అన్నమయ్య పదశోభ | annamayya sankrithanam | Sakshi
Sakshi News home page

అన్నమయ్య పదశోభ

Published Sun, Nov 30 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

అన్నమయ్య పదశోభ

అన్నమయ్య పదశోభ

హరినామమే కడు ఆనందకరము.. అని అన్నమయ్య తిరువీధుల వెలసిన ఆ దేవదేవుడ్ని కీర్తించాడు. ఆ వాగ్గేయకారుడి సంకీర్తనలను తన అమృతగానంతో ఆలపిస్తూ తన పరబ్రహ్మం ఆ శ్రీహరి ఒక్కడేనని చాటుతున్నారు శోభారాజు. ‘కట్టెదుర ఉన్న వైకుంఠం’ వదిలి భాగ్యనగరానికి చేరుకున్న ఆమె అన్నమయ్య భావన వాహిని ద్వారా మూడు దశాబ్దాలుగా తన రాగతరంగాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. మనుషుల మనసులను ఆవహించిన భావ కాలుష్యాన్ని నివారించే శక్తి సంకీర్తనలకు ఉందని చెబుతున్నారు. ఇది కాక సౌభాగ్యం ఇది కాక తపము మరి ఇది కాక వైభోగము ఇంకొకటి కలదే అంటూ కోనేటిరాయుడ్ని నిరంతరం కీర్తిస్తున్న శోభారాజు తన అంతరంగాన్ని ఇలా ఆవిష్కరించారు.
 - హనుమా
 
‘జో అచ్యుతానంద... జోజో ముకుందా...’ అంటూ అమ్మ పాడుతూ ఉంటే... అలా నాకు తెలియకుండానే అన్నమయ్య పాటలు నన్ను ఆకట్టుకున్నాయి. అవి అన్నమాచార్య కీర్తనలని అప్పుడు నాకు తెలియదు. టెన్త్ పాసైన తరువాత ఇంటర్‌లో చేరడానికి తిరుపతి వెళ్లా. ఏటా అక్కడ జరిగే అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లో పాడుతుండేదాన్ని. వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంటర్ వర్సిటీ కాంపిటీషన్‌లో అన్నమయ్య కీర్తనలు పాడి మొదటి బహుమతి గెలుచుకున్నా. సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు వచ్చేవారు. తన కచేరీలో రెండు పాటలు పాడించారు. ఆ తరువాత ఆయన మద్రాసు నుంచి ఉత్తరం రాశారు... ‘నీ కోసం రెండు స్వరాలు చేశా పాడతావా అంటూ..! సినిమా ఫీల్డు, పైగా మద్రాసు వెళ్లడమంటే ఇంట్లోవాళ్లు వద్దన్నారు.

అన్నయ్యకు నచ్చజెబితే సరే అన్నారు. 1972లో ‘నారాయణతే నమో నమో.., అదె చూడు తిరువెంకటాద్రి కొండా..’ కీర్తనలు పాడా. అదే నా తొలి అల్బమ్. అలా అనుకోకుండా అన్నమయ్య తన వైపు లాక్కొని వెళ్లాడు. ఆ తరువాత టీటీడీ వారు అన్నమాచర్య కీర్తనల ప్రచారం, సాహిత్యంపై అధ్యయనానికి స్కాలర్‌షిప్ ఇచ్చి ప్రోత్సహించారు. అన్నమయ్య తత్వం అప్పుడర్థమైంది. ఆయనకు స్వామి, మానవాళిపై ఉన్న ప్రేమ తెలిసింది. క్రమంగా ఆయన వ్యక్తిత్వంపై గౌరవం, ఆరాధన పెరిగాయి. ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రయత్నిద్దాం అనుకుంటున్న సమయంలో... టీటీడీ నుంచి ‘అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి ఆస్థాన గాయకురాలిగా’ నియమిస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడే స్వామికి మాటిచ్చా... ‘జీవితాంతం నీకు స్వర కైంకర్యం చేస్తా’నని.
 
భావనా వాహిని...
కొన్ని కారణాలతో తిరుపతి వదిలి హైదరాబాద్‌కు (1982) రావాల్సి వచ్చింది. 1983 నవంబర్ 30న నా పుట్టిన రోజున ‘అన్నమయ్య భావనా వాహిని’ స్థాపించా. నా పుట్టిన రోజు సందర్భంగా నాన్న రూ.1116లు బహుమతిగా ఇచ్చారు. ఆయన ఆశీర్వాదంతో దీన్ని ప్రారంభించా. నేటికి (ఆదివారం) ఇది నెలకొల్పి 31 ఏళ్లవుతుంది. స్వామికి మాటిచ్చాను గనుక... కారణాంతరాల వల్ల తిరుమల వదిలి వచ్చినా... ఆ మహా యజ్ఞాన్ని మధ్యలో ఆపకూడదని దీని ద్వారా కీర్తనల ప్రచారం చేస్తున్నా. అన్నమయ్య కీర్తనల్లో ఓ దివ్యత్వం, ఓ వెలుగు. చాలామంది అంటుంటారు... నా పాట వింటుంటే అల్లకల్లోలంగా ఉన్న మనసు ప్రశాంతంగా మారుతుందని. రామకృష్ణమఠంలో పాడినప్పుడు కూడా కొందరు చెప్పేవారు... నా క్యాసెట్స్ పెట్టుకుని ధ్యానం చేస్తామని.

ఆ మధ్య ఓ అమ్మాయి నాకు ఉత్తరం రాసింది. అత్తింటి పోరు పడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. చివరగా దైవ ధ్యానం చేయాలనిపించి... నా ఆల్బమ్ పెట్టుకుని వింటుంటే తనలో ఆ ఆలోచన పోయిందట. నా జీవితాన్ని ఇలా భక్తి సంగీతం వింటూ గడపలేనా అనిపించిందంటూ ఆమె రాసింది. గమనించాల్సిందేమిటంటే... అన్నమయ్య గీతాలకు మానసిక ప్రక్షాళన చేసే శక్తి ఉందని. మా భావనా వాహిని లక్ష్యం కూడా అదే... ‘భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ’.
 
నేటితరం... కీర్తనం...
ఇప్పటివరకు భావన వాహిని ద్వారా పదహారు వేల మందికి కీర్తనలు నేర్పా. వారిలో చాలా మంది ఏదో రకంగా కొనసాగిస్తున్నారు. సమ్మర్ క్యాంపుల్లో నేర్చుకుని, ప్రస్తుతం రాణిస్తున్నవారెందరో. సాందీప్, రాధిక, గోపికాపూర్ణిమ, గీతామాధురి, హేమచంద్ర, కారుణ్య వంటి ఎందరో వర్ధమాన గాయకులు ఇక్కడి నుంచి షైన్ అయినవారే. ఇక్కడికి వచ్చేవారికి కీర్తనలే కాదు.. ఆధ్యాత్మిక చింతన, మానవీయ విలువల గురించీ చెబుతా.  
 
ఉపశమన సంకీర్తనం...
వైఫల్యంతోనో, మరేదైనా బాధతోనో, ఒత్తిడితోనో మానసికంగా కుంగిపోయేవారికి సంకీర్తనల ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం కల్పించే ఆలోచనే ‘ఉపశమన సంకీర్తనం’. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి వద్దకు స్వయంగా వెళ్లి, నా ఖర్చులతోనే సంకీర్తనలు చేసి, వాళ్లలో మానసిక పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇటీవల ఓ 75 ఏళ్ల వృద్ధుడు చాలా కాలంగా మంచంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆయన కుమార్తె నాకు ఫోన్ చేసింది. నేను వెళ్లి కీర్తనలు పాడితే... అప్పటి వరకు కోమాలో ఉన్న ఆయనలో కదలిక వచ్చింది.

ఆ తరువాత ఆయన చనిపోయినట్టు ఆమె చెప్పింది. చివరి దశలో ప్రశాంతంగా కన్ను మూసినందుకు నాకు ధన్యవాదాలు తెలిపింది. ఇలానే ‘నాద చికిత్స’. ప్రత్యేకంగా ఆ అంశాన్నే కేంద్రీకృతం చేసి, ఓ కార్యక్రమాన్ని రూపొందించా. నిమ్స్ (2000)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే... చాలామంది పేషెంట్లు తమకు దీనివల్ల ఎంతో ఆనందం కలిగిందన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ‘నగర సంకీర్తన’ చేస్తున్నాం. మా విద్యార్థులు, కళాకారులు, కళాభిమానులు కలసి చేసే మహత్తర కార్యమిది. దీని పరమార్థం... భావ కాలుష్యాన్ని తుడిచేయడం.  
 
లుంబినీ పార్కు, గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు జరిగినప్పుడు అన్ని మతాల వారితో శాంతి సంకీర్తనలు చేశాం. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య, లాన్స్ నాయక్ రామచంద్రుడుల ఆత్మకు శాంతి కలగాలని కీర్తనలు పాడి, వారి కుటుంబాలను సన్మానించిన తొలి సాంస్కృతిక సంస్థ మాది. సంస్థకు ఫండింగ్ అంటే... పాటల ద్వారా నాకు వచ్చే పారితోషికం తొంభై శాతం. మిగిలింది కళాభిమానులు ఇచ్చింది. టీటీడీ వంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు ముందుకు వస్తే... దీన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. ప్రపంచాన్ని ‘స్వరధామం’గా మార్చవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement