Hanuma
-
హనుమాన్ విగ్రహం లభ్యం!
ఆదిలాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కన్నెపెల్లి శివారులోని వాగులోకి కొట్టుకువచ్చిన హనుమాన్ విగ్రహం బాలుడికి లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపెల్లికి చెందిన స్వాతిక్ అనే బాలుడు పత్తి చేనులో పక్కనే ఉన్న వాగు పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్నాడు. అక్కడ రంగులతో కూడిన రాయి కనిపించగా వెళ్లి చూసే సరికి హనుమాన్ విగ్రహం ఉందని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో పెద్ద ఎత్తున విగ్రహాం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టిస్తామని గ్రామస్తులు తెలిపారు. -
హనుమ వినయ బలం
దౌత్యానికి వచ్చాడు హనుమ రావణుడి వద్దకు. సీతమ్మను విడిచిపెట్టకపోతే మహాపరాక్రమవంతుడైన రాముడి చేతిలో నీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది జాగ్రత్త అని హెచ్చరించాడు. రావణుడు శాస్త్రాలు చదివినవాడే. కానీ ఏ శాస్త్రాన్నయినా తన కోణంలోనే అన్వయించి చెప్పే మూర్ఖుడు కావడంతో హనుమ మాటలు చెవికెక్కలేదు. పైగా నిండు సభలో ‘‘ఒక కోతి నాకు నీతులు చెబుతుందా? చంపి పారేయండి’’ – అని ఆవేశంతో ఊగిపోయాడు. ఇంతలో విభీషణుడు లేచి – దూతను చంపకూడదు – కావాలంటే గట్టిగా మందలించండి, తప్పదనుకుంటే చిన్నపాటి శిక్ష వేయండి – అని అన్నగారికి చెప్పాడు. ‘‘ఓహో! అలాగా ! అయితే కోతికి తోకే కదా బలం, ప్రాణం? తోకకు నిప్పు పెట్టండి – అని ఆదేశించాడు రావణుడు. దాంతో రాక్షసమూక ఎక్కడెక్కడి పాత బట్టలన్నీ తెచ్చి నూనెలో ముంచి, తోకకు చుట్టి మంట పెట్టారు. ఇది చాలక బండి మీద కట్టి లంక వీధుల్లో ఊరేగించారు. రాత్రి లంకను సరిగా చూడలేదు. పగలు చూస్తే – రాముడికి చెప్పడానికి, ఎలా రావాలో అంచనా వేయడానికి పనికి వస్తుందని – హనుమ వ్యూహాత్మకంగానే భరిస్తున్నాడు. పరిశీలన అయిపోగానే ఒక్కసారిగా కట్లు తెంచుకున్నాడు. మండుతున్న ఆ తోకతో లంకకు నిప్పుపెట్టాడు. సీతమ్మ అగ్ని దేవుడిని ప్రార్థించడం వల్ల, హనుమ తోకకు గంధం పూసినట్లు చల్లగా ఉందికానీ, వేడి లేదు – గాయం కాలేదు. మండుతున్న లంకను దూరంగా చూస్తున్న హనుమకు ఒక్కసారిగా ఒళ్ళు చెమట పట్టింది. అరెరే ! ఆగ్రహంలో ముందు వెనుకలు ఆలోచించకుండా అశోకవనాన్ని కూడా అగ్నికి ఆహుతి చేశానే, ఇందులో సీతమ్మ కూడా ఆహుతి అయిపోతుందే, ఇప్పుడెలా అనుకుంటుండగా – అశరీర వాణి మాటలు వినిపించాయి– చూసి రమ్మంటే, హనుమ కాల్చి వచ్చాడు. లంకానగరమంతా కాలిపోతోంది. ఒక్క సీతమ్మ కూర్చున్న చోటు తప్ప––అని. హమ్మయ్య అనుకుని హనుమ మండుతున్న తోకను సముద్రంలో ముంచి, చల్లార్చుకుని సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. చేతులు జోడించి వినయంగా ‘‘అమ్మా! వచ్చిన పని అయ్యింది – వెళ్ళొస్తా – సెలవివ్వు’’ అన్నాడు. ‘‘నువ్వంటే మహా బలసంపన్నుడివి, వందయోజనాల దూరాన్ని అవలీలగా దాటి వచ్చావు. మిగతావారు ఎలా రాగలరు? ఇక నా గతి ఇంతేనేమో?’’అని నిట్టూర్చింది సీతమ్మ. ఆ మాటలకు ‘‘అమ్మా , సుగ్రీవుడి కొలువులో నేనే చాలా చిన్నవాడిని. ఏదయినా చిన్న పనికి ఏ పనీ చేతగాని మామూలువాడిని పంపుతారు. అలా నన్ను పంపారు. మా రాజు సుగ్రీవుడి దగ్గర ఉన్న సైన్యం అంతా నాకంటే బలసంపన్నులే. వారికి సముద్రాన్ని దాటటం అరటిపండు ఆరగించినంత సులువైన పని. కనుక నువ్వేమీ దిగులు పెట్టుకోకు తల్లీ – నేను అలా వెళ్లడం – రాముడు ఇలా రావడం ఒకేసారి జరుగుతాయి – నన్ను ఆశీర్వదించి పంపు తల్లీ’’అన్నాడు ముకుళించిన హస్తాలు విడివడకుండానే! చూశారా, వినయ విధేయతలంటే అవీ. కొండంత చేసీ, గోరంత చేసినట్లు చెప్పుకున్నాడు హనుమ. మనమూ ఉన్నాం, గోరంత కూడా చేయకుండానే, కొండంత చేశామని గొప్పలు చెప్పుకుంటాం!! హనుమంతుడి వినయమే ఆయనకు బలంగా మారిందని మనం ఇందులోని నీతిని చెప్పుకోవచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ -
ఘనంగా హనుమ యాగము
యాదగిరిగుట్ట: స్థానిక యాదగిరి గార్డెన్స్‌లో గుళ్లపల్లి వెంకటరామ సూర్యనారాయణ ఘనాపాఠి చేపట్టిన హనుమ యాగము మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గణపతి పూజ, యాగ సంకల్పం, కలశస్థాపన, మండపారాధన, అగ్నిప్రతిష్ఠ, సాయంత్రం స్థాపిత దేవతా హవనములు, మన్యుసూక్త హవనము, నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించారు. ఉదయం జరిగిన పూజల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర, యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి కావాలని కోరుతూ యాగాన్ని చేపట్టినట్లు వెంకటరామ సూర్యనారాయణ తెలిపారు. ఈ పూజల్లో గుళ్లపల్లి సీతారామ ఫణికుమారశర్మ, కనకదండి శ్రీకాంత్ శర్మ, హిందుదేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి, రచ్చ యాదగిరి, రచ్చ శ్రీనివాస్, కర్రె ప్రవీణ్, గాయత్రి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. -
రాబిన్ఫుడ్ ఆర్మీ
ఉన్నవాడిని కొట్టి లేని వాడికి పంచాడు ఆ రాబిన్‌హుడ్. స్ఫూర్తి అతడే. థీమూ అదే. కాకపోతే అతనిది దొడ్డిదారి. వీరిది రహదారి. నాడు ఒక్కడే. నేడు ఎందరో. అతడికి వారసులుగా అభివర్ణించుకుంటూ... పేదల హృదయాలు గెలుచుకొంటున్న సిటీ ‘రాబిన్‌హుడ్‌లు’ వీరు. ఒక్కడిగా మొదలై సైన్యంలా మారిన ఈ ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ టార్గెట్... సర్వీస్! - హనుమా ఈ మహానగర వీధుల్లో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ జీవనం వెళ్లదీసే అభాగ్యులెంతోమంది. ఏ ఆసరా లేక.. పట్టించుకొనే దిక్కు లేక.. భారంగా బతుకీడుస్తున్న వారిని చూస్తే ఎవరి మనసైనా కరుగుతుంది. కూడు, గుడ్డ, నీడ... వీటిలో తొలి ప్రాధాన్యం పట్టెడు అన్నమే. ‘అలా వీధులే ఆవాసాలుగా బతుకుతున్న వారి ఆకలి తీర్చడమే మా ఎజెండా’ అని చెబుతున్నాడు నగరంలో ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’కి శ్రీకారం చుట్టిన ఆదిత్య గుప్తా. అంకురార్పణ... ఈ ఆర్మీకి బీజం పడింది దిల్లీలో. గతేడాది జూన్‌లో నీల్‌ఘోష్ ప్రారంభించాడు. అతడి స్నేహితుడే ఆదిత్య. నీల్ సేవను ఫేస్బుక్లో చూసి... తానెందుకు భాగస్వామి కాకూడదనిపించింది ఆదిత్యకి. దానికి రూపమే హైదరాబాద్ చాప్టర్. సెప్టెంబర్ 2014లో ఒక్కడిగానే మొదలెట్టాడు. ఆ తరువాత ఎఫ్బీలో అతని ఫ్రెండ్స్ చేయి కలిపారు. ‘సమాజానికి ఏదో ఒకటి చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్లందరికీ సరైన ప్లాట్‌ఫాం ఉండదు. ఈ వాలంటీర్లంతా అలా తమకు తాముగా సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చినవారే’ అంటాడు ఆదిత్య. ఇప్పుడు హైదరాబాద్ చాప్టర్లో వాలంటీర్ల సంఖ్య 84 చేరింది. భారత్‌లో ఇదే పెద్ద చాప్టర్. సామాజిక సైట్లే వార ధి.. వీరందరినీ కలిపింది సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్. ‘ఎఫ్బీలో ఆదిత్య పోస్టింగ్స్ చూసి ఆకాంక్ష.. ముందుకొచ్చింది. అలానే స్ఫూర్తిరెడ్డి.. ఆ తరువాత నేను.. ఇలా కలిశాం’ అంటూ చెప్పుకొచ్చాడు మరో సభ్యుడు హర్ష్, ఆదిత్యలానే హర్ష్ కూడా బిజినెస్‌మ్యాన్. ఆర్కిటెక్ట్. ఆకాంక్ష ఓ ప్రముఖ కంపెనీలో చార్టెర్డ్ అకౌంటెంట్. స్ఫూర్తిరెడ్డి ఓ యాడ్ ఏజన్సీలో కీలక పదవిలో కొనసాగుతోంది. వీరే కాదు... వాలంటీర్లందరూ వర్కింగ్ పీపులే. వీరిలో లాయర్లు, టీచర్లు, బిజినెస్ పర్సనాలిటీస్, సీఏలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా అన్ని రంగాల వారూ ఉన్నారు. ఇరవై మొదలుకొని అరవై వరకు అన్ని వయసులవారు భాగస్వాములు. ఎంతో వేస్టేజీ... నగరంలో లెక్కకు మించి రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో రోజూ చాలా ఫుడ్ వేస్టయిపోతుంటుంది. కాన్ఫరెన్స్‌లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు.. ఇలా రకరకాల అకేషన్లలోనూ ఆహారం మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన ఫుడ్‌ని వృథా చేయకుండా.. ‘క్యాటరింగ్ వారు మాకు సమాచారమిస్తే.. వెంటనే వెళ్లి కలెక్ట్ చేసి, దగ్గర్లోని స్ట్రీట్ పీపుల్‌కు సర్వ్ చేస్తాం’ అని చె బుతున్న స్ఫూర్తి మాటల్లో సమాజం కోసం ఏదో చేయాలన్న తపన కనిపిస్తుంది. మిషన్ ఇలా... ‘ఇప్పుడు వారానికి రెండు రోజులు (వీకెండ్స్) డ్రైవ్స్ చేస్తున్నాం. ఫలానా రెస్టారెంట్లోనో, ఫంక్షన్లోనో ఫుడ్ మిగిలిందని మాకు సమాచారం వస్తుంది. వెంటనే వాలంటీర్లందరికీ వాట్సప్‌లో మెసేజ్‌లు వెళ్లిపోతాయి. రెస్టారెంట్ ఉన్న ప్లేస్‌ను బట్టి ఎక్కడ కలవాలన్నది ముందుగా నిర్ణయించుకుంటాం. రాత్రి 8 గంటలకు అంతా ఆ స్పాట్లో కలుస్తాం. వీధుల్లో అనాధలు, అభాగ్యులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి... ఒక్కో గ్రూపు ఒక్కో ప్రాంతానికి వెళ్లి ఆహారం పంపిణీ చేస్తుంది. అర్ధరాత్రైనా సరే... ఆగిపోయేది లేదు. ఆకలిగా ఉన్నవారి కడుపు నింపితే అందులో ఉండే ఆనందమే వేరు’అని అంటున్న ఆకాంక్ష కళ్లలో వెలుగు. సేవలో ఉన్న గొప్పదనమదే అంటుందీ సీఏ. వస్తురూపంలోనూ... ఫుడ్ కలెక్షన్‌తోనే అయిపోదు... దాని ప్యాకింగ్, పంపిణీ చేయాల్సిన చోటికి చేర్చడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. పెద్దమొత్తంలో తీసుకెళ్లాలంటే భారీ గిన్నెలు, ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలి. పంచడానికి పేపర్ ప్లేట్స్ కావాలి. ‘వీటికోసం ఎవరైనా మా ఆర్మీకి డొనేట్ చేయాలనుకుంటే డబ్బుల రూపంలోనే అక్కర్లేదు... పేపర్ ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులు, ప్యాకింగ్ మెటీరియల్, వెసల్స్, డ్రింకింగ్ వాటర్... ఇలా ఏరూపంలోనైనా అందించొచ్చు’ అని చెప్పిన హర్ష్లా అందరు కుర్రాళ్లూ ఆలోచిస్తే లెక్కకు మించి అభాగ్యుల కడుపు నింపవచ్చు. లార్జెస్ట్ డ్రైవ్.. ఇప్పటి వరకు వీరు చేసిన డ్రైవ్లన్నింటిలోకీ అతి పెద్దది ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి దగ్గర 980 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. అలాగే వీధుల్లో చలికి వణికిపోతున్న వారికి 1350 బ్లాంకెట్స్ పంచారు. ఇప్పటి వరకు 30 డ్రైవ్స్ నిర్వహించారు. దాదాపు 2500 మందికి ఫుడ్ అందించారు. ఫ్యూచర్ ప్లాన్స్.. ‘పేదవారికి కనీస అవసరాలు తీర్చే దిశగా డ్రైవ్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. అయితే అందుకు మాకున్న సంఖ్య సరిపోదు. ఈ సంఖ్యను పెంచుకోవాలనుకొంటున్నాం. సేవ చేయాలనుకునేవారెవరైనా మా ఆర్మీలో చేరవచ్చు. ఇప్పటి వరకు ఉన్నవారంతా వర్కింగ్ పీపులే. స్టూడెంట్స్ కూడా రావచ్చు. ఈ ఆర్మీ కోసం మేం వెచ్చిస్తున్న సమయం వారంలో కేవలం నాలుగైదు గంటలు’ అంటున్నాడు ఆదిత్య. అదర్ సిటీస్.. రాబిన్‌హుడ్ ఆర్మీ హైదరాబాద్‌తో పాటు దిల్లీ, జైపూర్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో సేవలందిస్తోంది. త్వరలో కఠ్మండూలో చాప్టర్ ప్రారంభించబోతున్నారు. పాకిస్థాన్‌లోని కరాచీలోనూ ఇటీవలే రాబిన్‌హుడ్ ఆర్మీ సర్వీస్ షురూ అయింది. సారా అఫ్రిదీ సారథ్యంలో అక్కడ సేవలు అందించనున్నారు. - ఈ మెయిల్: robinhoodarmyhyderabad@gmail.com -
ఐ కెన్ ఫ్లై
A dream is a wish your heart makes... It is a destination you always wanted to reach ‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పే సందేశం నుంచి స్ఫూర్తి పొందినట్టుంది ఇంచుమించు ఈ కోట్ కూడా. ‘కష్టంగా కనిపించేవన్నీ అసాధ్యం కావు. ఒకవేళ దేన్నైనా అసాధ్యం అనుకుంటే దాన్ని ఎప్పటికీ సాధించలేవు’... అంటూ పదకొండు నిమిషాల ఛోటా సినిమా ‘ఐ కెన్ ఫ్లై’ యువతలో చక్కని స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసింది. లక్ష్యం ఉన్నా... దాన్ని చేరుకొనే రాస్తా ఏదో తెలుసుకోలేని అయోమయంలో కొట్టుకుపోతున్న యువతరం భుజం తట్టి భరోసా ఇచ్చే ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు బెల్జియంలోని ఫ్లాండర్స్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పాఠంగా మారింది. హైటెక్ సిటీలో చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవి వీడె ఈ చిత్రానికి రూపకర్త. హాలీవుడ్ సినిమా టేకింగ్‌లను తలపించేలా ఈ చిత్రాన్ని రూపొందించిన రవి తన అనుభవాలను ‘సిటీ ప్లస్’తో పంచుకున్నాడు. - హనుమా షార్ట్ ఫిల్మ్స్ తీయడం హాబీ. మా ఊరు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చాక ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికి పది షార్ట్ ఫిల్మ్స్ తీశా. ‘మై లాస్ట్ ఫొటోగ్రాఫ్’కు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులొచ్చాయి. క్రమంగా టార్గెట్ మారి... ప్రస్తుతం ఫీచర్ ఫిల్మ్ తీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానికి ట్రయల్‌గానే ‘ఐ కెన్ ఫ్లై’ తీశాం. మాది పది మంది టీమ్. అందులో నలుగురు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. మిగిలినవారిలో ఇద్దరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ‘గాడ్జిల్లా, ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ గ్రాఫిక్స్ టీంలో వర్క్ చేశారు. అంతా కలసి పెట్టుకున్నదే ‘వీకెండ్ క్రియేషన్స్’. ఈ బ్యానర్ కిందే ‘ఐ కెన్ ఫ్లై’ చేశాం. ఎంతో కష్టపడ్డాం... గత ఏడాది డిసెంబర్లో ఈ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. ఈ ఏడాది ఏప్రిల్‌లో గానీ పూర్తి కాలేదు. నిడివి తక్కువే అయినా... ఒక్కో సన్నివేశానికీ చాలా శ్రమించాల్సి వచ్చింది. భువనగిరి ఫోర్ట్ వద్ద షూటింగ్. ఇంపోర్టెడ్ మోటర్, గోప్రో (హెలికాప్టర్) కెమెరా వంటి అధునాతన పరికరాలు ఉపయోగించాం. ఓ షాట్లో గాలికి పచ్చ గడ్డి కదులుతూ ఉంటుంది. అలాగే ఎత్తయిన కొండ. ఇవన్నీ చూడ్డానికి గ్రాఫిక్స్‌లా ఉన్నా... ఒరిజినల్‌గా చేసినవే. మా క్యామ్ ఓ సారి కొండ కొనపై ఇరుక్కుపోతే... ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించిన పూర్ణ, ఆనంద్ టీమ్ హెల్ప్ చేసింది. గ్రాఫిక్స్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి. దీని నెరేషన్ రికార్డింగ్ యూఎస్‌లో చేశాం. లక్షన్నర రూపాయలు ఖర్చయినా... ఫిల్మ్ ఎంతో రిచ్‌గా వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో దీని ప్రీమియర్ చూసి సినీ పెద్దలు ఇంప్రెస్ అయ్యి... రెండు ఆఫర్లు ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఫిబ్రవరీలో నా దర్శకత్వంలో... మా టీమ్ చిత్ర రంగ ప్రవేశం చేస్తుంది. ఇదీ కథ... చాలా మంది విజయానికి రెండు మూడు అడుగుల దూరంలోనే ఉన్నా... ఆ విషయం గ్రహించలేక చివరి నిమిషంలో డ్రాపయిపోతారు. ‘హార్డ్ వర్క్, డిటర్మినేషన్, డెడికేషన్’... ఇవి గోల్ వైపునకు తీసుకు వెళతాయి. ‘ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇన్డిసిప్లీన్, లేజీనెస్’... ఇవి వెనక్కి లాగుతాయి. ఈ రెండింటినీ కచ్చితంగా బ్యాలెన్స్ చేస్తేనే గోల్‌ను రీచ్ కాగలవు. ఇదే ఈ సినిమా కథ కూడా. ఎంబీబీఎస్‌లో సీటు కోసం నాలుగేళ్లుగా ట్రై చేస్తున్న ఓ యువకుడుకి... దాన్ని సాధించడమంటే గాల్లో ఎగిరినంత. వాళ్ల నాన్నను అడిగితే... ‘ఎస్... యూ కెన్ ఫ్లై’ అంటూ ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహంతోనే యువకుడు ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో చిత్రం ముగుస్తుంది. ‘కీప్ ట్రయింగ్’ అన్నదానికి కాస్త ఎడ్యుకేషన్ మిక్స్ చేసి దీన్ని రూపొందించాం. బెల్జియంలో పాఠం... ఇది చూసిన బెల్జియంలోని ‘వాన్ ఇన్’ పబ్లిషింగ్ సంస్థ నాకు రైట్స్ కోసం మెయిల్ పంపింది. రాయల్టీ చెప్పమంటే... ఓ మంచి కార్యక్రమం కోసం కనుక, నేను దాన్ని ఉచితంగానే వారికి ఇచ్చాను. డీవీడీ వెర్షన్‌గా అక్కడి 150 సెకండ్రీ ఎడ్యుకేషనల్ స్కూల్స్ (ఇక్కడ ఏడు, ఎనిమిది)లో పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నారు. మొత్తం నాలుగు వేల మంది విద్యార్థులకు ఇది రీచ్ అవుతుందని వారు తెలిపారు. నిజంగా ఇదో పెద్ద విజయం మాకు. ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్‌ను ఇలా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఉపయోగించిన సందర్భాలు నాకు తెలిసి ఎక్కడా లేవు. ఇది మా టీమ్‌లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం.మెయిల్ టు sakshicityplus@gmail.com -
అన్నమయ్య పదశోభ
హరినామమే కడు ఆనందకరము.. అని అన్నమయ్య తిరువీధుల వెలసిన ఆ దేవదేవుడ్ని కీర్తించాడు. ఆ వాగ్గేయకారుడి సంకీర్తనలను తన అమృతగానంతో ఆలపిస్తూ తన పరబ్రహ్మం ఆ శ్రీహరి ఒక్కడేనని చాటుతున్నారు శోభారాజు. ‘కట్టెదుర ఉన్న వైకుంఠం’ వదిలి భాగ్యనగరానికి చేరుకున్న ఆమె అన్నమయ్య భావన వాహిని ద్వారా మూడు దశాబ్దాలుగా తన రాగతరంగాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. మనుషుల మనసులను ఆవహించిన భావ కాలుష్యాన్ని నివారించే శక్తి సంకీర్తనలకు ఉందని చెబుతున్నారు. ఇది కాక సౌభాగ్యం ఇది కాక తపము మరి ఇది కాక వైభోగము ఇంకొకటి కలదే అంటూ కోనేటిరాయుడ్ని నిరంతరం కీర్తిస్తున్న శోభారాజు తన అంతరంగాన్ని ఇలా ఆవిష్కరించారు. - హనుమా ‘జో అచ్యుతానంద... జోజో ముకుందా...’ అంటూ అమ్మ పాడుతూ ఉంటే... అలా నాకు తెలియకుండానే అన్నమయ్య పాటలు నన్ను ఆకట్టుకున్నాయి. అవి అన్నమాచార్య కీర్తనలని అప్పుడు నాకు తెలియదు. టెన్త్ పాసైన తరువాత ఇంటర్లో చేరడానికి తిరుపతి వెళ్లా. ఏటా అక్కడ జరిగే అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లో పాడుతుండేదాన్ని. వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంటర్ వర్సిటీ కాంపిటీషన్లో అన్నమయ్య కీర్తనలు పాడి మొదటి బహుమతి గెలుచుకున్నా. సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు వచ్చేవారు. తన కచేరీలో రెండు పాటలు పాడించారు. ఆ తరువాత ఆయన మద్రాసు నుంచి ఉత్తరం రాశారు... ‘నీ కోసం రెండు స్వరాలు చేశా పాడతావా అంటూ..! సినిమా ఫీల్డు, పైగా మద్రాసు వెళ్లడమంటే ఇంట్లోవాళ్లు వద్దన్నారు. అన్నయ్యకు నచ్చజెబితే సరే అన్నారు. 1972లో ‘నారాయణతే నమో నమో.., అదె చూడు తిరువెంకటాద్రి కొండా..’ కీర్తనలు పాడా. అదే నా తొలి అల్బమ్. అలా అనుకోకుండా అన్నమయ్య తన వైపు లాక్కొని వెళ్లాడు. ఆ తరువాత టీటీడీ వారు అన్నమాచర్య కీర్తనల ప్రచారం, సాహిత్యంపై అధ్యయనానికి స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించారు. అన్నమయ్య తత్వం అప్పుడర్థమైంది. ఆయనకు స్వామి, మానవాళిపై ఉన్న ప్రేమ తెలిసింది. క్రమంగా ఆయన వ్యక్తిత్వంపై గౌరవం, ఆరాధన పెరిగాయి. ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రయత్నిద్దాం అనుకుంటున్న సమయంలో... టీటీడీ నుంచి ‘అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి ఆస్థాన గాయకురాలిగా’ నియమిస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడే స్వామికి మాటిచ్చా... ‘జీవితాంతం నీకు స్వర కైంకర్యం చేస్తా’నని. భావనా వాహిని... కొన్ని కారణాలతో తిరుపతి వదిలి హైదరాబాద్‌కు (1982) రావాల్సి వచ్చింది. 1983 నవంబర్ 30న నా పుట్టిన రోజున ‘అన్నమయ్య భావనా వాహిని’ స్థాపించా. నా పుట్టిన రోజు సందర్భంగా నాన్న రూ.1116లు బహుమతిగా ఇచ్చారు. ఆయన ఆశీర్వాదంతో దీన్ని ప్రారంభించా. నేటికి (ఆదివారం) ఇది నెలకొల్పి 31 ఏళ్లవుతుంది. స్వామికి మాటిచ్చాను గనుక... కారణాంతరాల వల్ల తిరుమల వదిలి వచ్చినా... ఆ మహా యజ్ఞాన్ని మధ్యలో ఆపకూడదని దీని ద్వారా కీర్తనల ప్రచారం చేస్తున్నా. అన్నమయ్య కీర్తనల్లో ఓ దివ్యత్వం, ఓ వెలుగు. చాలామంది అంటుంటారు... నా పాట వింటుంటే అల్లకల్లోలంగా ఉన్న మనసు ప్రశాంతంగా మారుతుందని. రామకృష్ణమఠంలో పాడినప్పుడు కూడా కొందరు చెప్పేవారు... నా క్యాసెట్స్ పెట్టుకుని ధ్యానం చేస్తామని. ఆ మధ్య ఓ అమ్మాయి నాకు ఉత్తరం రాసింది. అత్తింటి పోరు పడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. చివరగా దైవ ధ్యానం చేయాలనిపించి... నా ఆల్బమ్ పెట్టుకుని వింటుంటే తనలో ఆ ఆలోచన పోయిందట. నా జీవితాన్ని ఇలా భక్తి సంగీతం వింటూ గడపలేనా అనిపించిందంటూ ఆమె రాసింది. గమనించాల్సిందేమిటంటే... అన్నమయ్య గీతాలకు మానసిక ప్రక్షాళన చేసే శక్తి ఉందని. మా భావనా వాహిని లక్ష్యం కూడా అదే... ‘భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ’. నేటితరం... కీర్తనం... ఇప్పటివరకు భావన వాహిని ద్వారా పదహారు వేల మందికి కీర్తనలు నేర్పా. వారిలో చాలా మంది ఏదో రకంగా కొనసాగిస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో నేర్చుకుని, ప్రస్తుతం రాణిస్తున్నవారెందరో. సాందీప్, రాధిక, గోపికాపూర్ణిమ, గీతామాధురి, హేమచంద్ర, కారుణ్య వంటి ఎందరో వర్ధమాన గాయకులు ఇక్కడి నుంచి షైన్ అయినవారే. ఇక్కడికి వచ్చేవారికి కీర్తనలే కాదు.. ఆధ్యాత్మిక చింతన, మానవీయ విలువల గురించీ చెబుతా. ఉపశమన సంకీర్తనం... వైఫల్యంతోనో, మరేదైనా బాధతోనో, ఒత్తిడితోనో మానసికంగా కుంగిపోయేవారికి సంకీర్తనల ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం కల్పించే ఆలోచనే ‘ఉపశమన సంకీర్తనం’. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి వద్దకు స్వయంగా వెళ్లి, నా ఖర్చులతోనే సంకీర్తనలు చేసి, వాళ్లలో మానసిక పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇటీవల ఓ 75 ఏళ్ల వృద్ధుడు చాలా కాలంగా మంచంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆయన కుమార్తె నాకు ఫోన్ చేసింది. నేను వెళ్లి కీర్తనలు పాడితే... అప్పటి వరకు కోమాలో ఉన్న ఆయనలో కదలిక వచ్చింది. ఆ తరువాత ఆయన చనిపోయినట్టు ఆమె చెప్పింది. చివరి దశలో ప్రశాంతంగా కన్ను మూసినందుకు నాకు ధన్యవాదాలు తెలిపింది. ఇలానే ‘నాద చికిత్స’. ప్రత్యేకంగా ఆ అంశాన్నే కేంద్రీకృతం చేసి, ఓ కార్యక్రమాన్ని రూపొందించా. నిమ్స్ (2000)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే... చాలామంది పేషెంట్లు తమకు దీనివల్ల ఎంతో ఆనందం కలిగిందన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ‘నగర సంకీర్తన’ చేస్తున్నాం. మా విద్యార్థులు, కళాకారులు, కళాభిమానులు కలసి చేసే మహత్తర కార్యమిది. దీని పరమార్థం... భావ కాలుష్యాన్ని తుడిచేయడం. లుంబినీ పార్కు, గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అన్ని మతాల వారితో శాంతి సంకీర్తనలు చేశాం. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య, లాన్స్ నాయక్ రామచంద్రుడుల ఆత్మకు శాంతి కలగాలని కీర్తనలు పాడి, వారి కుటుంబాలను సన్మానించిన తొలి సాంస్కృతిక సంస్థ మాది. సంస్థకు ఫండింగ్ అంటే... పాటల ద్వారా నాకు వచ్చే పారితోషికం తొంభై శాతం. మిగిలింది కళాభిమానులు ఇచ్చింది. టీటీడీ వంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు ముందుకు వస్తే... దీన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. ప్రపంచాన్ని ‘స్వరధామం’గా మార్చవచ్చు.