మంగళ సూత్ర ధారణ చేస్తూ వరుడు ‘‘మాంగల్య తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశ్శతమ్’’. ఈ మాట మరెవరితోనూ అనడు. కానీ ఆ ఆడపిల్లతో అంటాడు. ‘‘నేను నీ మెడలో కడుతున్న ఈ మంగళ సూత్రం – నేనున్నాను అనడానికి గుర్తు. ఇది నీ మెడలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేనున్నానని గుర్తు. నేను ఈ ఊళ్ళో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కనపడకపోవచ్చు. ఆయన ఉన్నాడా... అన్న అనుమానం లేదు. ఆమె మెడలోని మంగళ సూత్రం ఆయన ఉన్నాడనడానికి సంకేతం. మంగళ సూత్రం కంఠం లోనే ఎందుకు కట్టాలి ...అంటే పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వానికి అది తగులుతుంటే ఆ మంగళ సూత్రానికి ఎప్పుడూ ఏ ఆపదా రాదని నమ్మకం. ఈ కంఠం పైన ఉన్న జ్ఞానేంద్రియాలకు, బుద్ధిస్థానానికీ, కింద ఉన్న కర్మేంద్రియాల సంఘాతానికీ మధ్యలో ఉన్న కవాటం అది.
నేను మాట్లాడుతున్నప్పుడు నా కాలిపై దోమ కుడుతున్నదనుకోండి. నాకు బాధ పుడుతున్నదని కాలు బుద్ధి స్థానానికి మొరపెట్టుకుంటుంది. ‘మాట్లాడడానికి అవసరమైన బుద్ధి ప్రచోదనం చేస్తున్నాను... ఇప్పడు కుదరదు’’ అని బుద్ధి అనదు. ఒక పక్క వాక్య నిర్మాణానికి అవసరమయిన విషయాన్ని ఇస్తూనే పక్కనే ఉన్న రెండవ కాలిని ‘‘నువ్వు వెళ్ళి దోమను తరుము, దోమ కుట్టిన చోట ఉపశమనం కలుగచేయి’’ అని ఆజ్ఞాపిస్తుంది. కింద ఉన్న శరీర సంఘాతం గురించి పైన బుద్ధి స్థానంలో ఉన్న తల పట్టించుకుంటుంది. వాటి సహకారానికి గుర్తు కంఠం. అంతే కాదు, కంఠంలోంచి అన్నం కడుపులోకి చేరుకుంటుంది. అది శక్తిగా మారి శరీరావయవాలన్నీ బలం పొందుతాయి. అలా భార్యాభర్తలు కలసి ఉండాలి. అవి ఎలా కలిసి ఉన్నాయో మనం కూడా అలా కలిసి ఉండెదము గాక... అందుకు మంగళ సూత్రం కంఠంలో కడతారు.
తరువాత తలంబ్రాలు. ఇది ఒకరిమీద ఒకరు పోసుకుంటూ హాస్యం కోసం చేసే వేడుక కాదు. బియ్యం మీద పాలచుక్కలు వేసి తీసుకొస్తారు. నడుము విరగని బియ్యం(అ–క్షతలు) ఎలా ఉంటుందో అలా మేము కూడా కలిసి ఉండెదము గాక. పూర్ణత్వాన్ని, మంగళప్రదత్వాన్ని పొందెదము గాక. అందుకే ‘‘ప్రజామే కామస్సమృద్యతామ్ (మాకు ధార్మికమైన సంతానం పుష్కలంగా కలుగుగాక), పశవో మే కామస్సమృధ్యతామ్ (పాడిపంటలు మాకు పుష్కలంగా కలుగు గాక), యజ్ఞో మే కామస్సమధ్యతామ్ (మాకు యజ్ఞాలు చేసే ఆలోచన సమృద్ధిగా కలుగు గాక), శ్రియో మే కామస్సమృధ్యతామ్ (మాకు ఐశ్వర్యానికి వైక్లబ్యం కలుగకుండుగాక).. అని దేవతలను కోరుతూ ఈ తలంబ్రాలు పోసుకుంటారు. అవి పోసుకున్న వేళ దేవతలు కటాక్షిస్తారు.
సభంతా ప్రశాంతంగా వారిని తలంబ్రాలు పోసుకోనివ్వాలి. అది వాళ్ళ జీవితం. వాళ్ళు వృద్ధిలోకి రావలసిన వాళ్ళు. మూడుసార్లు అయిపోయిన తరువాత వేడుక కోసం పోసుకోవడానికి శాస్త్రం కూడా అంగీకరించింది. అప్పుడు సంతోషం కొద్దీ మనం ప్రోత్సాహ పరిచినా, ఉత్సాహ పరిచినా ఏదో వేడుక చేసినా అందులో దోషం రాదు. కానీ వాళ్ల జీవితానికి అభ్యున్నతి కోసం జరుగుతున్న మంత్ర భాగాన్ని జరగనివ్వాలి. శాస్త్రీయమైన కర్మ జరుగుతుండగా దాన్ని ఆక్షేపించే రీతిలో ప్రవర్తించడం సభామర్యాద కాదు. రాక్షస గణాలు చేసే అల్లరి అనిపించుకుంటుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment