‘‘గీతం వాద్యం తథా నృత్యం త్రయ సంగీతముచ్యతే...’’... అన్నట్లు గీతం, వాద్యం, నృత్యం .. ఈ మూడూ సంగీతంలో అంతర్భాగాలే. అది త్రివేణీ సంగమం. అది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితిని ఇస్తుంది. మొట్టమొదట సంగీతాన్ని ఎవరు పట్టుకున్నారు... అంటే భగవంతుడే. పరమశివుడికన్నా బాగా నృత్యం చేసేవారెవరు! శ్రీకృష్ణ పరమాత్మకన్నా వేణువు వాయించగల విద్వాంసుడెవరు! శంకరుడికన్నా దక్షిణామూర్తిగా వీణ వాయించేదెవరు! వైదికమైన రూపాలు వేరయినా సరస్వతీ దేవి కూడా ఎప్పుడూ వీణతోనే కన్పిస్తుంటుంది.
అయితే మనసుకు ఒక లక్షణం ఉంటుంది. దానికున్న శక్తి – వేగం, యాంత్రీకరణ. ఇక్కడున్నట్టుంటుంది... క్షణాల్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూజలో కూర్చుంటాం.. శివాయనమః అంటూ చేతితో పువ్వును శివలింగం మీద ఉంచుతాం. తరువాత.. మంత్రాలు నోరు చెబుతుంటుంది, చెయ్యి పూలు వేస్తుంటుంది... కానీ మనసు మాత్రం మెల్లగా జారుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది. దేముడికి ఇది కాదు కావలసింది. ఆయన వీటితో సంతోషించడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్రయచ్ఛతి/తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః... భక్తితో ఆకులు, పండ్లు, పూలు, నీళ్ళిస్తే నేను తీసుకుంటా... అవి చాలు నాకు... అంటాడు. కానీ చంచలమైన మనసును ఒకేచోట నిలబెట్టడం అంత తేలికయిన పనేమీ కాదు.
అందుకే ఏకాగ్రత లేనప్పుడు గంటలకొద్దీ పూజలొద్దు... సమయం ఉంటే 16 రకాలుగా సేవించు... లేదా ‘పంచసంఖ్యోపచారిణీ’... అన్నారు.. గంధ, పుష్ప, ధూపం, దీపం, నైవేద్యాలతో చేయి.. దానికీ మనసు మొండికేస్తుందా... రాజోపచారాలు చెయ్యి. ... చామరం వెయ్యి, పాట విను, నృత్యం చెయ్యి... ఇవి మనసును బాగా పట్టుకుంటాయి. కంజదళాయతాక్షీ కామాక్షీ... అని కీర్తన అందుకున్నాడు శ్యామ శాస్త్రి.... కుంజరగమనే.. అని పాడాడు వాసుదేవాచార్యులవారు. శుక్రవారం మంటపంలో కామాక్షీ పరదేవత నడచివస్తుంటే ఏనుగు నడిస్తే ఎంత గంభీరంగా ఉంటుందో అంత నయానానందకరంగా ఉంటుందన్నాడు... అంటే ఆ కీర్తన వింటూంటే మనం అమ్మవారి నడకనే చూస్తున్నాం.. మనసుకు కళ్ళెం పడింది. ఆ తత్త్వం మనసును అలరించి శాంతినిస్తుంది. అందుకే గీతం, వాద్యం, నృత్యం మనసుకి ప్రశాంతతను ఇస్తాయి. అందుకే వాటిని రాజోపచారాల్లో చేర్చారు.
అసలు మనకంటే ప్రశాంతంగా ఉండాల్సింది .. భగవంతుడు. ఉద్వేగాలు ఎవరికి ఉండాలి? అదీ ఆయనకే. అందరి మనసుల్లో భగవంతుడున్నప్పుడు మన ఉద్వేగాలు, అశాంతి అన్నింటి సెగ ఆయనకే కదా తగులుతుంటుంది. ఆ వేడిని తట్టుకోవడానికే ఆయన అభిషేకం స్వీకరిస్తున్నాడట. నెత్తిన చల్లటి చంద్రుడిని కూడా ఉంచుకున్నాడని చమత్కారంగా చెప్పారు. అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి అంటే కదలిక. మరి అన్ని కదలికలతో అమ్మవారు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతారు... దానికి కాళిదాసంటారు కదా... సరిగమపదనిరతాం తాం... వీణా సంక్రాంత హస్తాంతాం... ఆ తల్లి చేతిలో వీణ పట్టుకుని సప్త స్వరాల్లో రమిస్తూ ఉంటుంది. అందుకే ఆమె ప్రశాంతంగా ఉంటుంది... అంటే సంగీతం మనసుకు ఏకాగ్రతను, శాంతిని ఇస్తుంది... చివరిదయిన మోక్ష సాధనకు వాగ్గేయకారులు కూడా సంగీతాన్నే సాధనంగా చేసుకుని తరించారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
(చదవండి: పంపాతీరంలో హనుమంతునిచే త్రిశూలరోముడి హతం.. మునులకు ప్రశాంతత)
Comments
Please login to add a commentAdd a comment