చెక్క ఫ్యాన్ ను చూశారా? వందేళ్ల కిందటే వంట పాత్ర కమ్ హాట్ క్యారేజ్ ఉండేది తెలుసా? రేడియో ఉండాలంటే లైసెన్ ్స కావాలా? ఇలా మనం చూడని.. మనకు తెలియని ఎన్నో వస్తువులు, కళ్లు చెదిరే కళాఖండాలు, అబ్బురపరచే చిత్రాలెన్నో అక్కడ దర్శనమిస్తాయి. వీటిని చూడాలన్న ఉత్సుకత.. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే పరవాడలోని కోరుపోలు గంగాధరరావు ఇంటికి వెళ్లాల్సిందే! ఆయన 22 ఏళ్ల ఈ ప్రయాణాన్ని తెలుసుకోవలసిందే!
గంగాధరరావు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని బపాడుపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. పిల్లలకు పాఠాలు చెబుతున్న సమయంలో పుస్తకాల్లో ఉన్నది చెప్పడంతో పాటు వాటిని పిల్లలకు ప్రత్యక్షంగా చూపిస్తే వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇచ్చినట్టవుతుంది కదా అనే ఆలోచన వచ్చింది ఆ టీచర్‌కి. ఆ బాటలో సాగిపోతుండగా ఒకరోజు ఆయనకు అల్యూమినియం, రాగి నాణేలు లభించాయి.
వాటి మీద ఆసక్తి పెరిగి నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం ప్రారంభించాడు. అది కాస్త ఒక యజ్ఞంలా మారి ‘మోస్ట్ కలెక్షన్ ఆఫ్ వెరైటీ టెన్ రూపీస్ కాయిన్స్’ అంశంపై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ కాయిన్ ్స అంశంలో మూడుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరును నమోదు చేసింది. 2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కూ దరఖాస్తు చేసుకున్నారాయన. నాణేలు సరే.. కనుమరుగైపోతున్న వస్తువులనూ ఈ తరానికి చూపించాలన్న ఆలోచనా చేశారు గంగాధరరావు.
తక్షణమే వాటి సేకరణాæ మొదలుపెట్టారు. అలా ఆయన ఇల్లు ఇప్పుడు 100 నుంచి 300 ఏళ్ల నాటి ఇత్తడి కొలత పాత్రలు, కంచు గిన్నెలు, గోకర్ణాలు, బోషాణం, రంగం పెట్టెలు, బ్రిటిష్ కాలం నాటి పాత పేపర్లులాంటి పలురకాలకు చెందిన రెండువేలకు పైగా వస్తువులతో మ్యూజియమ్‌ను తలపిస్తోంది. ఆ వస్తువుల్లో ఆసక్తిరనమైన కొన్ని..
మ్యూజియం ఏర్పాటే లక్ష్యం..
"అప్పట్లో వాడిన ప్రతి వస్తువుకూ ఓ ప్రత్యేకత ఉంది. ఆ వస్తువుల్లో ఆరోగ్యం ఉండేది. ఆ ప్రాముఖ్యతను, ఆ సంప్రదాయాలను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే మన పూర్వీకులు వాడిన ప్రతి వస్తువును సేకరించి భద్రపరచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. అవి అందరికీ అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఓ మ్యూజియమ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సహకరిస్తే నా కల నెరవేరుతుంది". – గంగాధరరావు, పరవాడ
చెక్క ఫ్యాన్..
దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెక్క ఫ్యాన్‌కు పేటెంట్ కూడా ఉంది. బ్రిటిష్ కాలంలో ఈ ఫ్యాన్ ను వినియోగించేవారు. ఇందుకోసం పంకా మ్యాన్ అనే ఉద్యోగం ఉండేది. చెక్క ఫ్యాన్ తిప్పడమే ఆ ఉద్యోగి పని. 1920లో తయారైన ఈ ఫ్యాన్ కోసం గంగాధరరావు రూ. 45 వేలు పెట్టి.. ఢిల్లీ నుంచి తెప్పించారు.
స్టీమ్ క్యారేజ్..
1917లో తయారైన ఈ స్టీమ్ క్యారేజ్ సుమారు పది కిలోల బరువు ఉంటుంది. ఇందులో వంట వండుకోవడమే కాక వండిన వంటను 10 నుంచి 12 గంటల పాటు వేడిగానూ పెట్టుకోవచ్చు. దీన్ని గంగాధరరావు రూ. 16 వేలు వెచ్చించి రాజస్థాన్ , జైపూర్ నుంచి తీసుకొచ్చారు.
రేడియోలు.. లైసెన్సులు..
మొదటితరం నాటి 10 రకాల రేడియోలను ఆయన సేకరించారు. అప్పట్లో రేడియో ఉండాలంటే పోస్టాఫీస్ నుంచి లైసెన్స్ తీసుకోవలసి వచ్చేదట. ఆ లైసెన్ ్స కాపీలూ మాష్టారి వద్ద ఉన్నాయి. అంతేకాదు బ్రిటిష్ వారి గెజిట్స్, స్వాతంత్య్ర ఉద్యమం నాటి పోస్ట్‌కార్డ్స్‌నూ ఆయన సేకరించారు.
సేకరణలో కష్టాలెన్నో..
ఇలాంటి వస్తువులన్నింటినీ సేకరించేందుకు మొదట్లో గంగాధరరావు.. ఫలానా వస్తువు ఫలానా చోట ఉంది అని తెలియగానే సంబంధిత వ్యక్తులకు ఉత్తరాలు రాసేవారట. తర్వాత ఫోన్లు రావడం, వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ కావడంతో పని కొంత సులువైందంటారు. ఫలానా చోట వస్తువు ఉందంటే ముందుగా డబ్బులు చెల్లిస్తే.. వారే ఇంటికి పంపిస్తున్నారట. ఇందులో కూడా పోటీ ఉంటుంది. ఒకసారి మిస్ అయితే ఆ వస్తువు మళ్లీ దొరకదు.
అందుకే ఎంత కష్టమైనా వెంటనే డబ్బులు చెల్లించి వస్తువు సేకరిస్తున్నారు. దీనికోసం ఆయన ప్రతి నెలా తనకు వచ్చే ఆదాయంలోంచి 20 శాతాన్ని కేటాయిస్తున్నారు. తను సేకరించిన వస్తువుల కోసం ఇప్పటివరకు రూ. 10 లక్షలకు పైనే వెచ్చించారు. ఆయనకు ‘ఎఖఅNఖీఐఖ్ఖఉ ’ అనే యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఆయన సేకరించిన ప్రతి వస్తువు గురించి ఇందులో వివరిస్తుంటారు. దీనికి 2.58 కోట్ల మంది వ్యూయర్స్, 1.38 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
‘గోల్డ్ స్పాట్ గురించి చెబితే దాదాపు 5 లక్షల మంది చూశారు. గోల్డ్ స్పాట్ జ్ఞాపకాలను పంచుకుంటూ 20 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. లూనాపై వీడియో చేస్తే కూడా అంతే వైరల్ అయింది. నా దగ్గరున్న వస్తువులను చూడ్డానికి హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు. నా యూట్యూబ్ చానెల్ వీడియోలు చూసి చాలామంది సినిమా డైరెక్టర్లూ నన్నూ అప్రోచ్ అవుతున్నారు.. నేను సేకరించిన వస్తువులను తమ సినిమాల్లో ఉపయోగించుకుంటామంటూ! ఈ రెస్పాన్స్ భలే సంతోషాన్నిస్తోంది. నేను పడ్డ శ్రమ, పెట్టిన ఖర్చును మరచిపోయేలా చేస్తోంది’ అంటారు గంగాధరరావు. – గొరకల పూర్ణచందర్, సాక్షి, విశాఖపట్టణం
Comments
Please login to add a commentAdd a comment