ఆచార్యుల వల్లనే మనకు ఈ వైభవం | devotional information by Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

ఆచార్యుల వల్లనే మనకు ఈ వైభవం

Jan 28 2018 1:42 AM | Updated on Jan 28 2018 1:43 AM

devotional information by Chaganti Koteswara Rao - Sakshi

ప్రకృతిలోని ఇరవైనాలుగింటిని దత్తాత్రేయులవారు గురువులుగా స్వీకరించిన విషయం తెలుసుకున్నాం. మహానుభావులయిన ఈ గురువులు కేవలం ఉపదేశాలవల్ల కాక, వారి చేష్ఠితాలవల్ల ప్రకాశించారు. చంద్రశేఖరేంద్ర మహాస్వామివారు సన్యాసాశ్రమం స్వీకరించడానికి, వైరాగ్యం పొందడానికి దారితీసిన కారణాల్లో ఒకటి ఆయన చిన్నతనంలో జరిగిన సంఘటన. ఆయన వీథిలో ఉండే ఒకరు యాత్రలకు వెడుతూ ఇంటికి తాళంవేసుకుని వెళ్ళారు.

ఓ రాత్రివేళ ఆ ఇంట్లోనుంచి పెద్దశబ్దాలు వినిపిస్తుంటే, దొంగలు పడ్డారనుకుని చుట్టుపక్కల వాళ్లంతా దుడ్డుకర్రలు పట్టుకుని ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపులు తట్టారు. అయినా శబ్దాలు ఆగకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్ళారు. తీరా చూస్తే ఒక పిల్లి. ఏదో ఆహార పదార్థం కోసం చెంబులో తలదూర్చింది. తల ఇరుక్కుపోయింది. కళ్ళు కనిపించక అటూ ఇటూ దూకుతూ ప్రతిదాన్నీ గుద్దేస్తున్నది.అక్కడ చేరినవారు నెమ్మదిగా తలవిడిపించి దానిని వదిలేసారు. నిజానికి ఇది మామూలు సంఘటనే. కానీ బాలుడిగా ఉన్న స్వామివారిని ప్రభావితం చేసింది. మనిషి అత్యాశతో ప్రవర్తించడంవల్ల ఆఖరికి చెంబులో తలదూర్చి ఇరుక్కుపోయిన పిల్లిలా కొట్టుమిట్టాడతాడని, ఆరోజు పిల్లిని చూసి నేర్చుకున్నానని 80 సంవత్సరాల వయసులో స్వామివారు గుర్తుచేసుకున్నారు.

మహాస్వామివారే ఒకసారి ఆశ్రమంలో బయట అరుగుమీద కూర్చుని ఉండగా కొద్దిదూరంలో వేదవిద్యార్థులు ఆడుకుంటున్నారు. వారిని పిలిపించి ‘మీ గురువుగారు ఇవ్వాళ రాలేదా, ఆడుకుంటున్నారు’ అని అడిగారు. ఒకడు చటుక్కున ‘రాలేదండి’ అన్నాడు. మరొకడు ‘వచ్చారండీ, పాఠం కూడా మొదలుపెట్టారు. కానీ మేమే ఆడుకుంటున్నాం’ అన్నాడు. అనుమానమొచ్చి శిష్యుణ్ణి పంపి విచారిస్తే వాళ్ళ గురువు రాలేదని తెలిసింది. రెండవవాణ్ణి ‘అబద్ధం ఎందుకు చెప్పావు’ అని అడిగారు.

‘‘మా గురువు గారి ఆలస్యాన్ని మీ దృష్టికి తీసుకురావడం ఇష్టంలేక, ఆయన తప్పును మీకు పితూరీగా చెప్పడం ఇష్టంలేక అబద్ధం చెప్పాను’’ అన్నాడతను. వారిని పంపేసిన తరువాత ‘వీడు రా శిష్యుడంటే... శిక్షకు సిద్ధపడి కూడా అబద్ధమాడి గురువుగారి వైభవం నిలబెట్టడానికి ప్రయత్నించాడు’ అన్నారు స్వామివారు. ప్రస్తుత శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామివారి గురువులు శ్రీమద్‌ అభినవ విద్యాతీర్థుల వారి విషయంలో ఒక విశేషం జరిగింది. ఆయన పీఠాధిపతిగా ఉన్న రోజుల్లో ఒక ఆయుర్వేద వైద్యుడొచ్చి ‘‘స్వామీ, ఇది ఒక అద్భుతమైన పసరు. అంత తేలికగా ఎక్కడా దొరకదు.బాగా ఖరీదు కూడా. బెణికినా, కండరాలు పట్టేసినా, నొప్పి ఎక్కువగా ఉన్నా ఇది రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కేవలం మీకోసం తెచ్చాను’’ అని ఆ మందు ఇచ్చాడు.

శిష్యులను భద్రపరచమని స్వామివారు చెప్పారు. ఓ గంట గడిచాక స్వామివారు బయటకు వచ్చారు. అక్కడ ఒక కుక్క నడవలేక కాలీడుస్తూ పోతున్నది. ఆయన చూసి దాని కాలు బెణికినట్లుందని చెప్పి అంతకుముందు ఆయుర్వేద వైద్యుడు ఇచ్చిన మందును శిష్యులచేత తెప్పించి దాని కాలుకు పట్టువేసారు. చూస్తుండగానే అది నిలుచుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. పక్కనున్న శిష్యులు ... ‘‘అయ్యో, ఆయన అంత ప్రేమగా తమరి కోసమని తెచ్చిచ్చారు కదా, దానిని కాస్తా ఆ కుక్క కాలుకు రాసేస్తిరి’’ అన్నారు.

‘అదేమిటి...నొప్పి నాదయితే ఒకరకం, కుక్కదయితే మరొకటీనా..!!!’’ అన్నారు స్వామి వారు. అందుకే వారు జగద్గురువులయ్యారు. గురుత్వంలో అంత శ్రేష్ఠత్వం ఉంటుంది. అసలు ఈ దేశ కీర్తిప్రతిష్ఠలన్నీ ఆచార్యులవే. ఇక్కడ ఉన్న ఐశ్వర్యంవల్లకాదు, ఇతర భోగోపకరణాలవల్లకాదు.. కేవలంగా వారు చేసిన ఉపదేశాలవల్ల, వారి ఆదర్శ నడవడికలవల్ల ఈ దేశ ప్రతిష్ఠ పెరిగింది.
(ఈ పరంపరలో వచ్చేవారం నుంచి ’అతిథి దేవోభవ’)


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement