
మన దేశంలో ప్రస్తుతం అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే దేశంలో తొలిసారి గణేష్ ఉత్సవాల బహిరంగ వేడుకలు ఎప్పుడు జరిగాయి. ఎక్కడ జరిగాయి? ఆ ఉత్సవాలకు ఎవరు సారధ్యం వహించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో తొలిసారిగా 1893లో మహారాష్ట్రలోని పూణేలో గణేశ్ ఉత్సవాలు బహిరంగంగా ప్రారంభమయ్యాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు. నాటి నుండి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇది మతపరమైన పండుగే అయినా నాటికాలంలో స్వాతంత్ర్య పోరాట బలాన్ని పెంచడానికి, స్వాతంత్ర్యంపై అవగాహనను పెంపొందించడానికి, కులతత్వం, అంటరానితనాన్ని రూపుమాపడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడింది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు కూడా గణేశ్ ఉత్సవాల నిర్వహణకు హిందువులకు మద్దతుగా నిలుస్తుంటారు.
1893వ సంవత్సరానికి ముందు గణేష్ ఉత్సవాలను ప్రైవేట్‌గా లేదా చిన్న స్థాయిలో జరుపుకునేవారు. బ్రిటీష్ బానిసత్వం, మొఘల్‌లతో సహా ఇతర విదేశీ ఆక్రమణదారుల అణచివేత మొదలైనవి దీని వెనుకగల కారణాలని చెబుతుంటారు. హిందువులు నాటిరోజుల్లో తమ ఇళ్లలోనే గణపతిని పూజించేవారు. స్వాతంత్య్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ దేశప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు. నిమజ్జనం సందర్భంగా గణపతి పందాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్ శాంతియుత ఆయుధంగా మలచుకున్నారు.
నాటి రోజుల్లో స్వరాజ్యం కోసం లోకమాన్య తిలక్ ఐక్యతా సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నారు. ఇందుకోసం ఆయన గణపతి ఉత్సవాలను ప్రజా వేదికగా ఎంచుకున్నారు. తిలక్ ప్రారంభించిన గణేశ్ ఉత్సవాలు గజాననుని జాతీయ సమైక్యతకు చిహ్నంగా మార్చివేశాయి. పూణే తర్వాత మహారాష్ట్ర అంతటా జరిగిన గణేశ్ ఉత్సవాలు ఆ తర్వాత దేశ విదేశాలకు సైతం వ్యాపించాయి. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజా ఐక్యతకు గణేశ్ ఉత్సవాలు దోహదపడ్డాయి.
ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment