వివాహం చేసేటప్పుడు ‘సుముహూర్తము’ అని ఒకటుంటుంది. అంతకు ముందు వరకు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు పక్కపక్కన కూర్చోరు. ఆ సమయంలో ఇద్దరూ అభిముఖంగా కూర్చుంటారు. మధ్యలో తెరపడతారు. వధూవరులిద్దరూ ప్రత్యక్షంగా ఆ సుముహూర్తంలో తెరదించంగానే ఒకరికళ్ళలోకి ఒకరు చూసుకోవాలి. ఎందుకలా!!!
జ్యోతిషం వేదానికి ఉపాంగం. వేదానికి నేత్రస్థానంలో ఉంటుంది. అది ఒక శాస్త్రం. దానిని ఆధారం చేసుకుని రాబోయే కాలంలో జరగబోయే విషయాన్ని చెప్పిన మహాపండితులు ఎందరో ఉన్నారు. అలాగే ప్రతి వ్యవస్థలో ఉన్నట్లే శాస్త్ర పరిజ్ఞానం సరిగా లేనివాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఒక వైద్యుడు తప్పు చేస్తే రోగం వికటించి ఒక వ్యక్తి మరణించి ఉండవచ్చు. అంతమాత్రం చేత లోకంలో అసలు జబ్బులు నయం చేసే వైద్యుడే లేడని, వైద్యశాస్త్రమే లేదని, వైద్యశాలలకు వెళ్ళవద్దని అంటామా? అలాగే జ్యోతిశ్శాస్త్రంలో ఎవరో ఒక సిద్ధాంతి పొరపాటు పడి ఉండవచ్చు. అంతమాత్రం చేత అది శాస్త్రం కాదని నిర్ధారించడానికి మనమెవరం ?
ఆ శాస్త్రంలో సరైన ప్రవేశాన్ని పొంది గురుముఖతః నేర్చుకుని గ్రహాలను వీక్షించి భవిష్యత్తులో జరగబోయే సందర్భాలు చెప్పగలిగిన ప్రజ్ఞ పొందుతాడని శాస్త్ర వచనం. వరాహమిహిరులవంటి వారు ఎందరో జ్యోతిష శాస్త్ర ప్రావీణ్యాన్ని దాని సమర్థతను నిరూపించారు. ఇప్పటికీ పంచాంగ రచన చేస్తే గ్రహణ కాలాన్ని... పట్టువిడుపులను ఘడియలు, విఘడియలతో సహా లెక్కగట్టి చెప్పడాన్ని చూస్తూనే ఉన్నాం కదా. సూర్యోదయ, సూర్యాస్తమయాలను కూడా లెక్కగడుతున్నారు కదా పంచాంగ కర్తలు. అంత కచ్చితంగా సిద్ధాంతులు లెక్కగట్టి పంచాంగాలు ఇవ్వగలుగుతున్నప్పుడు ‘సుముహూర్తం’ విషయంలో భిన్నాభిప్రాయం ఎందుకుండాలి? ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఫలవంతం కావాలని, సంతోషంగా కలిసి గడపాలని సుముహూర్తం నిర్ణయించి ఒకరి కన్నులలోకి మరొకరిని ఆ సమయంలో చూసుకోమంటారు.
అలా చూసుకోకపోవడం పిల్లల తప్పు కాదు. వాళ్ళను అలా చూసుకోవాలని చెబుతూ ప్రోత్సహించాల్సింది పెద్దలమయిన మనం. అంతేతప్ప పక్కన వీడియో ఉంది.. చూడండని చెప్పడమేమిటి? అప్పుడు జరిగే మంత్ర భాగానికి అర్థం ఏమిటంటే... ‘‘నేను ఈమె కన్నులలోకి చూసిన ముహూర్తము సుముహూర్తమగుగాక. దీనివల్ల నేను పిల్లాపాపలతో, యజ్ఞయాగాది క్రతువులతో అభివృద్ధిని పొందెదను గాక.’ అని. అవసరమయితే ఆ సుముహూర్తం అయిన తరువాత ఇద్దరూ తల పక్కకు తిప్పడం వల్ల వచ్చిన నష్టం ఏమీ ఉండదు. జీలకర్ర, బెల్లం పెట్టింది సుముహూర్తం కాదు, వధూవరులు ఒకరి కన్నులలోకి మరొకరు చూసుకున్నది సుముహూర్తం. వాళ్ళ జీవితాలు ప్రధానం, వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం ప్రధానం. వాళ్ళని అలా చూసుకోనివ్వాలి. కానీ అలా శాస్త్రం చెప్పిన ప్రయోజనాన్ని విడిచిపెట్టి... తెర దించిన సుముహూర్తంలో వీడియోల్లోకి కళ్ళుపెట్టి చూడమనడం శాస్త్రాన్ని అవమానించడమే అవుతుంది!!!
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment