భృగు మహర్షి పుత్రుడు చ్యవనుడు. తపస్సు చేస్తూ ఆయన ఒక ప్రదేశంలో కూర్చుని శిలలా ఉండిపోయాడు. అలా చాలాకాలం నిశ్చలంగా ఉండడంతో అతనిమీద చీమలు పుట్టలు పెట్టాయి. అతని ఒళ్ళంతా లతలు అల్లుకున్నాయి. అయినా ఆయన తన తపస్సు ఆపలేదు.
ఒకసారి శర్యాతి వేటకోసం అక్కడికి వచ్చాడు. తండ్రితోబాటు కుమార్తె సుకన్య కూడా వచ్చింది. అక్కడ ఆమె సఖులతో యథేచ్ఛగా విహరిస్తూ పుట్ట దగ్గరకొచ్చింది. పుట్టలో మెరుస్తున్న కళ్ళను చూసి, మిణుగురు లేమో అనుకుని కుతూహలంతో అక్కడ పడి ఉన్న పుల్లను తీసుకొని పొడిచింది. ఇంతలో చెలులెవరో పిలవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది. చ్యవనుడి తపో మహిమ వల్ల శర్యాతి సైన్యానికి మలమూత్ర బంధనం కలిగి సైన్యం అంతా విలవిల్లాడారు. అప్పుడు శర్యాతి తన పరివారాన్ని పిలిచి ‘‘ఈ పరిసరాలలో తపశ్శాలి, వృద్ధుడు, మహాత్ముడు అయన చ్యవన మహర్షి తపోదీక్షలో లీనమై ఉంటాడు. మీలో ఎవరైనా తెలిసీ తెలియక ఆయనకు హాని కలిగించలేదు కదా?’’ అని అడిగాడు. తమకేమీ తెలియదని చెప్పారు సైనికులు. మలమూత్ర అవరోధం వలన బాధపడ్తున్న సైన్యాన్ని, కారణమేమిటో తెలియక చింతిస్తున్న తండ్రిని చూచి సుకన్య తండ్రి దగ్గరకు వెళ్లి ‘‘వనంలో విహరిస్తున్న నేను మెరుస్తున్న ప్రాణి కండ్లను చూసి మిణుగురు పురుగులుగా భావించి దగ్గరకు వెళ్ళి పుల్లతో పొడిచాను నాన్నా! బహుశా ఆయనే మీరు చెబుతున్న మహర్షేమో! వెంటనే వెళ్లి చూద్దాం పదండి నాన్నా!’’అంటూ తండ్రిని చెట్టు వద్దకు తీసుకెళ్లింది.
శర్యాతి వెంటనే ఆ పుట్టదగ్గరకు వెళ్ళి ‘నా కుమార్తె అజ్ఞానంతో ఈ అపరాధం చేసింది. ఆమెను క్షమించండి మహర్షీ’’ అన్నాడు.అందుకు చ్యవనుడు ఆగ్రహంతో ‘‘నీ కుమార్తె నా కన్నులు పొడిచి నన్ను అంధుని చేసింది. ఈ వయసులో నన్ను చూసేవారెవరున్నారు. అందువల్ల ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తే మిమ్మల్ని క్షమిస్తాను’’ అన్నాడు.
ఆ మాటలకు శర్యాతి నిర్విణ్ణుడై కుమార్తె వంక నిస్సహాయంగా చూశాడు. సుకన్య వెంటనే ‘‘నా మూలంగా ఆ మహానుభావుడికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాలంటే నన్ను ఆయనకు ఇచ్చి వివాహం చేయడమే ఉత్తమం’’ అంది. దాంతో శర్యాతి తన కుమార్తెను చ్యవనునికిచ్చి వివాహం చేశాడు. ఋషి శర్యాతిని, అతని సైన్యాన్ని అనుగ్రహించాడు. శర్యాతి సైన్యంతో తన నగరానికి వెళ్లిపోయాడు. సుకన్య తాపసి అయిన భర్తకు భక్తి శ్రద్ధలతో సేవ చేసి మెప్పించింది. ఒకసారి అశ్వనీ దేవతలు ఆమెను పరీక్షించాలని రకరకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. ఆమె దేనికీ లొంగలేదు. దాంతో వారు ఆమె పాతివ్రత్యానికి సంభ్రమాశ్చర్యాలకు లోనై, చ్యవన మహర్షి యవ్వనంతో, మంచి రూపంతో ఉండేలా వరాన్ని అనుగ్రహించారు. తెలిసీ తెలియక చేసిన పొరపాటును నిజాయతీగా ఒప్పుకుని, అందుకు ప్రాయశ్చిత్తంగా ముసలి వాడైన, అంధుడైన, నిర్ధనుడైన వ్యక్తిని భర్తగా అంగీకరించి, ఆయనకు నిస్వార్థంగా సేవలు చేసి, మధ్యలో ఎన్ని ప్రలోభాలు ఎదురైనా లొంగక అందుకు ప్రతిఫలంగా భర్తకు పునర్యవ్వనాన్ని, అందమైన రూపాన్ని పొంది, సుఖించగలిగింది. తప్పుని ఒప్పుకుని దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే కలిగే ఫలితం ఎంతో గొప్పగా ఉంటుంది అన్నదే ఇందులోని నీతి.
Comments
Please login to add a commentAdd a comment