- ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
ఏ పేరుతో పిలిచినా అమ్మ ఒక్కరే
Published Fri, May 5 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
రాజమహేంద్రవరం కల్చరల్ :
పోలేరమ్మ, తలుపులమ్మ, పేరంటాలమ్మ, పెద్దింటమ్మ, గాయత్రి, మహాలక్ష్మి, కామాక్షి, బాలాత్రిపురసుందరి...ఇలా ఏ పేరుతో పిలిచినా అమ్మ ఒక్కరేనని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. నగరంలోని సోమాలమ్మ గుడి వద్ద పుంతరోడ్డులో ‘అమ్మ వైభవం’ అంశంపై శుక్రవారం ఆయన ప్రవచించారు. బయట ఎంత వెతికినా అమ్మ దొరికేది కాదు, ఎందుకంటే అమ్మ ‘అంతర్ముఖ సమారాధ్య’...ఇదే విషయాన్ని వ్యాసభగవానుడు లలితాసహస్ర నామంలో తెలియజేశారని చెప్పారు. అమ్మకు అమ్మ అన్న పిలుపుకన్నా గౌరవప్రదమైన సంబోధన మరొకటి ఉండదన్నారు. వ్యాసభగవానుడు అమ్మ సహస్రనామాలను ‘శ్రీమాతా’ అన్న పిలుపుతో ప్రారంభించారని చెప్పారు. సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైనది, దేవతలు పుణ్యం క్షీణించగానే తిరిగి మర్త్యలోకానికి రావలసినవారేనని చెప్పారు. పరమోత్కృష్టమైన నరజన్మ లభించాక, తన తరువాత ఏడు జన్మలకు సరిపడా ధనార్జనలో జీవితాన్ని వృథా చేసుకునే వారు కొందరైతే, ధర్మమార్గంలో జీవించి, ఉత్తమ లోకాలను అందుకోవాలని ప్రయత్నించేవారు మరికొందరని చాగంటి పేర్కొన్నారు.
చైత్ర,వైశాఖ మాసాలను మధుమాసం, మాధవమాసాలంటారని చెప్పారు. చైత్రంలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా, ధర్మమార్గంలో నడవాలని మానవాళికి ఉపదేశించారని తెలిపారు. వైశాఖమాసంలో జన్మించిన ఆదిశంకరులు దేశానికి మార్గనిర్దేశం చేసిన సాక్షాత్తు జగద్గురువులని చెప్పారు. తొలుత ఆలయానికి వచ్చిన చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ కమిటీ ప్రతినిధి, కార్పొరేటర్ గొర్రెల సురేష్, అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి, టీడీపీ నాయకుడు గన్ని కృష్ణ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
Advertisement
Advertisement