బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
గృహస్థాశ్రమ వైశిష్ట్యం
కొడుకు ఉన్నాడా ఇంట్లో !!!.. ఉన్నాడు... చాలు ... పెద్ద ఊరట. ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ...’’ ..వెళ్ళవలసిందే. తప్పదు... వాడుంటే చాలు.. తనూభవుడు... ఒక ఊరట. ‘‘ఆత్మావై పుత్రనామాసి...’’ (ఓ పుత్రా! నేనే నువ్వు) ఈశ్వరుడు ఎంత ఊరట కల్పించాడో చూడండి!!! మరిదంతా ఎలా ప్రభవిస్తున్నది...అంటే వివాహం వల్ల. ఈ సంపదకంతటికీ పునాది గృహస్థాశ్రమం... ఇక్కడే నువ్వు తండ్రి రుణం నుంచి విముక్తడవవుతున్నావు. తండ్రి నీకు ఎలా జన్మనిచ్చాడో నీవు కూడా వేరొక జీవునకు శరీరాన్ని కల్పించావు. అలా కల్పించి సంతానం ద్వారా ఊరట పొందావు. పితృరుణాన్ని తీర్చుకున్నావు. అది ధర్మపత్ని సహకారం లేకుండా తీరేది కానే కాదు. అందుకు గృహస్థాశ్రమ ప్రవేశం.
తరువాత.. వైరాగ్య సుఖం... అదెట్లా రావాలి! రామకృష్ణ పరమహంస– ‘బొట్టుబొట్టుగా రాదు, వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది’..అంటారు. వైరాగ్యంలోకి వెళ్ళినవాడు నిరంతరం పరబ్రహ్మను గురించి తనలో తాను రమిస్తుంటాడు. మళ్ళీ మునుపటి జీవితంలోకి రాడు.. ‘‘యోగరతో వాభోగరతోవా/సం^గరతో వా సంగవిహీనః /యస్య బ్రహ్మని రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ...’’.. దీనికంతటికీ కారణం గృహస్థాశ్రమం.
ఆపైన దేవతల రుణం. ఇంద్రియాలన్నింటికీ దేవతలు అధిష్ఠాన శక్తులుగా ఉన్నారు. అందువల్ల వారి రుణం తీర్చుకోవాలి. దానికోసమే ఇంటింటా పూజా విధానం అనేది వచ్చింది. పూజ దేనికి? కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం– కృతజ్ఞత కలిగి ఉండడం.‘‘బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా / నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః’’అంటాడు లక్ష్మణ స్వామి కిష్కింధ కాండలో. ఎవరికయినా నిష్కృతి ఉందేమో కానీ, పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు.
ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం... అందుకే..ఏష ధర్మః సనాతనః(ఇదీ మన సనాతన ధర్మం) అంటారు రామాయణంలో. బద్దెన గారు కూడా..‘‘ఉపకారికినుపకారము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ’’.. అన్నారు కదా! అందుకే మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి దేవతా రుణాన్ని తీర్చుకోవాలి... అలా చేయాలన్నా గృహస్థాశ్రమ స్వీకారం తప్పనిసరి.
ఇంద్రియాల ద్వారా దేవతలు మనకు చేసిన ఉపకారం ఏమిటి? ఐదు జ్ఞానేంద్రియాలను శక్తి సమకూర్చి ఇస్తున్నారు. వీటి ద్వారానే కొన్ని కోట్ల సుఖాలను, కొన్ని కోట్ల దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం. కన్నును ఆధారం చేసుకుని మనకు ఇస్తున్న సుఖాలకు కృతజ్ఞతగా పాదాల చెంత దీపం పెట్టి నమస్కరిస్తున్నాం. చెవులిచ్చాడు. వేదాలే కాదు, సంగీతమే కాదు, చిన్న పిల్లల వచ్చీరాని మాటలను కూడా విని ఆనందిస్తున్నాం.
హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడితో.. ‘అనుదిన సంతోషణములు/జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్/తనయుల సంభాషణములు/ జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్‘ అంటాడు. ఆ అవకాశం కల్పించినందుకు పూలతో పూజ చేస్తాం. రుచులను ఆస్వాదించడానికి నాలుక ఇచ్చినందుకు మధుర పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాం. చర్మస్పర్శ అనుభూతిని ప్రసాదించినందుకు చందన లేపనంతో సేవిస్తున్నాం. ఈ ఐదు ఉపచారాలతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment