దౌత్యానికి వచ్చాడు హనుమ రావణుడి వద్దకు. సీతమ్మను విడిచిపెట్టకపోతే మహాపరాక్రమవంతుడైన రాముడి చేతిలో నీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది జాగ్రత్త అని హెచ్చరించాడు. రావణుడు శాస్త్రాలు చదివినవాడే. కానీ ఏ శాస్త్రాన్నయినా తన కోణంలోనే అన్వయించి చెప్పే మూర్ఖుడు కావడంతో హనుమ మాటలు చెవికెక్కలేదు. పైగా నిండు సభలో ‘‘ఒక కోతి నాకు నీతులు చెబుతుందా? చంపి పారేయండి’’ – అని ఆవేశంతో ఊగిపోయాడు. ఇంతలో విభీషణుడు లేచి – దూతను చంపకూడదు – కావాలంటే గట్టిగా మందలించండి, తప్పదనుకుంటే చిన్నపాటి శిక్ష వేయండి – అని అన్నగారికి చెప్పాడు.
‘‘ఓహో! అలాగా ! అయితే కోతికి తోకే కదా బలం, ప్రాణం? తోకకు నిప్పు పెట్టండి – అని ఆదేశించాడు రావణుడు. దాంతో రాక్షసమూక ఎక్కడెక్కడి పాత బట్టలన్నీ తెచ్చి నూనెలో ముంచి, తోకకు చుట్టి మంట పెట్టారు. ఇది చాలక బండి మీద కట్టి లంక వీధుల్లో ఊరేగించారు. రాత్రి లంకను సరిగా చూడలేదు. పగలు చూస్తే – రాముడికి చెప్పడానికి, ఎలా రావాలో అంచనా వేయడానికి పనికి వస్తుందని – హనుమ వ్యూహాత్మకంగానే భరిస్తున్నాడు. పరిశీలన అయిపోగానే ఒక్కసారిగా కట్లు తెంచుకున్నాడు. మండుతున్న ఆ తోకతో లంకకు నిప్పుపెట్టాడు. సీతమ్మ అగ్ని దేవుడిని ప్రార్థించడం వల్ల, హనుమ తోకకు గంధం పూసినట్లు చల్లగా ఉందికానీ, వేడి లేదు – గాయం కాలేదు.
మండుతున్న లంకను దూరంగా చూస్తున్న హనుమకు ఒక్కసారిగా ఒళ్ళు చెమట పట్టింది. అరెరే ! ఆగ్రహంలో ముందు వెనుకలు ఆలోచించకుండా అశోకవనాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశానే, ఇందులో సీతమ్మ కూడా ఆహుతి అయిపోతుందే, ఇప్పుడెలా అనుకుంటుండగా – అశరీర వాణి మాటలు వినిపించాయి– చూసి రమ్మంటే, హనుమ కాల్చి వచ్చాడు. లంకానగరమంతా కాలిపోతోంది. ఒక్క సీతమ్మ కూర్చున్న చోటు తప్ప––అని. హమ్మయ్య అనుకుని హనుమ మండుతున్న తోకను సముద్రంలో ముంచి, చల్లార్చుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. చేతులు జోడించి వినయంగా ‘‘అమ్మా! వచ్చిన పని అయ్యింది – వెళ్ళొస్తా – సెలవివ్వు’’ అన్నాడు.
‘‘నువ్వంటే మహా బలసంపన్నుడివి, వందయోజనాల దూరాన్ని అవలీలగా దాటి వచ్చావు. మిగతావారు ఎలా రాగలరు? ఇక నా గతి ఇంతేనేమో?’’అని నిట్టూర్చింది సీతమ్మ. ఆ మాటలకు ‘‘అమ్మా , సుగ్రీవుడి కొలువులో నేనే చాలా చిన్నవాడిని. ఏదయినా చిన్న పనికి ఏ పనీ చేతగాని మామూలువాడిని పంపుతారు. అలా నన్ను పంపారు. మా రాజు సుగ్రీవుడి దగ్గర ఉన్న సైన్యం అంతా నాకంటే బలసంపన్నులే. వారికి సముద్రాన్ని దాటటం అరటిపండు ఆరగించినంత సులువైన పని. కనుక నువ్వేమీ దిగులు పెట్టుకోకు తల్లీ – నేను అలా వెళ్లడం – రాముడు ఇలా రావడం ఒకేసారి జరుగుతాయి – నన్ను ఆశీర్వదించి పంపు తల్లీ’’అన్నాడు ముకుళించిన హస్తాలు విడివడకుండానే! చూశారా, వినయ విధేయతలంటే అవీ. కొండంత చేసీ, గోరంత చేసినట్లు చెప్పుకున్నాడు హనుమ. మనమూ ఉన్నాం, గోరంత కూడా చేయకుండానే, కొండంత చేశామని గొప్పలు చెప్పుకుంటాం!! హనుమంతుడి వినయమే ఆయనకు బలంగా మారిందని మనం ఇందులోని నీతిని చెప్పుకోవచ్చు.
– డి.వి.ఆర్. భాస్కర్
హనుమ వినయ బలం
Published Mon, Sep 17 2018 11:15 PM | Last Updated on Mon, Sep 17 2018 11:15 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment