జీలకర్ర, బెల్లం పెట్టింది సుముహూర్తం కాదు, వధూవరులు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నది సుముహూర్తం. దేశాచారాన్నిబట్టి ఒక్కోచోట పాణిగ్రహణం, మరికొన్ని చోట్ల మంగళ సూత్రధారణ సుముహూర్తానికి చేస్తారు. సాధారణంగా తెలుగునాట ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుని ‘అఘోర చక్షుః’ అన్న మంత్రం చెప్పిన స్థితి... ఆ కాలం సుముహూర్తం. మరి జీలకర్ర, బెల్లం పెట్టుకోవడం ఎందుకు?
జీలకర్ర మంగళ ద్రవ్యం. బెల్లం నిలవదోషం లేని పదార్థం. ఈ రెంటినీ కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్ పుడుతుంది. వధువు వరుడు ఆ బ్రహ్మస్థానంలోజీలకర్ర బెల్లం ఉంచితే – ఒకరికోసం ఒకరు త్యాగం చేసి ఇద్దరూ ఒకే రకమైన మనఃస్థితిని పొంది–‘‘పోన్లే! ఏదో చెబుతోంది. అంతగా నేను పట్టుదల చూపాల్సిన అవసరమేముంది?’’ అని ఆయన త్యాగబుద్ధితో ప్రవర్తించడం, ‘‘పోన్లే, నాకిష్టమున్నా లేకున్నా మీరు చెబుతున్నారుగా.. చిన్న విషయానికింత పట్టుదల ఎందుకు.. అలాగే చేద్దాం’’ అని ఆమె అనుకుంటే వారి దాంపత్యం ఒక బండికి రెండు చక్రాలవుతుంది. అలా ఇద్దరి మనసులు ఏకీకృతమవడానికి జీలకర్ర, బెల్లం ఒకరి తలమీద ఒకరికి పెట్టిస్తారు.
అంటే...వివాహ క్రతువు ఛాందసత్వంతో చేసేది కాదు. ఇద్దరూ కలిసి బతకాలని, ఇద్దరి మనసులూ ఏకీకృతం కావాలని శారీరకంగా ఒకరినుంచి మరొకరు దూరంగా ఉన్నా, వాళ్ళమనసులు వేరు కాకూడదని, ఇద్దరి మనసులలో భార్య మనసులో భర్త, భర్త మనసులో భార్య ఉండాలని, అంత ప్రేమైకమూర్తులయి జీవించాలని ఇటువంటి సదాచారాన్ని ప్రవేశపెట్టారు. సుందరకాండలో...శిశుపా వృక్షంనుంచి సీతమ్మను చూసి స్వామి హనుమ. ‘‘సీతమ్మ మనసు సీతమ్మ దగ్గరుండి, రాముడి మనసు రాముడి దగ్గరుంటే వీరద్దరూ బతికి ఉండేవారు కాదు. సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది.’ అని అంటారు. ఇది దాంపత్యానికి ప్రతీక. తన మనసు తన దగ్గరే ఉంటే అది కోతి, గాడి తప్పుతుంది. అలా కాక తన మనసు ఆమె దగ్గర ఉండాలి, ఆమె మనసు తన దగ్గర ఉండాలి. ఇద్దరూ బాహ్యంగా రెండుగా ఉన్నా, వాళ్ళు మాత్రం మానసికంగా ఒకటై బతకాలి. అందుకే అటువంటి ప్రీతి వారిలో అంకురించాలని అంత శాస్త్రీయమైన క్రతువు చేస్తారు తప్ప ఛాందసత్వం కానీ, లేకపోతే ఏదో తంతుగా ఆ పని చేయాలనీ కాదు.
రుషిప్రోక్తమైన సనాతన ధర్మంలో వివాహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే పిల్లనిచ్చేటప్పుడు మామ గారు అల్లుడి చేత ఒక ప్రమాణం చేయించుకుంటాడు. ‘ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య’ అని ప్రమాణం చేస్తే పిల్లనిస్తానంటాడు. అంటే ధర్మంలో, అర్థంలో, కామంలో ఈమెను అతిక్రమించను.. అని ప్రమాణం చేయమంటాడు. వరుడు ‘నాతి చరామి’ అంటాడు. అంటే ‘సమస్త దేవతల సాక్షిగా నేను ఈమెను అతిక్రమించను’ అంటాడు. పెళ్ళి చేసుకోవడం... పదిరోజులయ్యేటప్పటికి ఏదో అర్ధం లేని చిన్న కారణానికి విడాకులు ఇచ్చేసుకోవడం తమ ఇచ్ఛ వచ్చినట్లు జీవించడంవంటి ధోరణులు ఈ దేశంలో రాలేదంటే...ఈ దేశం యొక్క సంస్కృతికి ఆయువుపట్టు ఎక్కడుందీ అంటే – నిస్సందేహంగా మన వివాహ వ్యవస్థలోనే. అందుకే ఇతర దేశాలు మన సంస్కృతికి నమస్కారం చేస్తాయి.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment