
ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ఖాతాలు
● అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వినోద్‌కుమార్ సూచన
అనంతపురం అర్బన్: కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారుల పేర్లపై సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాలు సృష్టించారని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఆ ఖాతాలు, ఫోన్ ద్వారా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటి పట్ల ఉద్యోగులు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెసేజ్‌లు వస్తే సహ ఉద్యోగులైనా, తెలిసిన వారైనా నిర్ధారించుకోకుండా తొందరపడి డబ్బు పంపరాదన్నారు. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాధిక తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జీలను సమర్పించుకోవాలని సూచించారు.
తపాలా ఎస్పీగా రాజేష్
అనంతపురం సిటీ: అనంతపురం డివిజన్ తపాలా సూపరింటెండెంట్‌గా రాజేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కడప డివిజన్ రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్న ఆయనకు అనంతపురం డివిజన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు తపాలా ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు బ్రహ్మానందరెడ్డి, కృష్ణయ్య యాదవ్ తదితరులు వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ ఆ స్థానంలో కొనసాగిన గుంపస్వామి బుధవారం రాత్రి రిలీవ్ అయ్యారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయనపై ఫిర్యాదులు వెల్లువెతిన నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆదిలాబాద్ డివిజన్‌కు ఉన్నతాధికారులు బదిలీ చేశారు.
నకిలీ పత్తి విత్తనాలు
విక్రయిస్తే కఠిన చర్యలు
పెద్దవడుగూరు: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను గుంటూరు నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడీఏ రమణమూర్తి, గుత్తి ఏడీఏ వెంకట్రాముడు హెచ్చరించారు. పెద్దవడుగూరులోని ఉమామహేశ్వర ఫర్టిలైజర్ షాపును బుధవారం వారు ఆకస్మిక తనిఖీ చేశారు. విక్రయిస్తున్న విత్తనాలు, పురుగు మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. విక్రయించే ప్రతి విత్తనమూ నాణ్యతగా ఉండాలని సూచించారు. నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. పత్తి విత్తనాల కొనుగోలు సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని అక్కడి రైతులకు సూచించారు. రసీదు లేకుండా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.కార్యక్రమంలో కమిషనరేట్ ఏఓ సుకుమార్, అనంతపురం జేడీఏ కార్యాలయ టీఏఓ రాకేష్‌నాయక్, ఏఓ మల్లీశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయ యంత్ర పరికరాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వ్యక్తిగతంగా పరికరాలు అవసరమైన రైతులు ఆర్‌ఎస్‌కేల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేటాయించిన రూ.3 కోట్ల బడ్జెట్‌లో ఇప్పటికే రూ.1.60 కోట్ల మేర అవసరమైన పరికరాలు కావాలని రైతులు తమ వాటా కింద సొమ్ము చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా బడ్జెట్ ఉన్నందున సాధ్యమైనంత తొందరగా స్ప్రేయర్లు, టిల్లర్లు, తదితర వాటికి 50 శాతం మేర రైతు వాటా చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరికరాలు అందజేస్తామని పేర్కొన్నారు.

ఉన్నతాధికారుల పేరుతో నకిలీ ఖాతాలు