ప్రపంచ దేశాల వైవాహిక వ్యవస్థలన్నింటిలో భారతదేశ వైవాహికవ్యవస్థ తలమానికమైనది. ఇంత బలమైన పునాదులుగల వ్యవస్థ మరి ఏ ఇతర దేశాలలోనూ లేదు అనిచెప్పవచ్చు. ఇంత పటిష్ఠమైన వ్యవస్థను భారతీయులు నిర్మించగలిగారు కనుకనే, భారతదేశం ఒక ధార్మిక సమాజాన్ని నిర్మాణంచేయగలిగింది. పాశ్చాత్య దేశాలలోని ప్రజలు, వివాహమంటే, ఇంద్రియముల సేవకై స్త్రీపురుషులు కేవలం కొంతకాలం మాత్రం నిలిచియుండే ఒక భౌతికమైన సంబంధాన్ని మాత్రం ఏర్పరచుకోవడం అనుకుంటారు.
కానీ సనాతన ధర్మంలో వివాహమంటే, ఆ స్త్రీ పురుషుల మనస్సులు, వాక్కులు, శరీరాలు, ప్రాణాలు, ఆత్మలు ఒకటికావాలంటూ, వారిద్దరి మధ్యలో ఒక గాఢమైన ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక బంధాన్ని ఏర్పరుస్తారు. ఆ బంధంద్వారా వారిద్దరూ ఆజన్మాంతం కలిసిమెలిసివుండి ఇద్దరికీ మోక్షంకలిగించే ఒక ప్రయత్నమే సనాతనధర్మంలో వివాహమంటే. వివాహంలో జరిపే ప్రతి ఒక్క ఆచారమూ వివిధరకాల దేవతలతో ముడివడి ఆ నూతన వధూవరుల మనసులో, విడదీయరాని ఒక పారమార్ధిక బంధాన్ని ఏర్పరిచేవిధంగా బలమైన ఆలోచనలను కలిగిస్తుంది.
అందుకే షోడశ సంస్కారాలలో వివాహం ఒక ప్రధాన సంస్కారంగా పరిగణించారు పెద్దలు. వివాహానికే ఉద్వాహం, కల్యాణం, పరిణయం, ఉపయమం, పాణిగ్రహణం అని పేర్లు. హిందూ సంస్కారాలలో వివాహ సంస్కారానికి సర్వోన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. ఎందుకంటే, అన్ని సంస్కారాలకు, అన్ని వ్యవస్థలకు మూలాధారమైన సంస్కారం ఇదే కాబట్టి. గృహస్థాశ్రమమే మిగిలిన మూడు ఆశ్రమాలకు, అంటే బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్న్యాస ఆశ్రమాలకు కేంద్రమై వున్నది. గృహస్థాశ్రమం లేకుంటే, మిగిలిన మూడు ఆశ్రమాల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. అన్ని ఆశ్రమాలు గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి వుంటాయి కనుకనే, గృహస్థాశ్రమాన్ని జ్యేష్ఠాశ్రమం అని కూడా అన్నారు.
అంతేకాకుండా, వివాహం కాని మానవులు పరిపూర్ణులు కాజాలరు. ఎందుకంటే, వారు చేసిన యజ్ఞంతో దేవతలు సంతృప్తిని పొందరు. ఇదిగాక, కేవలం వివాహ సంస్కారం ఆచరించి గృహస్థుడైన పురుషుడు, తన ధర్మపత్ని ద్వారా సత్సంతానాన్ని పొంది నరకబాధల నుండి విముక్తి పొందుతాడని శాస్త్రవచనం. కనుక, వివాహంలేని మనుష్యునకు మోక్షప్రాప్తి కూడాలేదు. పైగా, దైవదత్తం, ప్రకృతిసిద్ధం, బహుబలీయమూ అయిన మానవుని కామవాంఛను విశృంఖలం కానీయక అదుపులో వుంచి, ధర్మబద్ధమైన జీవితం గడపడానికి ఈ వివాహవ్యవస్థ ఎంతో అవసరం.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు
Comments
Please login to add a commentAdd a comment