డప్పు కొట్టి చెబుతా! | Fighting for life as a burra prophet | Sakshi
Sakshi News home page

డప్పు కొట్టి చెబుతా!

Published Wed, Feb 20 2019 12:06 AM | Last Updated on Wed, Feb 20 2019 12:06 AM

Fighting for life as a burra prophet - Sakshi

ఆడపిల్ల ఇది చేయకూడదు. అది చేయకూడదు. ఇలా ఉండకూడదు.. అలా ఉండకూడదు అనే హద్దులు ఈ నవీన సమాజంలోనూ ఇంకా సమసిపోలేదు. అలాంటిది ఓ ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పనవసరం లేదు. సవాలక్ష కట్టుబాట్లు, అనేకమైన ఆంక్షలు, అయినవాళ్లెవరూ ఆదుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని బతికించుకోవడం కోసం బుర్రకథ కళాకారిణిగా మారిందో అబల. పదకొండేళ్ల వయసులోనే బుర్రకథ ప్రవచనకర్తగా బతుకు పోరాటం మొదలుపెట్టి డప్పు వాయించడం తప్పనిసరి కావడంతో దానినీ నేర్చుకుని నాలుగొందల ప్రదర్శనలిచ్చిన ఆమె తనలాంటి ఎంతోమంది యువతులకు ఆదర్శం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని డప్పు వాయించి మరీ చెబుతా అంటున్న ఈ గౌరి కథ ఆమె మాటల్లోనే... 

నా పేరు కొట్యాడ గౌరి.. మాది లక్కవరపుకోట మండలం కొట్యాడ తలారి గ్రామం. నాకు 8 ఏళ్ళ వయస్సున్నప్పుడే  అనారోగ్య కారణంగా నాన్న చనిపోయారు. అమ్మ, మేము ఇద్దరు అక్కచెల్లెళ్లం, ఒక తమ్ముడు ఉన్నాం. నేను రెండోదాన్ని. అమ్మకు వ్యవసాయపనులు ఏమీ రావు. దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. అక్క కూలీపనికి వెళ్లితెచ్చిన డబ్బులతోనే అందరం బతకాలి. అక్క పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలు నా భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. ఏడవ తరగతితో చదువు ఆపేసి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో కాలం గడిపేవాళ్లం. ఆ సమయంలో ఓ పెద్దాయన బుర్రకథ చెప్పమని నన్ను ప్రోత్సహించాడు. ఇంటి పరిస్థితుల కారణంగా అమ్మ కూడా అదే మంచిదనుకుంది. అలా బుర్రకథ బృందంలో ప్రవేశించాను. జట్టేడివలస గ్రామానికి చెందిన కెళ్ల సింహాచలం అనే బుర్రకథ మాష్టారి వద్ద శిష్యరికం చేసి 1998లో వచనకర్తగా మారాను. గ్రామదేవతల పండుగలకు బుర్రకథ చెప్పడానికి వెళ్తుంటాను. అందులో రామాయణం వంటి కథలు చేశాను. డప్పు వాయిస్తూ బుర్రకథ చెబుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పరుస్తూ జీవనాన్ని సాగిస్తున్నాను. బుర్రకథ దళాన్ని తయారు చేసుకుని బాల్యవివాహాలు, పావలావడ్డీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి వాటిపై ప్రదర్శనలు ఇచ్చాము. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి గారి హయాంలో కూడా నేను ఈ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన పర్చాను. బుర్రకథ చెబుతున్నప్పుడు డప్పుకూడా వాయించాల్సి వచ్చేది.దీంతో డప్పు వాయిస్తూ, స్వయంగా పాటలు పాడటం నేర్చుకున్నాను. ఇరవై ఏళ్లుగా మహారాష్ట్ర, తెలంగాణ, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాను.  

మహిళా కళాకారులంటే అప్పట్లో చాలామందికి చిన్నచూపు ఉండేది. పొట్టకూటి కోసం ప్రవచనం చెప్పుకుంటున్న నన్ను చాలామంది హేళన చేసేవారు. వేధించేవారు. బంధువులైతే సూటిపోటీ మాటలతో శూలాల్లా గుచ్చేవారు. అయితే ‘ఎంత కష్టం వచ్చినా దొంగతనం చేయకు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరినీ మోసం చేయకు’ అని అమ్మ నాకు చెప్పి ప్రదర్శనలకు పంపిస్తుండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా నాకు బాధ కలిగి బలహీన పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు, బంధువుల ఎత్తిపొడుపులు గుర్తుకు వచ్చేవి. అందుకే రోజు రోజుకూ నాలో కసి పెరిగింది. మంచిమార్గంలోనే ఉన్నతస్థాయికి ఎదగాలనుకున్నాను. భర్త ప్రోత్సాహం కూడా నాకు తోడయ్యింది. ఇప్పుడు నాకంటూ ప్రత్యేకంగా ఓ దళం ఉంది. నేను బతుకుతూ నాతోపాటు పదిమందిని బతికిస్తున్నాననే తృప్తి ఉంది. నిజానికి ఇప్పటికీ నా కష్టం పూర్తిగా తీరిపోలేదు. పండుగలు, జాతరలు లేనప్పుడు బుర్రకథ ప్రదర్శనలు ఉండవు. ఉన్నా దానివల్ల వచ్చే ఆదాయం కూడా ఇప్పుడున్న ఖర్చులకు సరిపోదు. అందుకే టిఫిన్‌ సెంటర్‌ లాంటిదొకటి పెట్టుకుందామని చూస్తున్నాను. రుణం కూడా మంజూరైంది. కానీ ఎందుకో ఆ సొమ్ము నా చేతికి ఇవ్వడానికి బ్యాంకువాళ్లకి మనసు రావడం లేదు. ఎప్పటికైనా వారి మనసు కరిగితే బుర్రకథ కళాకారిణిగా ఉంటూనే స్వయం ఉపాధి ఏర్పరచుకోవాలని ఉంది. 

దొంగతనం చేయకు,  ఎలాంటి పరిస్థితుల్లోనూ  ఎవరినీ మోసం చేయకు’ అని  అమ్మ నాకు చెప్పి ప్రదర్శనలకు పంపిస్తుండేది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడైనా నాకు బాధ కలిగి బలహీన పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేవి.
– కొట్యాడ గౌరి 
– బోణం గణేష్, సాక్షి, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement