తోడబుట్టినవారే తొలి బంధువులు | Chaganti Koteswara Rao Pravachanam In Sakshi Funday | Sakshi
Sakshi News home page

తోడబుట్టినవారే తొలి బంధువులు

Published Sun, Feb 16 2020 8:39 AM | Last Updated on Sun, Feb 16 2020 8:41 AM

Chaganti Koteswara Rao Pravachanam In Sakshi Funday

కిష్కింధకాండలో తార చేసిన ప్రసంగం చదువుతుంటే, తార మాట్లాడిన మాటలు వింటూంటే... అన్నదమ్ములన్న వాళ్ళు ఎలా బతకాలో, ఎంత ప్రేమగా ఉండాలో తెలుస్తుంది. సుగ్రీవుడొచ్చి పెద్ద అట్టహాసం చేసాడు. వాలి యుద్ధానికి వెళ్ళాడు. ఒంటినిండా దెబ్బలతో నెత్తురు కారుతుండగా సుగ్రీవుడు తిరిగి వెళ్ళిపోయాడు. ‘‘రామా ! నిన్ను నమ్ముకుని వెళ్ళాను. వాలిని సంహరిస్తానన్నావు. నెత్తురోడుతూ వెనక్కొచ్చా. ఎందుకెయ్యలేదు బాణం?’’ అనడిగాడు. మీరిద్దరూ ఒకేలాగా కనిపించారు. పొరపాటు జరుగుతుందని జంకా. గుర్తుకి నీమెడలో తామరమాలతో వెళ్ళు’’ అని గజ పుష్పమాలవేసి పంపాడు. సుగ్రీవుడు మళ్ళీ వెళ్ళి ‘‘అన్నయ్యా! బయటికి రా యుద్దానికి..’’ అని సింహనాదం చేసాడు. వాలి బయటకు వెళ్ళబోతున్నాడు. తార చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి..‘‘ఒక్కమాట చెబుతాను... సావధానంగా విను’’ అన్నది.

‘‘ఎవరి మీద యుద్ధానికి వెడుతున్నావు. నీ తమ్ముడి మీదనే కదా. ఎవరు నీ తమ్ముడు? ఒక్క తల్లికి, ఒక్క తండ్రికి... ఒక చెట్టుకు పూసిన పూలలాంటి వారు, రెండు కాయల లాంటి వారు మీరిద్దరు. ఎడమ చేయి, కుడిచేయి వేరవ్వచ్చు. కానీ అవి ఒకే దేహానివి. ఇవి రెండూ ఎప్పుడూ కొట్టుకోవు. ఒక చేతికి నొప్పెడితే దాని పని కూడా రెండో చెయ్యి చేస్తుంది. ఒకవేళ నీ తమ్ముడు తప్పుచేసాడే అనుకో. దానికంతగా నెత్తురు కారేటట్లు కొట్టాలా? ఇద్దరూ వీథికెక్కి గదాయుద్ధం చేసుకోవాలా? ఇద్దరూ శక్తిమంతులే కదా. ఒక్కటై నిలబడితే మిమ్మల్ని నిలువరించేవారున్నారా? మీ ఐక్యతను చూసి లోకం ఎంత సంతోషిస్తుంది ?’’

‘‘ఎందుకయ్యా తమ్ముడితో యుద్ధం చేస్తావు! వానరుడేగా. పైగా తమ్ముడు. తెలిసీ తెలియని వాడు. చిన్నవాడు. తమ్ముడంటే కొడుకులాంటివాడు. తప్పుచేసినట్లు అనిపిస్తే..మందలించు. అయినా వాడే దూరంగా జరిగిపోయాడనుకో. వాడి ఖర్మ. కానీ నీ దగ్గరకొచ్చాడుగా. కొట్టకు. అనునయించు.’’
‘‘పైగా మరొక్కమాట. నీ చేతిలో చావుదెబ్బలు తిన్నాడా.. అంత నెత్తురు కక్కాడా.. మళ్ళీ వెంటనే వచ్చి సింహనాదం చేస్తున్నాడంటే ఏదో కారణం లేకుండా ఎందుకొచ్చాడు... ఏదో బలం చూసుకోకుండా ఎందుకొచ్చాడు.. నా మాట విను ఏదో ఉంది. నీకు తెలియదు. తొందరపడొద్దు. మీ ఇద్దరి జగడంవల్ల ఆఖరికి ఇద్దరిలో ఒకరే మిగిలిపోతే, మిగిలిన వారు ఎంత ఏడ్చినా రెండవ వారు రారుగా... అలా ఒకర్నొకరు కొట్టుకుని చచ్చిపోకూడదు. తప్పు. తమ్మణ్ణి లాలించు. లోపలికి పిలువు. పిలిచి–‘ఇప్పుడే కొట్టాను. బుద్ధి రాలేదా...మళ్ళీ యుద్దానికి ఎందుకొచ్చావు’ అని అడుగు. నేను వదిననేగా. నాకు బిడ్డడు లాంటివాడే కదా. నచ్చచెప్పడానికి నాకూ అధికారముందిగా... లోకంలో అందరికన్నా బంధువన్నవాడు ఎవరో తెలుసా? తోడబుట్టినవాడే బంధువు. ఎందుకయ్యా తమ్ముడి మెడలు విరిచేస్తానంటావు. లోపలికి పిలువు.. చక్కగా మాట్లాడుకోండి.’’

‘‘గూఢచారులను పంపి తెలుసుకున్నా. మీ తమ్ముడు రామచంద్రమూర్తితో ఒప్పందం చేసుకున్నాడు. రాముడు అరివీర భయంకరుడు. ఆశ్రయించినవాడిని కాపాడతానని రాముడు కూడా ప్రతిజ్ఞ చేసాడు. తొందరపడి యుద్ధానికి వెళ్ళకు. మీరిద్దరూ పగలు పెంచుకుని ఒకర్ని ఒకరు చంపుకుంటే అక్కరలేని ప్రమాదం వస్తుంది. నాథా! నా మాట విను. తమ్ముడిని పిలువు’’ అంది. తార మాటను తోసిరాజని వెళ్ళిపోయాడు వాలి. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement