక్‌ దీవిలో మూడు భవంతులను నిర్మించుకున్నారు. ఈ మూడింటిలోనూ ఆయన సురక్షితమైన భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటి కోసం బెజోస్‌ 237 మిలియన్‌ డాలర్లు (రూ.1,999 కోట్లు) ఖర్చు చేశారు. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్‌ఫార్మర్‌కో వ్యవస్థాపకుడు, సియర్స్‌ మాజీ సీఈవో అమెరికన్‌ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్,  అమెరికన్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు టామ్‌ బ్రాడీ, గూగుల్‌ మాజీ సీఈవో ఎరిక్‌ ష్మీడ్, ఏకాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు కార్ల్‌ ఏకాన్‌ తదితరులు సైతం ఇండియన్‌ క్రీక్‌ దీవిలో జెఫ్‌ బెజోస్‌ తరహాలోనే భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.

భూగృహ నిర్మాణరంగంలో కంపెనీల పోటాపోటీ
భూగృహ నిర్మాణరంగంలో పలు కంపెనీలు పోటాపోటీగా నిర్మాణాలు సాగిస్తున్నాయి. అణ్వాయుధ దాడులు, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ముప్పునైనా తట్టుకుని నిలిచే భూగర్భ గృహాల నిర్మాణానికి కొత్త కొత్త నమూనాలకు రూపకల్పన చేస్తూ, అమిత సంపన్నులను తమ వైపుకు ఆకట్టుకుంటున్నాయి. న్యూక్లియర్‌ బంకర్‌ కంపెనీ, ఓపిడమ్‌ బంకర్స్, అట్లాస్‌ సేఫ్‌ సెల్లార్, సీబీఆర్‌ఎన్‌ షెల్టర్స్, స్పార్టమ్‌ సర్వైవల్‌ సిస్టమ్స్, యూఎస్‌ఏ బంకర్‌ కంపెనీ, రైజింగ్‌ ఎస్‌ బంకర్స్‌ వంటి కంపెనీలు కట్టుదిట్టమైన భూగర్భ నిర్మాణాలకు ప్రసిద్ధి పొందాయి. ఇవి భారీ ఎత్తున దేశ దేశాల్లో నిర్మాణాలను సాగిస్తున్నాయి. రైజింగ్‌ ఎస్‌ బంకర్స్‌ ఇటీవలి కాలంలో దాదాపు పది బంకర్లను న్యూజీలండ్‌లో ఏర్పాటు చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఇందుకు దీటుగా దేశ దేశాల్లో భూగర్భ స్థావరాల నిర్మాణాలను సాగిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులపై భయాందోళనలు ఉన్న సంపన్నులు కోట్లాది డాలర్లు వెచ్చిస్తూ వీటి ద్వారా తమ కోసం ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

ఆ దేశంలో ఇంటింటా భూగృహం
ప్రపంచవ్యాప్తంగా భూగృహాల సంఖ్యలో స్విట్జర్లండ్‌ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి ఇంటా సురక్షితమైన భూగృహం ఉంటుంది. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్‌ బంకర్లు, నివాస భవనాల్లోని ప్రైవేటు బంకర్లు సహా స్విట్జర్లండ్‌లో 3.70 లక్షలకు పైగా బంకర్లు ఉన్నట్లు అంచనా. అనుకోకుండా దేశంపై అణ్వాయుధ దాడులు జరిగితే, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడానికి వీలుగా స్విట్జర్లండ్‌ ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది. స్విట్జర్లండ్‌లోని ప్రతి భూగర్భ స్థావరం అత్యంత కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుంది. దాదాపు ఏడువందల మీటర్ల దూరంలో 12 మెగాటన్నుల అణుబాంబులు పేలినా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించడం విశేషం. సురక్షితమైన బంకర్ల నిర్మాణంలో స్విట్జర్లండ్‌కు దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో– 1963 నుంచి స్విట్జర్లండ్‌ ప్రభుత్వం అణ్వాయుధ దాడులను తట్టుకునే భూగర్భ స్థావరాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, విరివిగా నిర్మాణాలను చేపట్టింది. అణ్వాయుధ దాడుల పట్ల మరే దేశంలోనూ లేని సంసిద్ధతను కేవలం స్విట్జర్లండ్‌లో మాత్రమే చూడవచ్చు. విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలకు కూడా భరోసా కల్పించే ఏకైక దేశం స్విట్జర్లండ్‌ మాత్రమేనని చెప్పుకోవచ్చు.

భూగర్భ స్వర్గాల నిర్మాత
అమెరికన్‌ వ్యాపారవేత్త ల్యారీ హాల్‌ భూగర్భ స్వర్గాల నిర్మాణంలో ప్రసిద్ధుడు. భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ల్యారీ హాల్, సంపన్నుల కోసం అణ్వాయుధాలను తట్టుకునే భూగృహాలను కొన్నేళ్లుగా నిర్మిస్తున్నారు. ఆయన తన కోసం కాన్సస్‌ ప్రాంతంలో స్వయంగా భూగర్భ స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాన్సస్‌ ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ల్యారీ హాల్‌ 2008లో 20 మిలియన్‌ డాలర్లకు (రూ.168.75 కోట్లు) కొనుగోలు చేశారు. తర్వాత దీనిని తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. బయటి నుంచి చూస్తే, గుమ్మటంలా కనిపించే ఈ భూగృహంలో నేలకు దిగువన పదిహేను అంతస్తుల భవంతిని నిర్మించారు. ఇందులో హైస్పీడ్‌ ఎలివేటర్లు, నిత్యావసర సరుకులతో కూడిన జనరల్‌ స్టోర్, సినిమా థియేటర్, పిల్లలు చదువుకోవడానికి తరగతి గది, లైబ్రరీ, స్విమింగ్‌ పూల్, జిమ్, స్పా, వంట గదులు, భోజనశాలలు, కూరగాయలను పండించుకోవడానికి తగిన పొలం, చేపలు, రొయ్యల పెంపకానికి ఒక కొలను వంటి సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. విలాసవంతమైన సురక్షిత భూగృహాలను నిర్మించడంలో ల్యారీ హాల్‌ నైపుణ్యం తెలుసుకున్న సంపన్నులు చాలామంది ఆయన ద్వారానే తమ కోసం ప్రత్యేక భూగృహాలను ఇప్పటికే నిర్మించుకున్నారు. ఇంకొందరు నిర్మించుకుంటున్నారు.

సంపన్నుల చూపు.. న్యూజీలండ్‌ వైపు
ప్రపంచంలోని అమిత సంపన్నుల్లోని చాలామంది భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు న్యూజీలండ్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికన్‌ వ్యాపారవేత్త, పేపాల్‌ వ్యవస్థాపకుడు పీటర్‌ థీల్‌ న్యూజీలండ్‌ దక్షిణ ప్రాంతంలోని దీవిలో 73,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల దీవిలోని పరిసరాల సౌందర్యం దెబ్బతింటుందనే కారణంగా న్యూజీలండ్‌ ప్రభుత్వం 2022లో పీటర్‌ థీల్‌కు అనుమతి నిరాకరించింది. న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, ఓపెన్‌ ఏఐ అధినేత శామ్‌ ఆల్ట్‌మన్‌ వంటి వారు సైతం న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్, హాలీవుడ్‌ గాయని జూలియో ఇగ్లేసీయస్‌ సహా పలువురు సంపన్నులు న్యూజీలండ్‌లో భూగర్భ స్థావరాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement