అనంతపురం/కల్చరల్: బిడ్డల జీవితాలను సంపూర్ణంగా తీర్చిదిద్దే తల్లే సృష్టి లయకారిణిగా విరాజిల్లే త్రిమూర్తి స్వరూపమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ‘ధర్మ వర్థ ని’ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా సాగిన ప్రవచనామృత కార్యక్రమం ఆదివారం రాత్రి అంతే ఘనంగా ముగిసింది. ‘మాతృ చతుష్టయం’ అంశఽంపై ఆదివారం ఆయన ప్రవచించారు. మాతృమూర్తిని సాక్షాత్తూ జగన్మాతగా అభివర్ణిస్తూ పురాణేతిహాస ఘట్టాలను ఉటంకిస్తూ చేసిన ప్రసంగం అమితంగా ఆకట్టుకుంది.
భగవంతుడు తాను అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అటువంటి తల్లిని పూజించిన ప్రతి బిడ్డా ఉత్తమంగా జీవిస్తాడని అన్నారు. భగవన్మాసరణ సమస్త పాపాలు తొలగిస్తుందని, అంతటి పుణ్యకార్యానికి కన్నతల్లి బాసటగా నిలుస్తుందన్నారు. సృష్టిలో అన్ని రుణాలు తీరే మార్గాన్ని శాస్త్రాలు సూచించినా, తల్లి రుణం తీర్చే మార్గాన్ని చూపలేదన్నారు.
కేవలం తల్లిని పూజించడం ద్వారా మాత్రమే ఆమె రుణం తీరుతుందన్నారు. ఈ సందర్భంగా మాతృవందనం కార్యక్రమాన్ని ఆలోచణాత్మకంగా నిర్వహించారు. జేఎన్‌టీయూ అనంతపురం వీసీ డాక్టర్ జింకా రంగజనార్ధన, రిజిస్ట్రార్ సి. శశిధర్, ప్రిన్సిపాల్ ఎస్వీ సత్యనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ.కేశవరెడ్డి, ధర్మవర్ధిని ట్రస్టు అనంతపురం ఇన్‌చార్జి సుధీర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment