
దయ్యాలు, భూతాలు, పిశాచాలు వంటివి పాతకాలం జానపద సినిమాల్లోను, ఇప్పటికాలం హారర్ సినిమాల్లోను చాలామంది చూసి ఉంటారు. భూత ప్రేత పిశాచాల గురించి పరిశోధనలు సాగించే వారు పురాతనకాలం నుంచి కూడా ఉన్నారు.
భూత ప్రేత పిశాచాలను ఆవాహన చేయడానికి తాంత్రికులు ఉపయోగించే వస్తువులను, మనుషులను భయపెట్టే ప్రేతాత్మలను నిరోధించడానికి ఉపయోగించే వస్తువులను, ప్రేతాత్మలను ఆకర్షించే వస్తువులను జాగ్రత్తగా సేకరించి ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలనే ఆలోచన మాత్రం చాలా అరుదైనది.
ప్రేతాత్మలపై పరిశోధనలకే జీవితాన్ని అంకితం చేసిన ఫ్రెంచ్ మేధావి జేక్విజ్ సిర్జంట్ పారిస్‌లో అచ్చంగా భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన వస్తువులతో ‘మ్యూజియం ఆఫ్ వాంపైర్స్’ను నెలకొల్పాడు. ఇందులో మానవ కంకాళాలు, పురాతన తాంత్రికులు ఉపయోగించిన జంతువుల మమ్మీలు, ప్రేతాత్మలను తరిమికొట్టే ఆయుధాలు వంటివి భద్రపరచాడు. గుండెదిటవు గల పర్యాటకులు ఈ మ్యూజియంను చూసి పోతుంటారు.