ఆదిదంపతుల మానసపుత్రుడు, ఓంకార స్వరూపుడు, విఘ్నాలను శాసించే వాడు, సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వ దేవతా లక్షణసమన్వితుడు, స్వల్పకాలంలో భక్తులకు ముక్తినిచ్చే మోక్షప్రదాత మన గణపయ్య.. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ చేయ్యాల్సిందే..
తలచిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాల్సిందే! దైవారాధనలో, పూజాదికాలలో, సర్వ శుభకార్యాల ఆరంభంలో ఈ మొత్తం జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడే అందుకే ఆయన్ని ‘జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం’ అన్నది వేదం. జపహోమాదుల్లోనూ గణపతిపూజే ప్రథమ కర్తవ్యం. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అనేది అందుకే!
అమ్మ చేతిలో పసుపుముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు, విద్యాప్రదాత కూడా! అందుకే కోరిన విద్యలకెల్ల ఒజ్జయైయుండెడి పార్వతీ తనయ, ఓయి! గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తూ ఉంటాము.
వినాయకచవితి నాడు ఉదయాన్నే మేల్కొని, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానమాచరించి, శుభ్రమైన దుస్తులు ధరించి, వ్రతమాచరించాలి. ఇంటిని శుభ్రపరచుకొని, స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, అరటిబోదెలతో మంటపాన్ని ఏర్పాటు చేసుకొని, పాలవెల్లి కట్టిన పీఠంపై తెల్లటి వస్త్రం పరచి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, ఆహ్వానించి దూర్వా (గరిక) తదితర ఏకవింశతి (21) రకాల పత్రాలతోను, షోడశోపచారాలతో పూజించి, వినాయకోత్పత్తి కథను చదువుకొని, అక్షతలను శిరస్సుపై ధరించాలి. స్వామివారికి వడపప్పు, కొబ్బరి, చెరకు, బెల్లం, ఉండ్రాళ్లు, లడ్డూలు, మోదకాలు, కుడుములు నివేదించాలి.
మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజూ ఓ పండుగే! పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం. వినాయకుడు అనే పేరు విన్నా, పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించి ఆనందం కలుగుతుంది. గణపతి తనగోడు వింటాడు, తను తలచిన ఏ కార్యక్రమానికైనా ఎటువంటి ఆటంకం కలుగనీయడు అని ప్రతి భక్తుడు భావిస్తాడు. భక్తుల భావాల్లో ఇంతగా సుప్రతిష్ఠమైన గణపతిని ఆరాధించటంలో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి.
భాద్రపదమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. ఆనాడు ఆదిదేవుడైన వినాయకుడి ఆవిర్భావం జరిగిన రోజు. ఆరోజు గణపతి పూజ విశేష ఫలితాన్నిస్తుంది. ఎన్ని కష్టాలు, అవరోధాలున్నా, వాటన్నిటినీ తొలగించే తొలిదైవం వినాయకుడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయక చవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతియైన ఆ విఘ్నేశ్వరున్ని భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నింటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడు.
ఈ వ్రత పరమార్థం సమాజంలో ఐకమత్యాన్ని, దైవభక్తిని, జీవనశైలిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింప జేయటమే కాక, భావసమైక్యతకు సహజజీవన సిద్ధాంతానికి నిదర్శనం.
పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు.
పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశం మీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము.
నైవేద్యం: ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి.
పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి, ఆయా మంత్రాలతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
ఒకవేళ పత్రిలో లోపము కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.
పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామివారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.
పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు తమ ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్.
అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఏ వృత్తి వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం.
మట్టి వినాయకుడ్ని పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం !!
మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టిధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి.
(చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు)
Comments
Please login to add a commentAdd a comment