బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సచిన్ తెందూల్కర్
భారతీయ క్రికెట్ రంగంలోకి ప్రవేశిస్తున్న సమయంలో సచిన్ తెందూల్కర్‌ను పిలిచి వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు...‘‘నువ్వు క్రికెట్ ఆడవచ్చు. జీవితంలో క్రికెట్ అంతర్భాగం. కానీ క్రికెట్‌లో జీవితం అంతర్భాగం కాదు. నువ్వు క్రికెట్ మహా అయితే ఎన్నాళ్ళు ఆడతావు? ఒంట్లో ఓపికున్నంత వరకేగా! అంటే మహా అయితే ఓ 10–15 ఏళ్ళు.. ఇంకా ఓపికుంటే మరో 5 ఏళ్లు. కానీ నీది నూరేళ్ళ జీవితం.
దానిలో 20 ఏళ్ళు పోతే మిగిలే నీ జీవితం 80 ఏళ్ళు. నువ్వాడుతున్న క్రికెట్ వల్ల నీకు పేరుప్రతిష్ఠలు కానీ, నీ వంటి పుత్రుడిని కన్నందుకు నాకు గౌరవమర్యాదలు కానీ, నీ వంటి ఉత్తమమైన పౌరుడిని పొందినందుకు ఈ దేశానికి కానీ కీర్తి రావాలంటే వినయంతో ప్రవర్తించడం నేర్చుకో ’’ అని ఉద్బోధించాడు.
తరువాతికాలంలో ఈ మాటలు సచిన్ ను ఎలా ప్రభావితం చేసాయో చెప్పడానికి ఒక ఉదాహరణ... ముంబయిలో సచిన్ ఒక వీథిలో ఇల్లుకట్టుకోవాలనుకున్నాడు. అది తెలిసి ఆ వీథిలో వాళ్ళు సంతోషంతో పొంగిపోయారు. సచిన్ ఇక ఇక్కడే ఉంటాడు.
బయటికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు చూడవచ్చు. మేం ఉండేది సచిన్ పక్కఇంట్లోనే, ఎదురింట్లోనే...ఇలా చెప్పుకోవచ్చంటూ మురిసిపోతున్నారు. ఆ వీథిలో అటువైపు, ఇటువైపున్న ఇళ్ల యజమానుల పేర్లతో సచిన్ ఒక ఉత్తరం రాసాడు.
దానిలో ఏముందో తెలుసా...
‘‘నేను సచిన్ తెందూల్కర్. నేను మీ వీథిలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. ఇంటి నిర్మాణానికి ఏడాదో ఏడాదిన్నరో పట్టొచ్చు. నిర్మాణం జరిగేటప్పడు దుమ్మూధూళీ, పెద్ద శబ్దాలు, ఇతరత్రా మీ ప్రశాంత జీవనానికి భంగం కలిగించవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో నావల్ల మీకు కలుగుతున్న ఈ అసౌకర్యానికి మన్నించండి. నన్ను మీలో ఒకడిగా మీ వీథిలో ఉండడానికి అనుమతిస్తూ మీ సహకారాన్ని కోరుకుంటున్నా...’’ అని రాసి ప్రతి యజమానికీ స్వయంగా చేతికిచ్చాడు.
వినయం అంటే అదీ... కీర్తిప్రతిష్ఠల పరంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి అంతటి వినయం చూపడం అతడి వ్యక్తిత్వాన్ని, దాని సమున్నతినీ సూచిస్తుంది. ఈ సంఘటన స్వయంగా సచిన్ తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. చరిత్రలో ఎవరు అలా ఉన్నారో వారు కీర్తిమంతులయ్యారు. పెద్దల అనుగ్రహం పొందారు. భగవంతుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శాశ్వతకీర్తిని మూటగట్టుకున్నారు.
ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నా ఈ వినయం లేకుండా పొగరుబోతు తనం ఉంటే నశించిపోతారు. ఆదర్శపురుషుడిగా నిలిచిన శ్రీరామచంద్రమూర్తినే చూడండి. భీష్మాచార్యులు, ధర్మరాజు....వీళ్లందరూ అసమాన వీరులే, అఖండ ప్రజ్ఞావంతులే, కానీ వారి బలాన్ని చూసి ఏనాడూ విర్రవీగలేదు. కనీసం ఎక్కడా గొప్పకోసం కూడా చెప్పుకోలేదు. ఆ జన్మాంతం వినయ విధేయతలతోనే జీవించారు.
మరోరకంగా చెప్పాలంటే వారి విజయాలకు, వారి కీర్తిప్రతిష్ఠలకు ప్రధాన కారణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే. వాళ్ళు పాటించిన ఈ నియమం ప్రజల హదయాల్లో వారికి శాశ్వత స్థానం దక్కేటట్లు చేసింది. ఇంతే ప్రతిభాపాటవాలు ఉన్న మరికొందరు వారి బలాన్ని చూసి గర్వాతిశయంతో ప్రవర్తించి అగాథాల్లో పడిపోయారు.
ప్రజల ఈసడింపులకు గురయ్యారు. చరిత్రహీనులయ్యారు. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
చదవండి: మంచి మాట: ఉత్తమ వ్యక్తిత్వం ఎలా రూపు దిద్దుకుంటుంది?
Comments
Please login to add a commentAdd a comment