‘కాటన్‌ రుషయేనమః’ | A story by Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

‘కాటన్‌ రుషయేనమః’

Published Sun, Oct 14 2018 1:27 AM | Last Updated on Sun, Oct 14 2018 1:27 AM

A story by Chaganti Koteswara Rao - Sakshi

కదిలే నీరు కర్మమార్గానికి చిహ్నం. నీరు కదలకుండా ఉంటే దుర్వాసన వస్తుంది. కదిలితేనే నీటికి ప్రయోజనం. అలాగే మనిషి కర్మమార్గంలో నలుగురిని సంతోషపెట్టేటట్లుగా ప్రవరిస్తేనే జన్మకు సార్ధకత.  పుస్తకాలు చదివి, పెద్దల మాటలు విని, మనసుని విశాలం చేసుకుని భక్తితో వికసనం పొందాలి అని చెప్పడానికి వికసిస్తున్న పద్మం, భగవంతుడిని చేరుకోవడం లక్ష్యమని చెప్పడానికి హంస. ‘తన్నో హంస ప్రచోదయాత్‌’ అని కూడా రాసుంటుంది. అలాగే జ్ఞానానికి సంకేతంగా ఉదయిస్తున్న సూర్యుడు. యోగమార్గంలో మనిషి వెళ్ళి తరించాలని చెప్పడానికి చుట్టుకున్న నాగుపాము... ఇదంతా రామకృష్ణ మిషన్‌ లోగోలో కనిపిస్తుంది. ఇది మొత్తం చెప్పేదేమిటంటే... ఎక్కడ ఎవరు ఏ బాధలో ఉన్నా నీ బాధగా భావించి, చేయగలిగిన ఉపకారం చేసిపెట్టాలి.

సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఒకప్పుడు బర్మానుంచి నౌకలో వస్తున్నాడు. చీకటిపడింది. విశాలమైన ఆకాశం వంక, మెరుస్తున్న నక్షత్రాలవంక తదేకంగా చూస్తుంటే... అతనిలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ‘‘ఏవేవో చిన్న చిన్న పనులు చేసి మనం ప్రపంచానికి చాలా ఉపకారం చేసామనుకుంటాం. కానీ ఆకాశం, నక్షత్రాలు, భూమి, నదులు, జీవులు... అన్ని ఏర్పాట్లతో, ఇంత సృష్టి చేసిన భగవంతుడిని సంతోషపెట్టడానికి నేనేం చేయాలి’’ అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ మథనంలోంచి ఒక పరిష్కారం దొరికింది. ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవడమే.. అంటే మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బతకగలగడమే పరిష్కారం..’’ అనిపించింది. వెంటనే వెళ్ళి తమ మత పవిత్ర గ్రంథం ఒకటి తీసుకుని చదువుకున్నాడు. ఇక అక్కడినుంచి ఆయన జీవనపథం మారింది.

ఒకరోజు విశాఖ సాగరతీరంలో దూరాన అప్పుడే వచ్చిన ఒక పడవను దొంగలు చుట్టుముట్టి, ప్రయాణికులను, సరుకును దోచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడింది. దగ్గర్లో ఉన్న ఒక దుడ్డు కర్ర చేతపుచ్చుకుని తెగించి వాళ్ళమీదపడ్డాడు. అంతే, దొంగలు పారిపోయారు. మనిషిగా ప్రవర్తించినందుకు ఆ రాత్రి ఆనందంతో పొంగిపోయాడు. ఆ తరువాత ఆయన గోదావరిమీద ఆనకట్టను కట్టడానికి పడిన కష్టం, రైతుల సంక్షేమం కోసం ఆయన పడిన తాపత్రయం అనన్య సామాన్యం. తరువాత కాలంలో ఆయన ఒకసారి గోదావరిమీద పడవలో వెడుతుంటే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనంలో భాగంగా..‘‘కాటన్‌ రుషయేనమః’ అనడం ఆయనకు వినిపించింది.

ఆయనేమంటున్నాడని పక్కన ఉన్నవాళ్ళను అడిగాడు. మీకు నమస్కారం చెప్పుకుంటున్నాడు, అని తెలిపారు. వెంటనే ఆయన నేరుగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ‘కాటన్‌కు ఎందుకు నమస్కరిస్తున్నావ్‌’’అని అడిగాడు.‘‘లోకక్షేమం కోసం ఎవడు తపిస్తాడో, కష్టపడతాడో వాడే రుషి. లక్షల ఎకరాల సాగుకు కారణమయిన ఆనకట్ట కట్టిన కాటన్‌ కూడా వాల్మీకిలాగా, వ్యాసుడిలాగా నా దృష్టిలో రుషే. అందుకే ఈ మంత్రం జపించాను’’ అని ఆయన జవాబిచ్చాడు. ఈ దేశ ప్రజల సంస్కారం, కృతజ్ఞతా భావం చూసి కాటన్‌ విస్తుపోయాడు. తోటి మనిషికి సాయపడాలన్న తపన, కృషి ఉంటే మామూలు మనుషుల్ని కూడా రుషులలో, దేముళ్ళల్లో చేర్చి నెత్తికెత్తుకుంటుంది సమాజం.


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement