
ఐ–టీడీపీ కార్యకర్త కిరణ్‌పై కఠిన చర్యలకు డిమాండ్
అనంతపురం: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యుల ప్రతిష్టకు భంగం కలిగేలా అత్యంత హేయకరమైన వ్యాఖ్యలు చేసిన ఐ–టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా, మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీకాంత్ యాదవ్‌కు సోషల్ మీడియా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ షేక్ బాబా సలామ్, సంయుక్త కార్యదర్శి మన్‌ప్రీత్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు నరేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, అధికార ప్రతినిధి కృష్ణవేణి గురువారం ఫిర్యాదు చేశారు. పాయింట్‌బ్లాక్ టీవీ(పీబీ టీవీ) అనే యూట్యూబ్ ఛానల్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఆత్మాభిమానం దెబ్బతీనేలా చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ చర్యల వల్ల దేశ, విదేశాల్లోనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న కోట్లాది మంది అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్ధేశ్యపూర్వకంగానే హైదరాబాద్‌లో ఈ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని, సదరు యూట్యూబ్ ఛానల్ ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకున్న పెయిడ్ ప్రిపరేషన్ లేబరేటీల ద్వారా ఇలాంటి నీచమైన వీడియోలు తయారు చేసి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలోనే ఐ–టీడీపీ లాంటి సంస్థలు ఈ పోస్టింగ్‌లను తయారు చేసి, వాటిని మార్ఫింగ్ చేసి, తప్పుడు సమాచారంతో ప్రజలను పెడదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారన్నారు. తమ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారితో పాటు వారిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కులమతాలు, వర్గాల మధ్య వైషమ్యాలు, విభేదాలు పెంచి రాష్ట్రంలో అశాంతిని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ఐ–టీడీపీ సభ్యుల పోస్టింగ్‌లపై సమగ్రంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐ–టీడీపీ సభ్యుడు చేబ్రోలు కిరణ్‌కుమార్, అతన్ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్, పాయింట్‌బ్లాక్ ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు