తన ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చిన వినోద్‌ కాంబ్లీ | By God Grace: Vinod Kambli Gives Health Update After Old Video Goes Viral | Sakshi
Sakshi News home page

తన ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చిన వినోద్‌ కాంబ్లీ

Published Sat, Aug 10 2024 3:21 PM | Last Updated on Sat, Aug 10 2024 3:28 PM

By God Grace: Vinod Kambli Gives Health Update After Old Video Goes Viral

PC: X

టీమిండియా మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ తన ఆరోగ్యానికి సంబంధించి అప్‌డేట్‌ అందించాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉందని తెలిపాడు. కాగా ముంబైకి చెందిన వినోద్‌ కాంబ్లీ భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌కు చిన్ననాటి స్నేహితుడన్న విషయం తెలిసిందే.

వీరిద్దరు కలిసి దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. టీమిండియాకు కూడా కలిసే ఆడారు. అయితే, సచిన్‌ అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకుని భారత క్రికెట్‌ ఐకాన్‌గా మారగా.. వినోద్‌ కాంబ్లీ మాత్రం అనతికాలంలోనే కనుమరుగైపోయాడు. కెరీర్‌పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఈ క్రమంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు అతడిని చుట్టుముట్టాయి. ఇందుకు అతడి క్రమశిక్షణరాహిత్యమే కారణమని వినోద్‌ కాంబ్లీ సన్నిహిత వర్గాలు గతంలో వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయింది. అందులో.. నడవడానికి కూడా శక్తి లేని కాంబ్లీ.. ఇతరుల ఆసరాతో ఓ షాపులోకి వెళ్లినట్లు కనిపించింది. 

ఇది చూసిన నెటిజన్లు.. ఈ మాజీ క్రికెటర్‌కు సహాయం అందించాలంటూ సచిన్‌తో పాటు భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశారు. అయితే, అది పాత వీడియో అని తాజాగా తేలింది. ఈ వీడియో చూసిన తర్వాత.. తాము వినోద్‌ కాంబ్లీ ఇంటికి వెళ్లామని.. అతడి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని అతడి స్కూల్‌మేట్‌ రిక్కీ, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అంపైర్‌ మార్కస్‌ తెలిపారు. 

నేనింకా ఫిట్‌గానే ఉన్నాను
ఈ క్రమంలో వినోద్‌ కాంబ్లీ సైతం.. ‘‘దేవుడి దయ వల్ల నేనింకా ఫిట్‌గానే ఉన్నాను. ఇప్పటికీ మైదానంలో దిగి బ్యాటింగ్‌ చేయగల సత్తా నాకు ఉంది’’ అని నవ్వుతూ థంబ్స్‌అప్‌ సింబల్‌ చూపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, బక్కచిక్కినట్లు కనిపిస్తున్న వినోద్‌ కాంబ్లీని చూసి అతడి అభిమానులు ఉద్వేగానికి లోనవుతున్నారు. 

అతడికి వైద్య సహాయం అవసరముందని తెలిసిపోతుందని.. దయచేసి తనను ఆదుకోవాలని మరోసారి సచిన్‌ టెండుల్కర్‌కు మరోసారి రిక్వెస్ట్‌ చేస్తున్నారు. కాగా 1993- 2000 మధ్య కాలంలో వినోద్‌ కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 పరుగులు సాధించాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.

ఇక 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున చివరి వన్డే ఆడిన వినోద్‌ కాంబ్లీ.. 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు. కాగా 2013లో వినోద్‌ కాంబ్లీకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఆ మరుసటి ఏడాదే ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో కాంబ్లీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైనట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement