
పాలిటెక్నిక్ కళాశాలకు ఉపకరణాల వితరణ
అనంతపురం: ఉరవకొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు రూ.40 లక్షల పరికరాలను కియా కంపెనీ సమకూర్చింది. ఈ మేరకు ఉరవకొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆష్రఫ్‌ఆలీ, కియా ఇండియా కంపెనీ ఉన్నత సలహాదారు యోన్గిల్‌మా సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (కంపెనీ సామాజిక బాధ్యత) కింద ఈ పరికరాలను అందజేయనున్నారు. దీంతో అనంతపురం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పయ్యావుల కేశవ్‌ను ప్రిన్సిపాల్ ఆష్రఫ్ ఆలీ, ఈఈఈ విభాగాధిపతి వై. సురేష్ బాబు తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
పీసీ ప్యాపిలిలో
చిరుత సంచారం
● భయాందోళనలో గ్రామస్తులు
వజ్రకరూరు: మండల పరిధిలోని పీసీ.ప్యాపిలి పరిసర ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామ సమీపంలోని ‘తురాత్ కొండ’ను అవాసంగా చేసుకుని చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రెండు, మూడురోజులుగా చిరుత ఉదయం, సాయంత్రం వేళల్లో అటూ ఇటూ తిరుగుతోంది. అటువైపు వెళ్లిన కొందరు చిరుత సంచారాన్ని సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీంతో ‘తురాత్ కొండ’ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడటంతో రైతులు పొలాలను చదును చేసేకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో చిరుత సంచారం రైతులు, గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. అటవీశాఖ అధికారులు తక్షణం స్పందించి తగుచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.