షోడశ సంస్కారాలలో గర్భాధానం మొట్టమొదటిది. ధర్మబద్ధమైన సంతానోత్పత్తి కోసం భార్యాభర్తలు ఇద్దరూ గర్భాధాన కార్యాన్ని చేస్తారు. ఈ సమయాన భార్యాభర్తల మానసిక స్థితిని అనుసరించే పుట్టబోయే సంతానం లక్షణాలు నిర్ణయమవుతాయి. కాబట్టే ఆ సమయాన దంపతులు తమను తాము దేవతలుగా భావిస్తూ, అనగా ఆ భర్త సాక్షాత్తూ ప్రజాపతి అంశగా, భార్య వసుమతి అంశగా తలచి దేవతలను స్మరిస్తూ గర్భాధానాన్ని చేయాలని శాస్త్రం. అందుకే ఆ సమయాన, ‘‘విష్ణువు గర్భమును సిద్ధం చేయును, త్వష్ట్రపజాపతి శుక్రశోణితాలను కలిపి వాటికి అందమైన రూపనిర్మాణం చేయును’’ ఇత్యాది వేదమంత్రాలద్వారా, ఆ భార్యా భర్తల మనసులను దైవస్మరణలో ఉంచుతారు.
సంస్కార విధానం: నూతన వస్త్రాలు ధరించిన దంపతులు, సంకల్పం చెప్పుకుని, షోడశ ఉపచారాలతో గణపతిపూజ చేసి, ఆచమనం చేసి, ఆహూతులకు నమస్కరించి, ఒక పళ్ళెంలో దక్షిణ ఫలసహిత తాంబూలాదులను ఉంచి, ఆ పళ్లేన్ని పట్టుకుని కూర్చుండగా, ఆచార్యులవారి వేద మంత్రోచ్ఛారణలు పూర్తైన తరువాత, అందరి ఆశీర్వనాలూ తీసుకోవాలి. ఆతరువాత గర్భాధాన సంస్కారాన్ని ప్రారంభించాలి. ఈ సంస్కారానికి చవితి, షష్టి, అష్టమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, పండుగరోజులు, శ్రాద్ధదినం, ఆ ముందురోజు, ఆది, మంగళ, శని వారాలు, భరణి, కత్తిక, ఆరుద్ర, మఖ, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, మొదలైన నక్షత్రాలు నిషేధాలని శాస్త్రం.పదహారు సంవత్సరాలలోపు వయసుగల కన్య, ఇరవై ఐదు సంవత్సరాలలోపు వయసుగల పురుషుడు గర్భాధానం చేయుటకు అనర్హులని శాస్త్రం.
పుంసవనం: ఇది గర్భిణి ఐన స్త్రీకి, పుత్రుడు జన్మించాలని కోరుకుంటూ, గర్భ రక్షణకోసం చేసే సంస్కారం. ఈ సంస్కారం జరుపు సమయాన చదివే వేదమంత్రాలన్నీ కూడా, పుత్ర సంతానాన్ని ప్రసాదించమని దేవతలను వేడుకునేవే. పుత్రుడు జన్మించి, పితరులను పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని శాస్త్రవచనం. అందుకే సంతతిలో కనీసం ఒక పుత్రుడైనా ఉండాలని ఆకాంక్ష. ఒక పుత్రుడు జన్మించిన తరువాత, పుంసవన సంస్కారం జరిపించాలని నియమేమీ లేదు. ఈ సంస్కారాన్ని వివిధ శాస్త్రకారులు వివిధ మాసాలలో జరిపించాలని చెప్పినా, సహజంగా, తొలిచూలులో మూడవనెల లేక నాల్గవనెలలో మొదటి పదిరోజులలోపు జరపాలని ఎక్కువమంది శాస్త్రకారులు తీర్మానించారు. ఎందుకంటే నాలుగునెలలలోపు గర్భస్థ శిశువుకి స్త్రీ/పురుష చిహ్నాలు ఏర్పడవు. కాబట్టి ఆ చిహ్నాలు ఏర్పడకముందే ఈ సంస్కారం జరిపించాలని శాస్త్రం.
సంస్కార విధానం: ఒక శుభదినాన, ఉదయాన్నే స్నానాదులను ఆచరించి, పీటలమీద కూర్చుని, సంకల్పం చెప్పుకుని, దీక్షా కంకణాలని ధరించాలి. తర్వాత పుత్రకారకులైన త్వష్ట్రబహ్మకు, విష్ణువుకు, రుద్రునకు, ఇతర దేవతలకు హోమాలు నిర్వహించి, వారికి హవిస్సులను అర్పించి, జయాది హోమాన్ని చేయాలి. ఆ తరువాత, నిర్దుష్టమైన శాస్త్రోక్త విధానంలో వేదమంత్రాలను చదువుతూ పుంసవన సంస్కారాన్ని జరిపించాలి. తదుపరి అందరికీ భోజనాలను వడ్డించి, వారినుండి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇందుకు పుష్యమీ నక్షత్రం శ్రేష్ఠమని శాస్త్రం.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment