మన భారతీయ సంప్రదాయం ముఖ్యంగా మూడు నవరాత్రుల పండుగలను చెప్పింది. 1) వసంత నవరాత్రులు, 2) గణపతి నవరాత్రులు, 3) దేవీ నవరాత్రులు. వినాయక నవరాత్రులనకుండా గణపతి నవరాత్రులనటంలోనే గణపతి వైభవం మనకు స్పష్టంగా అర్థమౌతున్నది. వేదం కూడా వినాయకుణ్ణి గణపతిగానే కీర్తించింది. ఏ శుభకార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ‘‘ఓమ్ గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే‘‘ అనే వేదమంత్రంతోనే వినాయక పూజ ప్రారంభిస్తారు, గణపతులు మహాగణపతి, వాతాపిగణపతి, విద్యాగణపతి, విజయగణపతి, నృత్యగణపతి, సంగీత గణపతి, ఉచ్ఛిష్ట గణపతి ఇలా చాలా రకాలుగా ఉన్నారు. అందరికీ అవసరమైన వానినందిస్తూ అందరిచేత పూజలందుకొనే వాడు లక్ష్మీగణపతి.
ఈనాడు చదువులు, వ్యాపారాలు, ఆరోగ్యాలు, ఆరాధనలు, అన్నదానాలు అన్నీ ధనంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల లక్ష్మీగణపతిని ఆరాధిస్తే విద్యా, విజయం, ధనం అన్నీ కైవసం అవుతాయి. ఈ లక్ష్మీగణపతి వృత్తాంతం గణేశ జననం అనే పేరుతో బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో పూర్వాపరాలతో చాలా వివరంగా ఉంది.పార్వతీ పరమేశ్వరులు ఏర్పాటు చేసిన ఒక ఉత్సవంలో దేవతలందరితో పాటుగా హాజరైన లక్ష్మీదేవి ఆ సందర్భంలో గణేశుని ఉద్దేశించి మమ స్థితిశ్చ, దేహే తే గేహే భవతు శాశ్వతీ! (నీ శరీరంలో, నీవు ఉన్న ఇంటిలో శాశ్వతంగా నా స్థితి ఉంటుంది. అంటే నేను నివసిస్తాను) అని లక్ష్మీదేవి ప్రత్యేకంగా చెప్పినందువల్ల ఈ స్వామి లక్ష్మీగణపతి అయినాడు. వైభవం అంటే విశేషమైన పుట్టుక. ఆ పుట్టుక ఈ లక్ష్మీ గణపతిది.
శ్రీకృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్ననివారకమ్ ‘
పార్వతీశ్వరయోః పుత్రం లక్ష్మీగణపతిం భజే ‘‘
అనే ఈ శ్లోకాన్ని జపిస్తూ లక్ష్మీగణపతి స్వామిని ఆరాధిస్తే అఖండంగా ఆయుర్లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి కలుగుతాయి. ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆలయాలు బెంగళూరులోను, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో రత్నగిరి నగర్, పలకలూరి పంచాయతీలో లక్ష్మీగణపతి ఆలయం ఉన్నది. అక్కడి స్వామి ఎడమ వైపున ఒడిలో లక్ష్మీ అమ్మవారిని కూర్చుండపెట్టుకొని దశ భుజుడై దర్శనమిస్తాడు. అష్టలక్ష్ములకు సంకేతంగా ఎనిమిది చేతులతో ఎనిమిది విధాలైన ఆయుధాలను ధరించి ఒక చేతిలో అభయ ముద్రతో, మరొక చేతితో అమ్మవారిని ధరించి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యే వినాయకచవితి రోజున లక్ష్మీగణపతి స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిద్దాం మనతో పాటు దేశ సౌభాగ్యాన్ని కూడా పొందుదాం.
Comments
Please login to add a commentAdd a comment