గాంధారికి బహుసంతానవతి అని వరముంది. ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త, సంతానం అంతా ధర్మం తప్పి ప్రవర్తించినా తాను మాత్రం ధర్మపక్షపాతియై ధర్మం విషయంలో ఎక్కడా ఆమె వెనుకంజ వేయకుండా మాట్లాడగలిగిన స్థితిని పొందింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి‘నాకు విజయం కలగాలి’ అని ఆశీర్వచనం చేయమన్నాడు. ఆమె మాత్రం నిర్మొహమాటంగా..‘‘ ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం. నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు. ఆయనకు వశవర్తియై ప్రవర్తించు. అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు. దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు తప్ప నీవు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు సుయోధనా...’’అంది. కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు.
అందునా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలయి పడిపోతే....ఆమె కోపం అటుతిరిగి ఇటు తిరిగి ఎవరిమీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి అంది..‘‘అన్నీ నీకు తెలుసు కృష్ణా, వీరందరూ మరణిస్తారని తెలుసు. నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు. దీనికంతటికీ కారణం కృష్ణా నువ్వే... నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకుని నశించి పోయెదరు గాక.. కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చెదవుగాక’’ అని శపించింది. దానికి కృష్ణుడు నవ్వి ‘‘అమ్మా! ధర్మానికి వంతపాడినందుకు నాకు నువ్విచ్చే కానుకా ఇది..!!!’’ అన్నాడు. ఆ మాటతో ఇంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచించుకు పోయింది.
ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడూ కూడా బతకలేదు కదా... ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా.. అని వ్యాకులత చెంది కుంతిబిడ్డల పంచనజేరి జీవితం గడుపుతూ, భీముడనే మాటలు వినలేక ధతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయి అక్కడ దావాగ్నిలో శరీరాన్ని విడిచి పెట్టేసింది. అలాగే కుంతీదేవి. ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు, శూరసేనుడి కుమార్తె. అందుకే శ్రీ కృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతిభోజుడు పెంచుకున్నాడు. కాబట్టి కుంతీదేవి అయింది. భారతం చదివితే ఆమెలో ఎన్ని ఉత్థానపతనాలు, ఎంత సహనం, ఎన్ని గొప్ప లక్షణాలు... ఆశ్చర్యమేస్తుంది. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు ఎవరి క్షేమసమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నారో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడు ఒకమాటన్నారు– ‘‘అసలు ఆ కుంతీదేవిలాంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం కల తల్లి’’ – అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment