
భాగవత సప్తాహం ప్రవచనాల ముగింపు కార్యక్రమంలో చాగంటి కోటేశ్వర్‌రావును సత్కరిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ మధ్య మనసుకు చాలా బాధ కలిగించే అంశాలు చూస్తున్నాం. మానవ ప్రవృత్తి మరిచి కొందరు మృగాలుగా మారుతున్నారు. ప్రవచనాలు సద్గుణాలు, భక్తిభావాన్ని పెంపొందిస్తాయి’అని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్‌రావు భాగవత సప్తాహం ప్రవచనాల ముగింపు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘భగవంతుని గురించి చెప్పేవాళ్లు, వినేవాళ్లు చాలా మంది ఉంటారు. భగవంతుని గురించి చదివినా, విన్నా, చెప్పినా పుణ్యం వస్తుందని అందరి విశ్వాసం. మాకు కోరికలు ఉన్నా కొన్ని నెరవేరవు.
అందుకే మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకుని వచ్చా. నేను దైవాన్ని పూర్తిగా విశ్వసించే వ్యక్తిని. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోను. ఎవరికీ భయపడను. పూర్తిగా భక్తి ప్రపత్తితో చేసే పనులు సమాజానికి, లోక కల్యాణానికి ఉపయోగపడతాయి’అని కేసీఆర్ అన్నారు. అన్నపూర్ణ వంటి డొక్కా సీతమ్మ లాంటి ఉదాత్తమైన లక్షణం కొందరికైనా అలవడాలని ఆకాంక్షించారు. కలడు కలడందురు అన్ని దిశల, సిరికింజెప్పడు.. వంటి పద్యాలను చదువుతూ గజేంద్రమోక్షం, ద్రౌపదీ వస్త్రాపహ రణం వంటి ఘట్టాలను కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వర్‌రావు మానవ జాతికి దొరికిన మణిపూసగా సీఎం అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment