
గృహస్థుల ప్రధాన ధర్మం–ఆతిథ్యమివ్వడం. అసలు ఆతిథ్యమివ్వని ఇల్లు ఇల్లే కాదు. ఎవరయినా వస్తే çసంతోషంతో పట్టెడన్నం పెట్టిన ఇల్లు, ‘అయ్యా! కాసేపు అలా పడుకోండి’ అని విశ్రాంతినిచ్చిన ఇల్లు, మంచి మాటలతో సేదదీర్చిన ఇల్లు... అటువంటి ఇల్లు పరమపావనమైనది. అంతే తప్ప ఎవరికీ ఏమీ పెట్టని ఇల్లు ఇల్లే కాదు, అక్కడ అభ్యున్నతులు రమ్మంటే రావు. ఎక్కడ అతిథిపూజ జరుగుతుందో అక్కడ పరమేశ్వరుడు పరమ సంతోషంతో ఉంటాడు.
సమస్త తీర్థయాత్రల ఫలితం, సకల తీర్థాల సారం పరమ భాగవతోత్తములయిన వారి పాదధూళిని ఆశ్రయించి ఉంటాయని సాక్షాత్తూ యమధర్మరాజే తీర్పు చెప్పాడు. అందుకని అటువంటి మహాత్ములు ఇంటికొచ్చి గడపదాటి లోపలకు వచ్చారంటే అది జన్మజన్మాంతర సుకృతం. ఒక్కొక్క అతిథికి చేసిన సేవవల్ల ఏడుతరాలవారు విడుదలయి పోయి ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. ఒక్కొక్క అతిథిపట్ల అమర్యాదగా ప్రవర్తించిన కారణానికి ఆయన నొచ్చుకుని, బాధపడి వెళ్శిపోయాడు కాబట్టి ఐశ్వర్యం మధ్యః పతనమయి పోతుంది.
లక్ష్మి ప్రవాహం. లక్ష్మి నిలబడితే ప్రమాదం తెస్తుంది. విద్యుత్ లాగానే ద్రవ్యం ప్రవహిస్తే ఉపకారం చేస్తుంది. విద్యుత్ ప్రవహించకుండా ట్రాన్స్‌ఫార్మర్‌లోనే ఉండిపోయిందనుకోండి. దీపాలు వెలగవు. దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు కదా! ద్రవ్యం దానం చేసారనుకోండి. పుణ్యధనమై ఉపకారం చేస్తుంది. ‘‘తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమెకాని మెరుగు బంగారంబు మింగబోడు...’’ అనేది అందుకే.
తనది అని దాచుకుని భయంకరంగా చచ్చిపోయే ప్రాణి–పట్టు పురుగు. మల్బరీ ఆకులు తెచ్చి ఎంతో ప్రేమగా పట్టుపురుగులకేస్తారు. అవి బాగా తింటాయి. తిని నోట్లోంచి పట్టు దారాన్ని వదిలిపెడతాయి. ఆ పిచ్చి పురుగు ఆ దారాన్ని తనవంటికి తానే చుట్టుకుని పట్టుకాయ ఏర్పాటు చేస్తుంది. లోపల మెత్తగా ఉంటుందికదా... దానిలో పడుకుంటుంది, ఇక బయటకు రాలేదు. అవి అలా పడుకుని కాయ కట్టేసాయంటే వాటిని తీసుకొచ్చి సలసల మరిగే నీటిలో పడేస్తారు.నిద్రలోంచి ఉలిక్కిపడిలేచి బయటకు రాలేక కుతకుత ఉడికి అందులోనే చచ్చిపోతుంది. తరువాత రాట్నానికి పెట్టి దారం లాగేస్తారు.
కాయ మిగిలిపోయి పురుగు చచ్చి అందులోనే ఉండిపోతుంది. తీసి బయటపారేస్తే పందులు, కాకులు తింటాయి. తనకి అని దాచుకున్నందుకు పట్టుపురుగు అలా వెళ్ళిపోయింది. అలాకాక దాచుకోకుండా ఇచ్చేసినందుకు గోమాత దేవతా స్వరూపమయిపోయింది. ఇచ్చినదేదో అది నీది. దాచుకున్నదేదో అది నీకు శత్రువు. అందుకే అది ప్రమాద హేతువు.ఒక్కొక్కసారి సత్సంకల్పం కలిగి ఎంతమంది అతిథులు వచ్చినా సేవ చేద్దామని సిద్ధపడిపోవచ్చు. కానీ అతిథి దొరకొద్దూ..!!! ‘ఇది నాకు కావాలి’ అని ఆయన రావద్దూ..!!! ఆయన దొరికినప్పుడు పెట్టుకున్నవాడెవడో వాడు అదృష్టవంతుడు.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు