ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ! | How I Used The Marie Kondo Method To Tidy Up My House | Sakshi
Sakshi News home page

ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ!

Published Sun, Nov 24 2024 8:47 AM | Last Updated on Sun, Nov 24 2024 8:48 AM

How I Used The Marie Kondo Method To Tidy Up My House

‘ఫేస్‌ ఈజ్‌ ది ఇండెక్స్‌ ఆఫ్‌ మైండ్‌’ అని ఇంగ్లిష్‌ నానుడి. అంటే, ముఖమే మనసుకు ప్రతిబింబం అన్నమాట! అలాగే, ఇల్లు కుటుంబ సభ్యుల మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఒద్దికగా సర్దుకుంటే, ఇల్లే స్వర్గసీమలా ఉంటుంది. చిందర వందరగా ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యులు గందరగోళంగా ఉంటారు. ఇంటిని ఒద్దికగా సర్దుకోవడం ఒక కళ. ఇంటి నిండా రకరకాల పనులు చేయడానికి మనుషులు ఉంటారు కాబట్టి సంపన్నుల ఇళ్లు మాత్రమే చక్కగా ఉంటాయి అనుకుంటే పొరపాటే! మనసుంటే, సామాన్యులు కూడా ఇంటిని శుభ్రంగా, చూడచక్కగా తీర్చిదిద్దు కోగలుగుతారు. ఇంటిని చూడముచ్చటగా తీర్చిదిద్దుకునే పద్ధతులపై జపానీస్‌ యువతి మేరీ కొండో చెబుతున్న పాఠాలు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. మేరీ కొండో ముద్దుపేరు ‘కోన్‌మారీ’. ఇల్లు సర్దుకోవడంలో ఈమె సూచించిన పద్ధతి ‘కోన్‌మారీ’ పద్ధతిగా ప్రసిద్ధికెక్కింది. కోన్‌మారీ కథ, ఆమె పద్ధతి కమామిషూ తెలుసుకుందాం..

జపాన్‌లోని ఒసాకా నగరంలో పుట్టిన మేరీ కొండోకు ఇంటిని చక్కగా సర్దుకోవడం అంటే ఐదేళ్ల వయసు నుంచే ఇష్టమైన వ్యాపకంగా ఉండేది. ఆ వయసు పిల్లలు బొమ్మలతో ఆటలాడుతుంటే, ఆమె మాత్రం ఇల్లు సర్దడంలో తలమునకలుగా ఉండేది. అప్పట్లో జపాన్‌ మాత్రమే కాదు, పలు ఇతర దేశాల్లోనూ చైనీస్‌ వాస్తు పద్ధతి ‘ఫెంగ్‌ షుయి’ వేలంవెర్రిగా ఉండేది. ఇంచుమించుగా ‘ఫెంగ్‌ షుయి’లాంటి ‘ఫు సుయి’ అనే పురాతన పద్ధతి జపాన్‌లో వాడుకలో ఉంది. ఇంటి అలంకరణలో మేరీ కొండో తల్లి ‘ఫు సుయి’ పద్ధతులు అనుసరించేది. చిన్నారి కొండో అదంతా గమనిస్తూ ఉండేది. ఊహ తెలిసి, కొంత ఎదిగిన తర్వాత ఇంటిని ఒద్దికగా సర్దుకోవడానికి, అందంగా తీర్చిదిద్దుకోవడానికి  కేవలం ‘ఫెంగ్‌ షుయి’, ‘ఫు సుయి’ వంటి పద్ధతులు సరిపోవని గుర్తించింది. ఇంటిని మరింత ఒద్దికగా, చూడముచ్చటగా సర్దుకోవడంలో తనదైన శైలిలో ప్రయోగాలు మొదలుపెట్టి, అద్భుతమైన ఫలితాలను సాధించింది. 

అలా మొదలైంది
మేరీ కొండో చిన్నప్పటి నుంచి తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని చాలా ఇళ్లను గమనిస్తూ వచ్చేది. ఇల్లు సర్దుకోవడంలో తన ఇంటి చుట్టుపక్కల జనాలు అనుసరించే పద్ధతులను నిశితంగా పరిశీలించేది. ‘ఫెంగ్‌ షుయి’, ‘ఫు సుయి’ పద్ధతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ అలంకరించిన ఇళ్లను కూడా చూసేది. ఇవన్నీ చూసినా, ఆమెకు వాటిలో ఏదో లోపం ఉన్నట్లే అనిపించేది. తన ఇంట్లోనే తల్లికి చేదోడుగా ఇంటిని చక్కగా సర్దుకోవడంలో రకరకాల ప్రయోగాలు చేసేది. జూనియర్‌ స్కూల్‌లో చదువుకునేటప్పుడు ఇంటర్వెల్‌లో పిల్లలంతా ఆడుకోవడానికి బయట మైదానంలోకి వెళితే, మేరీ కొండో మాత్రం తరగతి గదిలోని పుస్తకాల షెల్ఫులను చక్కగా సర్దిపెట్టేది. ఆమె పనికి టీచర్ల ప్రశంసలు లభించేవి. తాను ఉన్న పరిసరాలను శుభ్రంగా, చూడచక్కగా సర్దుకోవడం అప్పట్లోనే ఆమెకు వ్యామోహంగా మారింది. ఒకనాడు స్కూల్‌లోని పుస్తకాల షెల్ఫులను నిర్విరామంగా సర్దుతుండగా, విశ్రాంతి లేకపోవడం వల్ల స్పృహతప్పి పడిపోయింది. రెండు గంటల తర్వాత ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది.

 ఈ సంఘటనే తన జీవితాన్ని మలుపు తిప్పిందని మేరీ కొండో చెబుతుంది. ‘ఆ రోజు పుస్తకాల షెల్ఫులు సర్దుతుండగా, స్పృహ తప్పిపోయాను. రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాను. ఏం జరిగిందో అర్థంకావడానికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. ఇల్లు, స్కూలు సర్దుకోవడంలో నేను అప్పటి వరకు చేస్తూ వచ్చిన పొరపాటు నాకు తెలిసి వచ్చింది. అప్పటి వరకు పనికిరానివి పారేస్తూ, కొద్దిపాటి వస్తువులను చూడముచ్చటగా కనిపించేలా సర్దుతూ వచ్చేదాన్ని. ఆ తర్వాత నా పద్ధతిని మార్చుకున్నాను. 

పారవేయాల్సిన వస్తువుల పనిపట్టడం బదులుగా, అట్టే పెట్టుకోవలసిన వస్తువులను ఎలా సర్దుకోవాలనే దానిపై దృష్టిపెట్టడం మొదలుపెట్టాను. మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఇచ్చే వస్తువులను కంటికి ఇంపుగా కనిపించేలా సర్దుకోవడం ప్రారంభించాను’ అని చెబుతుందామె. బడి చదువు పూర్తయ్యాక మేరీ కొండో టోక్యో విమెన్స్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీలో సోషియాలజీ చదువుకుంది. ఆ తర్వాత ఒక షింటో ఆలయంలో అటెండెంట్‌గా ఐదేళ్ల పాటు సేవలందించింది. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక పూర్తి స్థాయిలో ఇల్లు, బడి, ఆఫీసు వంటివి చక్కగా సర్దుకునే పద్ధతులపై సలహాలు, సూచనలు ఇవ్వడాన్నే వృత్తిగా మార్చుకుంది.

సంతోషాల వెలుగు
మేరీ కొండో వస్తువులను చక్కగా సర్దుకోవడంలో కనిపెట్టిన పద్ధతి ‘కోన్‌మారీ’గా పేరు పొందింది. జపానీస్‌ భాషలో ‘కోన్‌మారీ’ అంటే సంతోషాల వెలుగు అని అర్థం. వస్తువులను త్వరగా, చూడముచ్చటగా, పరిపూర్ణంగా ఎలా సర్దుకోవాలో చెప్పే ఈ పద్ధతికి జపాన్‌లోనే కాకుండా, మరో ముప్పయి దేశాలలో అనతికాలంలోనే జనాదరణ పెరిగింది. 

ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మన పరిసరాల్లో మన సంతోషాన్ని పెంచే వస్తువులను చూడముచ్చటగా సర్దుకోవడం, మనకు ఏమాత్రం సంతోషం కలిగించని వాటిని వదుల్చుకోవడమే ‘కోన్‌మారీ’ పద్ధతి. ‘కోనామారీ’కి ఆదరణ పెరగడంతో మేరీ కొండోపై పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు దృష్టి సారించాయి. కొన్ని చానళ్లు ఆమెతో ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. ఇంకొన్ని ఆమెతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి రేటింగులను పెంచుకున్నాయి. ఒక టీవీ చానల్‌లో ప్రసారమైన ‘స్పార్కింగ్‌ జాయ్‌ విత్‌ మేరీ కొండో’ కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ లభించింది. వస్తువులను సర్దుకోవడంపై మేరీ కొండో ఇప్పటి వరకు ఆరు పుస్తకాలు రాసింది. 

అవి చాలా భాషల్లోకి అనువాదం పొందాయి. లక్షలాది కాపీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. షింటో బోధనల స్ఫూర్తితో తాను ‘కోన్‌మారీ’ పద్ధతికి రూపకల్పన చేసినట్లు మేరీ కొండో చెబుతుంది. ‘కోన్‌మారీ’ పద్ధతి చాలా సరళమైనది. ఇంట్లోని వస్తువులను రకాల వారీగా విభజించుకోవడం ఇందులోని మొదటి ప్రక్రియ. అంటే, దుస్తులు, పుస్తకాలు, కాగితాలు, పాత్రలు, డబ్బాలు– ఇలా ఒక్కోరకం వస్తువులను ఎంపిక చేసుకుని, ముందుగా ఒకచోట పోగు పెట్టాలి. తర్వాత వాటిలో మనకు పనికొచ్చే వాటిని, మనకు సంతోషం కలిగించే వాటిని ఏరుకుని, వాటిని పొందికగా సర్దుకోవాలి. పనికిరాని వాటిని పారేయాలి. ఇంతే! ఈ పని చేస్తే చాలు, ఇంటి తీరుతెన్నులే మారిపోతాయి. ఇంట్లోకి అడుగుపెడుతూనే ప్రశాంతంగా అనిపిస్తుంది. 

జపాన్‌ నుంచి అమెరికాకు
మేరీ కొండో ఒసాకోలోనే పనిచేసే కవాహరా తకుమిని 2012లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కవాహరా ఒసాకోలోని ఒక కంపెనీలో మార్కెటింగ్‌ విభాగంలో ఉద్యోగం చేసేవాడు. ‘కోన్‌మారీ’కి ఆదరణ పెరిగి మేరీ కొండో కెరీర్‌ నిలదొక్కుకున్నాక కవాహరా ఉద్యోగం మానేసి, భార్యకు పూర్తిస్థాయి మేనేజర్‌గా మారాడు. తర్వాత ఈ దంపతులు ‘కోన్‌మారీ’ మీడియా సంస్థను నెలకొల్పారు. కవాహరా మీడియా సంస్థకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, మేరీ కొండో సంస్థకు చెందిన సృజనాత్మక వ్యవహారాలను చూసుకుంటోంది. 

సంస్థను మరింతగా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ దంపతులు అమెరికా చేరుకున్నారు. తొలుత శాన్‌ఫ్రాన్సిస్‌కోలో కొన్నాళ్లు ఉన్నాక, తర్వాత లాస్‌ ఏంజెలెస్‌కు మకాం మార్చి, ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. అమెరికాకు తరలిపోయిన తర్వాత ‘కోన్‌మారీ’కి పాశ్చాత్య ప్రపంచంలో ఆదరణ బాగా పెరిగింది. మేరీ కొండో ‘యూట్యూబ్‌’లోను, ‘ఇన్‌స్టాగ్రామ్‌’లోను పెడుతున్న వీడియోలకు లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ‘కోన్‌మారీ’ పద్ధతిలో ఇల్లు సర్దుకోవడం చాలా సులువు. ఈ పద్ధతిలో ఒద్దికగా ఇంటిని సర్దుకున్నట్లయితే, ఇల్లే కదా స్వర్గసీమ అన్నట్లుగా ఉంటుంది.

కోన్‌మారీ చిట్కాలుఒక టీవీ కార్యక్రమంలోమేరీ కొండో చెప్పిన చిట్కాలు ఇవి:
⇒ఇల్లు ఎలా ఉంటే ఇంట్లో సౌకర్యంగా, సంతోషంగా ఉండటం సాధ్యమవుతుందో ఊహించండి. మీ ఊహలను అమలు పెట్టడానికి ప్రయత్నించండి.


⇒ఇంట్లో ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వని వస్తువులు పడి ఉంటే, వాటిని వదుల్చుకోండి. దానివల్ల కొంత చోటు ఖాళీగా మిగులుతుంది. ఇల్లు విశాలంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

⇒ప్రతి వస్తువుకు దానిదైన చోటును నిర్దేశించుకోండి. ఆ వస్తువు అక్కడే ఉండేలా సర్దుకోండి.

⇒అలాగని తక్కువ చోటులో ఎక్కువ దుస్తులను పట్టించాలనే ప్రయత్నంలో వాటిని కుక్కేయకండి. వాటిని జాగ్రత్తగా మడతపెట్టి, తిరిగి సులువుగా వాడుకునేలా సర్దుకోండి.

⇒బాగా సంతోషాన్ని ఇచ్చే వస్తువులను ఇంట్లోకి అడుగుపెడుతూనే కనిపించేలా పొందికగా సర్దుకోండి.

⇒నిలువుగా ఎక్కువ అరలతో ఉండే వార్డ్‌రోబ్‌లలో మడతపెట్టిన దుస్తులను సర్దిపెట్టుకోండి. దానివల్ల చాలా చోటు కలిసొస్తుంది.

⇒గోడలకు ఫొటో ఫ్రేములు, చిత్రపటాలు అతిగా వేలాడదీయకండి. పూలకుండీలను ఇరుకిరుకు మూలల్లో ఉంచకండి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement