టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా?: బొత్స | Ex Minister Botsa Satyanarayana Fires On Tdp Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా?: బొత్స

Published Sat, Jul 27 2024 6:49 PM | Last Updated on Sat, Jul 27 2024 9:07 PM

Ex Minister Botsa Satyanarayana Fires On Tdp Leaders

మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేత దారుణం

జిల్లాలో కొత్త సంస్కృతికి ప్రభుత్వ శ్రీకారం

మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే ఏం లాభం?

ఇది కరెక్టేనా? ఈ చర్య ఎంత వరకు సమంజసం?

ఈ ఘటనలో జిల్లా కలెక్టర్‌ పాత్ర ఆక్షేపణీయం

మానవీయ కోణంలో చూడకపోవడం దురదృష్టం

అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నది సుస్పష్టం

అందుకే ఇకనైనా వైఖరి మార్చుకొండి

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, విజయనగరం: రాష్ట్రంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మారుమూల గ్రామానికి  వెళ్లి విధ్వంసం చేయడమేంటి? నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడమేంటి? అంటూ మండిపడ్డారు. దన్నానపేటలో వెంకునాయుడు ఇంటిని కూల్చివేయడం సరికాదన్నారు.

‘‘జిల్లాలో ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ జరగలేదు. ప్రజాపత్రినిధులు అంటే ఇలాగేనా వ్యవహరించేది?. టీడీపీకి ఓటు వేయకపోతే ఇళ్లు కూల్చేస్తారా?. రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌పై ఎందుకింత కక్ష?. కక్ష సాధించడం కోసమేనా రాజకీయాల్లోకి వచ్చింది’’ అంటూ టీడీపీ నేతల తీరుపై బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.

ఇలాంటి ఘటన చూడలేదు
తాను 1985 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా,  రాజకీయాలు వీడలేదని.. అయితే ఇన్నేళ్లలో ఏనాడూ ఇలాంటి దురదృష్టకర ఘటన చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతికి జిల్లాలో శ్రీకారం చుట్టారని ఆయన మండిపడ్డారు. అసలు దీని వల్ల ఏం లాభిస్తుందని, ఇది సమంజసమేనా అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.

ఇల్లు కూల్చివేత దారుణం
దేశం కోసం పోరాడిన ఓ మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే, అధికార పక్షం వారికి ఏం లాభిస్తుందని, అది కూడా ఎక్కడో మారుమూల ధన్నానపేట అనే గ్రామంలో ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత హేయమని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు. ఒక వేళ ఆ ఇంటి స్థలం, ప్రభుత్వానికి చెందింది అయితే, అక్కడ ఇల్లు కట్టుకున్న వారు అర్హులైతే పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

మేము ఆ పని చేయలేదు
నిజానికి గత ఎన్నికల ఫలితాల నాటి నుంచే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని గుర్తు చేసిన మాజీ మంత్రి బొత్స, తమ జిల్లాలో ఈ రకమైన సంప్రదాయం రాకూడని బలంగా కోరుకున్నామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు, ఈ తరహా ఫిర్యాదులు వచ్చినా, ఇంత దారుణంగా వ్యవహరించి, ఆస్తులు కూల్చివేయలేదని తెలిపారు.

కలెక్టర్‌ పాత్ర ఆక్షేపణీయం
ఈ ఘటనలో జిల్లా కలెక్టర్‌ పాత్ర ఆక్షేపణీయమన్న మాజీ మంత్రి బొత్స, అసలు ఏ విధంగా ఒక మాజీ జవాన్‌ ఇల్లు కూల్చివేతకు ఆనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఫిర్యాదుపై స్వయంగా వెళ్లి పరిశీలించకుండా, ఏకంగా దాదాపు 50 మంది పోలీసులతో వెళ్లి ఇల్లు కూల్చడం ఏమిటని నిలదీశారు. ఇలాంటి వాటిలో మానవీయ కోణం అవసరమని అన్నారు.

వైఖరి మార్చుకొండి
అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వాస్తవాలు గుర్తించి, ఇకనైనా ఈ తరహా చర్యలు వీడాలని, వైఖరి మార్చుకోవాలని అధికార పార్టీ నేతలకు సూచించారు.

 

 

ఆగని టీడీపీ శ్రేణుల దాష్టీకాలు
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తల దాష్టీ­కాలు యథేచ్ఛగా కొన­సా­గుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అడ్డూఅదుపు లేకుండా ప్రవ­ర్తిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంటిపైకి వెళ్లి అను­చితంగా ప్రవర్తించడమేగాక ప్రశ్నించినందుకు పలు వాహ­నాలను ధ్వంసం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడిచేశారు. గ్రామ సచివాల­యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రానికి పెయింట్‌ వేశారు. రైతుభరోసా కేంద్రం, సచివాలయం బోర్డులు తొలగించారు. వైఎస్సార్‌సీపీ జెండాపోల్‌ను ధ్వంసం చేశారు. 

పల్నాడు జిల్లా మర్సపెంట తండాలో టీడీపీకి చెందిన ఓ యువకుడు గురువారం అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక మహిళ ఇంటి తలుపు కొట్టాడు. ఒంటరిగా ఉన్న మహి­ళను దుర్భాషలాడాడు. ఈ విషయమై స్థానికులు టీడీపీ వారిని నిలదీశారు. దీంతో మరింత రెచ్చిపోయిన టీడీపీ వర్గీ­యులు రాళ్లు, కర్రలతో ఇళ్లముందున్న ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఒక్కసారిగా వారు గృహాలపై దాడులకు తెగబడినట్లు గ్రామ సర్పంచ్‌ రవీంద్ర­నాయక్‌ చెప్పారు. ఆ మహిళ శుక్రవారం వెల్దుర్తి పోలీసు స్టేష­న్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన లింగసముద్రంలో వైఎస్సార్‌సీపీ మండల జేసీఎస్‌ కన్వీనర్‌ వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేశారు. లింగసముద్రం గ్రామకంఠం సర్వే నంబర్‌ 79లో ఆర్యవైశ్యులకు 89 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని 50 ఏళ్లుగా వారు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. తమ అవసరాల నిమిత్తం ఓ రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. ఇది ప్రభుత్వస్థలం అంటూ శుక్రవారం టీడీపీ నాయకులు ఆ షెడ్డును పడగొట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఆర్యవైశ్యులను పక్కకి నెట్టిపడేశారు. అదే సమ­యంలో వెళ్లిన వరికూటి కృష్ణారెడ్డిపై దాడిచేసి కొట్టారు. సమాచారం అంది వచ్చిన పోలీసులు వారిని చెదరగొట్టారు. కృష్ణారెడ్డిపై దాడిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, నేతలు ఖండించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో పలువురు గడ్డపారలు, ఇతర పనిముట్లతో గ్రామ సచివాలయంలోకి చొరబడ్డారు. ఈ హఠాత్పరి­ణామంతో నివ్వెరపోయిన సచివాలయ ఉద్యోగులు భయంతో బయటకు పరుగుతీశారు. దుండగులు సచివాలయంపై ఉన్న జగన్‌ ఫొటోతో పాటు శిలాఫలకానికి పెయింట్‌ వేశారు. అక్కడ పికెట్‌లో ఉన్న పోలీసులు కనీసం అడ్డుకోలేదు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి అప్‌గ్రేడ్‌ రూరల్‌ పోలీసుస్టేషన్‌ సీఐ లక్ష్మీకాంతరెడ్డి స్పందించి ఎస్‌ఐ సాగర్‌తో పాటు సిబ్బందిని గ్రామానికి పంపించారు. టీడీపీ మద్దతుదారుల చర్యలను పోలీసులు అడ్డుకుని హెచ్చరించి పంపేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement