జగన్‌కు భద్రత కల్పించడంలో ఘోర వైఫల్యం | - | Sakshi
Sakshi News home page

జగన్‌కు భద్రత కల్పించడంలో ఘోర వైఫల్యం

Published Fri, Apr 11 2025 1:11 AM | Last Updated on Fri, Apr 11 2025 1:11 AM

జగన్‌కు భద్రత కల్పించడంలో ఘోర వైఫల్యం

జగన్‌కు భద్రత కల్పించడంలో ఘోర వైఫల్యం

వజ్రకరూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన వజ్రకరూరులో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరి, అధికార పార్టీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని, ఆయన పర్యటనకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారని తెలిపారు. మూడు రోజల క్రితం శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో జరిగిన వైఎస్‌ జగన్‌ పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. జగన్‌కు భద్రత కల్పించడం కంటే పర్యటనకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాకుండా పోలీసుల చేత అడ్డుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. 400 కేవీ లైన్ల మధ్యలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయడంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసిన తీరు, ఎంపిక చేసిన స్థలాన్ని బట్టి చూస్తే అక్కడ ప్రజలను నియంత్రించడం సాధ్యం కాదని తెలుస్తుందని, హెలిప్యాడ్‌ సురక్షితమైన ప్రదేశంలో కాకుండా బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయడం అనేక సందేహాలను లేవదీస్తోందని పేర్కొన్నారు. పాపిరెడ్డిపల్లి సమీపంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని పరిశీలిస్తే జగన్‌కు అసాంఘిక శక్తులు హాని తలపెట్టే ప్రమాదం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హెలిప్యాడ్‌ వద్ద ఇన్‌చార్జ్‌గా ఉన్న సీనియర్‌ డీఎస్పీ ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరించి ప్రజలను నియంత్రించలేక చేతులెత్తెశారని ఆరోపించారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్ల కారణంగా పోలీస్‌ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించలేకపోయారని వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ పర్యటనలో జరిగిన తప్పిదాలు, భద్రత గురించి మాట్లాడకుండా అధికార పార్టీ నాయకులు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. పోలీస్‌ అధికారులు మాజీ సీఎం పట్ల పరిధి దాటి రాజకీయ నాయకుల్లా మాట్లాడటం సరికాదన్నారు.

మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు హాస్యాస్పదం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ మాజీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగాను, ఒకింత ఆశ్చర్యకరంగాను ఉన్నాయని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గతంలో పోలీసుల పట్ల, పోలీస్‌ అధికారుల పట్ల నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ చేసిన అనుచిత వాఖ్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం చాలామంది పోలీస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని, అనేక మంది పోలీస్‌ అధికారులపై కేసులు పెట్టి ఇళ్ల వద్దనే ఉండేలా చేస్తున్న విషయం మరిచారా అని మంత్రి పయ్యావులను ప్రశ్నించారు. ఉరవకొండ నియోజకవర్గంలో కూడా పోలీసుల చేత పాలన సాగించాలని చూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఏదైనా వ్యా పారం చేసుకోవాలంటే మంత్రి సోదరుడు పయ్యావుల శ్రీనివాసులును కలవాలంటూ పోలీసుల చేత చెప్పిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఇలాంటి పనులు చేయడం వల్ల సమాజంలో వారికున్న గౌరవం తగ్గుతుందన్నారు. సమావేశంలో బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందు, ఉరవకొండ మండల కోఆర్డినేటర్‌ ఓబన్న, మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు ఉస్మాన్‌, యువజన నాయకుడు శశాంక్‌రెడ్డి, సర్పంచులు మోనాలిసా, మల్లెల జగదీష్‌, వజ్రకరూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు రవికాంతరెడ్డి, సీనియర్‌ నాయకులు ప్యాపిలి కిష్ట, రాకెట్ల బాబు, భరత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ప్రభుదాస్‌, భీమా, పట్టా ఖాజాపీరా తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను రాకుండా అడ్డుకోవడానికే పోలీసుల ప్రాధాన్యత

అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే విధుల్లో అలసత్వం

హెలిప్యాడ్‌కు ఎంపిక చేసిన స్థలంపై ప్రజల్లో సందేహాలు

భద్రతను గాలికొదిలేసి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు

పోలీస్‌ అధికారులు రాజకీయనాయకుల్లా మాట్లాడటం సరికాదు

మంత్రి పయ్యావుల మాట్లాడినతీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది

మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement