వినాయ‌కుని పూజ‌లో చ‌ద‌వాల్సిన క‌థ‌ | Vinayaka Chaturthi Pooja Story | Sakshi
Sakshi News home page

వినాయ‌కుని పూజ‌లో చ‌ద‌వాల్సిన క‌థ‌

Published Sun, Sep 17 2023 3:13 PM | Last Updated on Sun, Sep 17 2023 3:37 PM

Vinayaka Chaturthi Pooja Story - Sakshi

విఘ్నేశుని క‌థ ప్రారంభం

(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)
సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను.

పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను.
 
భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.

కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపింప, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.  

ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా  శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి  నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నందినెక్కి కైలాసమునకు వేగంగా వెళ్ళెను.

వినాయ‌కోత్ప‌త్తి

కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై  అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి  ఎవ్వరినీ లోనికి రానీయవద్దని తెలిపెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నందినధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తనమందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను.



అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టెను. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను.

కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.

విఘ్నేశాధిప‌త్య‌ము



ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.

సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి ఈ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.

 ‘‘సకృత్‌ నారాయణేత్యుక్త్యాపుమాన్‌ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’
అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో  ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను.

ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు 
ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము.  ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వము’’ అని ప్రార్థించెను.

అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధచతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు. ఆనాడు సర్వదేశçస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలుకూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లెను. అతడు మృతుండయ్యె, పార్వతి శోకించుచు చంద్రుని జూచి,


‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.
 

ఋషిప‌త్నుల‌కు నీలాప‌నింద‌లు
ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడ్డాడు. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.



ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్తఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి, మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.
అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు çసంతోషించి తమ గృహములకేగి, భాద్రపద శుద్ధచతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.

శమంత‌కోపాఖ్యాన‌ము
యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిమ్నుని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున  సూర్యుడు  సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్ను దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీకృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు  ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను.

అది తెలిసిన  సత్రాజిత్తు  ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.

ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లు బాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు  తన మందిరమునకు  తిరిగి వచ్చెను.  దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో  వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్ఠురముగా పలికిరి. 
ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను.

కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న  ఒక యువతి ఊయలలో çపడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని  భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన  విధమునిట్లు చెప్చెను.



శ్లో‘‘    సింహః ప్రసేనమవధీః
     సింహో జాంబవతాహతాః
    సుకుమారక మారోధీః
    తవ హ్యేష శ్యమంతకః
(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా!  ఈ మణి  నీకే ఏడవకుము.)

అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.

ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగన మొనర్చు కొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా  ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.

ద్వారాకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కుమార్తె కన్యారత్నమైన సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.

శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను.

ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించిరను వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబపెద్ద అయిన ధృతరా్రçష్టుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి  సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురూ ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను,  ఇది తెలిసి శ్రీ కృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న  శతధన్వుడు, అది అలసి పడిపోగా,  దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వయుద్ధంలో  అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు  తిరిగి వచ్చి  బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు,  ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీ కృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.



బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.

ఇచ్చట శ్రీ కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక  నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.

శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను.
 
చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మ వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ భాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.

అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను.

భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన.. విన్నా.. చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.

ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. 

దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యాన గాథను చదువుట, వినుట సంప్రదాయమైనది.

ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీకృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికీ శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి.

లోపల, బయట శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచుండెను.

‘‘మంగళం  మహత్‌’’

చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి 
మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.

– కథ సమాప్తం –

పునఃపూజ:

ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్‌ సమర్పయామి‘‘ 
(స్వామిపై పుష్పాక్షతలు వేయాలి) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement