రాబిన్‌ఫుడ్ ఆర్మీ
ఉన్నవాడిని కొట్టి లేని వాడికి పంచాడు ఆ రాబిన్‌హుడ్. స్ఫూర్తి అతడే. థీమూ అదే. కాకపోతే అతనిది దొడ్డిదారి. వీరిది రహదారి. నాడు ఒక్కడే. నేడు ఎందరో. అతడికి వారసులుగా అభివర్ణించుకుంటూ... పేదల హృదయాలు గెలుచుకొంటున్న సిటీ ‘రాబిన్‌హుడ్‌లు’ వీరు. ఒక్కడిగా మొదలై సైన్యంలా మారిన ఈ ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ టార్గెట్... సర్వీస్!
- హనుమా
ఈ మహానగర వీధుల్లో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ జీవనం వెళ్లదీసే అభాగ్యులెంతోమంది. ఏ ఆసరా లేక.. పట్టించుకొనే దిక్కు లేక.. భారంగా బతుకీడుస్తున్న వారిని చూస్తే ఎవరి మనసైనా కరుగుతుంది. కూడు, గుడ్డ, నీడ... వీటిలో తొలి ప్రాధాన్యం పట్టెడు అన్నమే. ‘అలా వీధులే ఆవాసాలుగా బతుకుతున్న వారి ఆకలి తీర్చడమే మా ఎజెండా’ అని చెబుతున్నాడు నగరంలో ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’కి శ్రీకారం చుట్టిన ఆదిత్య గుప్తా.
అంకురార్పణ...
ఈ ఆర్మీకి బీజం పడింది దిల్లీలో. గతేడాది జూన్‌లో నీల్‌ఘోష్ ప్రారంభించాడు. అతడి స్నేహితుడే ఆదిత్య. నీల్ సేవను ఫేస్‌బుక్‌లో చూసి... తానెందుకు భాగస్వామి కాకూడదనిపించింది ఆదిత్యకి. దానికి రూపమే హైదరాబాద్ చాప్టర్. సెప్టెంబర్ 2014లో ఒక్కడిగానే మొదలెట్టాడు. ఆ తరువాత ఎఫ్‌బీలో అతని ఫ్రెండ్స్ చేయి కలిపారు. ‘సమాజానికి ఏదో ఒకటి చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్లందరికీ సరైన ప్లాట్‌ఫాం ఉండదు. ఈ వాలంటీర్లంతా అలా తమకు తాముగా సర్వీస్ చేసేందుకు ముందుకు వచ్చినవారే’ అంటాడు ఆదిత్య. ఇప్పుడు హైదరాబాద్ చాప్టర్‌లో వాలంటీర్ల సంఖ్య 84 చేరింది. భారత్‌లో ఇదే పెద్ద చాప్టర్.
సామాజిక సైట్లే వార ధి..
వీరందరినీ కలిపింది సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్. ‘ఎఫ్‌బీలో ఆదిత్య పోస్టింగ్స్ చూసి ఆకాంక్ష.. ముందుకొచ్చింది. అలానే స్ఫూర్తిరెడ్డి.. ఆ తరువాత నేను.. ఇలా కలిశాం’ అంటూ చెప్పుకొచ్చాడు మరో సభ్యుడు హర్ష్, ఆదిత్యలానే హర్ష్ కూడా బిజినెస్‌మ్యాన్. ఆర్కిటెక్ట్. ఆకాంక్ష ఓ ప్రముఖ కంపెనీలో చార్టెర్డ్ అకౌంటెంట్. స్ఫూర్తిరెడ్డి ఓ యాడ్ ఏజన్సీలో కీలక పదవిలో కొనసాగుతోంది. వీరే కాదు... వాలంటీర్లందరూ వర్కింగ్ పీపులే. వీరిలో లాయర్లు, టీచర్లు, బిజినెస్ పర్సనాలిటీస్, సీఏలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇలా అన్ని రంగాల వారూ ఉన్నారు. ఇరవై మొదలుకొని అరవై వరకు అన్ని వయసులవారు భాగస్వాములు.
ఎంతో వేస్టేజీ...
నగరంలో లెక్కకు మించి రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో రోజూ చాలా ఫుడ్ వేస్టయిపోతుంటుంది. కాన్ఫరెన్స్‌లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు.. ఇలా రకరకాల అకేషన్లలోనూ ఆహారం మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన ఫుడ్‌ని వృథా చేయకుండా.. ‘క్యాటరింగ్ వారు మాకు సమాచారమిస్తే.. వెంటనే వెళ్లి కలెక్ట్ చేసి, దగ్గర్లోని స్ట్రీట్ పీపుల్‌కు సర్వ్ చేస్తాం’ అని చె బుతున్న స్ఫూర్తి మాటల్లో సమాజం కోసం ఏదో చేయాలన్న తపన కనిపిస్తుంది.
మిషన్ ఇలా...
‘ఇప్పుడు వారానికి రెండు రోజులు (వీకెండ్స్) డ్రైవ్స్ చేస్తున్నాం. ఫలానా రెస్టారెంట్‌లోనో, ఫంక్షన్‌లోనో ఫుడ్ మిగిలిందని మాకు సమాచారం వస్తుంది. వెంటనే వాలంటీర్లందరికీ వాట్సప్‌లో మెసేజ్‌లు వెళ్లిపోతాయి. రెస్టారెంట్ ఉన్న ప్లేస్‌ను బట్టి ఎక్కడ కలవాలన్నది ముందుగా నిర్ణయించుకుంటాం. రాత్రి 8 గంటలకు అంతా ఆ స్పాట్‌లో కలుస్తాం. వీధుల్లో అనాధలు, అభాగ్యులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి... ఒక్కో గ్రూపు ఒక్కో ప్రాంతానికి వెళ్లి ఆహారం పంపిణీ చేస్తుంది. అర్ధరాత్రైనా సరే... ఆగిపోయేది లేదు. ఆకలిగా ఉన్నవారి కడుపు నింపితే అందులో ఉండే ఆనందమే వేరు’అని అంటున్న ఆకాంక్ష కళ్లలో వెలుగు. సేవలో ఉన్న గొప్పదనమదే అంటుందీ సీఏ.
వస్తురూపంలోనూ...
ఫుడ్ కలెక్షన్‌తోనే అయిపోదు... దాని ప్యాకింగ్, పంపిణీ చేయాల్సిన చోటికి చేర్చడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. పెద్దమొత్తంలో తీసుకెళ్లాలంటే భారీ గిన్నెలు, ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలి. పంచడానికి పేపర్ ప్లేట్స్ కావాలి. ‘వీటికోసం ఎవరైనా మా ఆర్మీకి డొనేట్ చేయాలనుకుంటే డబ్బుల రూపంలోనే అక్కర్లేదు... పేపర్ ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులు, ప్యాకింగ్ మెటీరియల్, వెసల్స్, డ్రింకింగ్ వాటర్... ఇలా ఏరూపంలోనైనా అందించొచ్చు’ అని చెప్పిన హర్ష్‌లా అందరు కుర్రాళ్లూ ఆలోచిస్తే లెక్కకు మించి అభాగ్యుల కడుపు నింపవచ్చు.
లార్జెస్ట్ డ్రైవ్..
ఇప్పటి వరకు వీరు చేసిన డ్రైవ్‌లన్నింటిలోకీ అతి పెద్దది ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి దగ్గర 980 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. అలాగే వీధుల్లో చలికి వణికిపోతున్న వారికి 1350 బ్లాంకెట్స్ పంచారు. ఇప్పటి వరకు 30 డ్రైవ్స్ నిర్వహించారు. దాదాపు 2500 మందికి ఫుడ్ అందించారు.
ఫ్యూచర్ ప్లాన్స్..
‘పేదవారికి కనీస అవసరాలు తీర్చే దిశగా డ్రైవ్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. అయితే అందుకు మాకున్న సంఖ్య సరిపోదు. ఈ సంఖ్యను పెంచుకోవాలనుకొంటున్నాం. సేవ చేయాలనుకునేవారెవరైనా మా ఆర్మీలో చేరవచ్చు. ఇప్పటి వరకు ఉన్నవారంతా వర్కింగ్ పీపులే. స్టూడెంట్స్ కూడా రావచ్చు. ఈ ఆర్మీ కోసం మేం వెచ్చిస్తున్న సమయం వారంలో కేవలం నాలుగైదు గంటలు’ అంటున్నాడు ఆదిత్య.
అదర్ సిటీస్..
రాబిన్‌హుడ్ ఆర్మీ హైదరాబాద్‌తో పాటు దిల్లీ, జైపూర్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో సేవలందిస్తోంది. త్వరలో కఠ్మండూలో చాప్టర్ ప్రారంభించబోతున్నారు. పాకిస్థాన్‌లోని కరాచీలోనూ ఇటీవలే రాబిన్‌హుడ్ ఆర్మీ సర్వీస్ షురూ అయింది. సారా అఫ్రిదీ సారథ్యంలో అక్కడ సేవలు అందించనున్నారు.
- ఈ మెయిల్:
robinhoodarmyhyderabad@gmail.com