వినాయ‌కుని కోసం మంగ‌ళహార‌తి పాట‌ | Mangala Harati Song For Ganesh Pooja | Sakshi
Sakshi News home page

వినాయ‌కుని కోసం మంగ‌ళహార‌తి పాట‌

Published Sun, Sep 17 2023 3:20 PM | Last Updated on Sun, Sep 17 2023 3:23 PM

Mangala Harati Song For Ganesh Pooja - Sakshi

శీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! 


నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు                                   ‘‘జయ‘‘
సురుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు                 ‘‘ జయ‘‘
పానకము వడపప్పు పనస మామిడి  పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు                  ‘‘ జయ‘‘ 
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును                    ‘‘ జయ ‘‘ 
వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి                      " జయ ‘‘
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు                                 ‘‘ జయ ‘‘ 
ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు                              ‘‘ జయ ‘‘ 
మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు      ‘‘ జయ ‘‘ 
సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి                               ‘‘ జయ ‘‘
కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక                                               ‘‘ జయ ‘‘
అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు                                     ‘‘ జయ ‘‘
పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర                                                                                                                                 ‘‘ జయ ‘‘
బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు                       " జయ ‘‘
పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు                ‘‘ జయ ‘‘
ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు                      ‘‘ జయ ‘‘ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement