Ugadi 2024 : అదిరిపోయే వంటలు, వేప పువ్వు చారు ఒక్కసారి రుచిచూస్తే..! | Ugadi 2024 do you know these special recipes in telugu | Sakshi
Sakshi News home page

Ugadi 2024 : అదిరిపోయే వంటలు, వేప పువ్వు చారు ఒక్కసారి రుచిచూస్తే..!

Published Tue, Apr 9 2024 3:08 PM | Last Updated on Tue, Apr 9 2024 3:25 PM

Ugadi 2024 do you know these special recipes in telugu - Sakshi

పండగొచ్చిందంటే  పూజలు వ్రతాలే కాదు. దేవుడికి  భక్తితో పెట్టే నైవేద్యాలు. అంతేకాదు  ఇష్టమైన వంటలు, మధురమైన స్వీట్లు ఉండాల్సిందే..   ఈ సందర్భంగా మీకోసం స్పెషల్‌ వంటలు.. 

బెల్లం బీట్‌రూట్‌ అరటిపండు కేసరి
కావలసినవి: బాగా ముగ్గిన అరటిపండు – 1;  బీట్‌రూట్‌ ముక్కలు – అర కప్పు బొంబాయి రవ్వ – అర కప్పు; బెల్లం తురుము – కప్పు; నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు; పాలు – అర కప్పు; జీడి పప్పులు – తగినన్ని; ఏలకుల పొడి – చిటికెడు

తయారీ:
ముందుగా బీట్‌ రూట్‌ ముక్కలకు అర కప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా తయారు చేసి, బీట్‌ రూట్‌ను గట్టిగా పిండి నీళ్లు వేరు చేసి పక్కన ఉంచాలి.
బాణలిలో నెయ్యి వేసి కరిగాక రవ్వ వేసి దోరగా వేయించాలి 
అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గుజ్జులా అయ్యేలా చేతితో మెదిపి, బాణలిలో వేసి బాగా కలపాలి 
పాలు జత చేసి బాగా కలిశాక, బీట్‌ రూట్‌ నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ∙బెల్లం తురుము వేసి కరిగే వరకు కలుపుతూ ఉండాలి  (అవసరమనుకుంటే మధ్యలో ఒకసారి నెయ్యి వేసి కలపాలి)
చివరగా ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి.

పులిహోర
కావలసినవి: చింత పండు – 200 గ్రా; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్‌ స్పూన్లు; మినప్పప్పు – 2 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; నువ్వుల నూనె – కప్పు; ఉప్పు – తగినంత
పొడి కోసం: ధనియాలు – 3 టేబుల్‌ స్పూన్లు; మెంతులు – టీ స్పూను; ఎండు మిర్చి – 10; ఇంగువ – కొద్దిగా; 
అన్నం కోసం: బియ్యం – 4 కప్పులు;
పోపు కోసం; మినప్పప్పు – 3 టీ స్పూన్లు; పల్లీలు – అర కప్పు; జీడి పప్పు – అర కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; నువ్వుల నూనె – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3; ఉప్పు – తగినంత

తయారీ:
రెండు కప్పుల వేడి నీళ్లలో చింతపండును సుమారు అరగంటసేపు నానబెట్టాలి
మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మిక్సీ పట్టి, జల్లెడ వంటి దానిలో వడకట్టాలి (చెత్త వంటివన్నీ పైన ఉండిపోతాయి. అవసరమనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు జత చేసి జల్లెడ పట్టవచ్చు. మిశ్రమం చిక్కగా ఉండాలే కాని పల్చబడకూడదు)
ధనియాలు, మెంతులను విడివిడిగా బాణలిలో నూనె లేకుండా వేయించి, చల్లారాక విడివిడిగానే మెత్తగా పొడి చేయాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, మినప్పప్పు వరుసగా వేసి వేయించాలి
చింత పండు గుజ్జు జత చే సి బాగా కలిపి నూనె పైకి తేలేవరకు బాగా ఉడికించాలి
మెంతి పొడి జత చేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి
మరొక బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి, మినప్పప్పు, కరివేపాకు వరుసగా ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాక, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి దించేయాలి
ఒక ప్లేటులో అన్నం వేసి పొడిపొడిగా విడదీసి, టీ స్పూను నువ్వుల నూనె వేసి కలిపాక, ఉడికించి ఉంచుకున్న చింతపండు గుజ్జు, పోపు సామాను వేసి కలపాలి
ఉప్పు, చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసి కలిపి, గంట సేపు అలా ఉంచేసి, ఆ తరవాత తింటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.

పచ్చిమిర్చి పప్పు
కావలసినవి: కంది పప్పు – కప్పు, పచ్చి మిర్చి – 10, టొమాటో – 1, చింత పండు రసం – టీ స్పూను, ఆవాలు – టీ స్పూను, ఎండు మిర్చి – 2, ఇంగువ – చిటికెడు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – టేబుల్‌ స్పూను, ధనియాల పొడి – అర టీ స్పూను

తయారీ
ముందుగా కంది పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి
కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడేవరకు కలపాలి
మధ్యకు చీల్చి గింజలు తీసిన పచ్చిమిర్చి వేసి మరోమారు బాగా కలిపి, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించాలి
ఉడికించిన పప్పు వేసి బాగా మెదపాలి
చింత పండు రసం, ధనియాల పొడి వేసి బాగా కలిపి, చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.

మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి
కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2; నువ్వులు – కప్పు; పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – అర కప్పు; అల్లం తురుము – 2 టీ స్పూన్లు; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – 4 రెమ్మలు; ఎండు మిర్చి – 4; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత

తయారీ: మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక మామిడికాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం తురుము, పసుపు వేసి బాగా కలిపి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి
వేరొక బాణలి లో నూనె లేకుండా, నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తగా పొడి చేయాలి
వేయించి ఉంచిన మామిడి కాయ ముక్కల మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి ఒక పాత్రలోకి తీసుకోవాలి
బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు వేసి వేగాక, వెల్లుల్లి రేకలు, ఎండు మిర్చి, చివరగా కరివేపాకు వేసి వేయించి తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి
వేడి వేడి అన్నంలోకి కమ్మటి నెయ్యితో తింటే రుచిగా ఉంటుంది. 

వేప పువ్వు చారు
కావలసినవి: వేప పువ్వు – 3 టీ స్పూన్లు; చింత పండు – కొద్దిగా; ధనియాల పొడి – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; మినప్పప్పు – టీ స్పూను; ఎండు మిర్చి – 4; పచ్చి మిర్చి – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – టీ స్పూను

తయారీ:
వేప పువ్వును శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి
చింత పండును నానబెట్టి రసం తీసి పక్కన ఉంచాలి
బాణలి లో నూనె వేసి కాగాక ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేసి వేయించాలి
వేప పువ్వు, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించాక, చింత పండు రసం వేసి బాగా కలపాలి
రసం పొంగుతుండగా మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు పసుపు, కరివేపాకు, కొత్తి మీర వేసి వేసి ఒక పొంగు రానిచ్చి దించేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement