పూర్వ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఎ.పి.జె. అబ్దుల్ కలాం గురించి మన దేశంలో తెలియని విద్యార్థినీ విద్యార్థులుండరు. ఆయనకు పిల్లలన్నా, పిల్లలకు మంచి విషయాలు బోధించాలన్నా ప్రాణం. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన వెంటనే మద్రాస్ ఐ.ఐ.టి ప్రాంగణంలోని ఒక అతిథి భవనంలో ఉంటూ దేశంలోని పలు ప్రాంతాల్లోని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలను పునఃప్రారంభించిన మహానుభావుడు. చివరకు విద్యార్థులతో మాట్లాడుతూ, మాట్లాడుతూ జారిపడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేసాడు.
అటువంటి కలాం– రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత కేరళ రాష్ట్రంలోని వేనాడులో జవహర్ నవోదయ విద్యాలయంలో ఒక రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసంగించడానికి వెళ్ళాల్సి ఉంది. ఆయన దానికి తగ్గట్టుగా ప్రణాళికవేసుకుని ఉదయం 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ విమానం రెండు గంటలు ఆలస్యం అయింది. ముందనుకున్న ప్రకారం బెంగళూరులోదిగి కాలికట్ విమానం ఎక్కి, అక్కడినుంచి కారులో వేనాడుకు వెళ్ళాలి. బెంగళూరుకు ఆలస్యంగా చేరుకోవడంతో కాలికట్ విమానం వెళ్ళిపోయింది. ఇప్పుడెలా అని ఆలోచిస్తుండగానే సాయంత్రం ఆరు కావచ్చింది. అంటే ఆ సమయానికి ఆయన వేనాడులో వేదికమీద ఉండాలి.
వెంటనే ఆయన పాఠశాలవారికి ఫోన్ చేసి ‘‘విమానం ఆలస్యం అయింది. రాలేకపోతున్నా. కనుక మీ కార్యక్రమాన్ని కొనసాగించండి. నా ఆశీస్సులు మీ కెప్పుడూ ఉంటాయి.’’ అని చెప్పారు. అది విన్న నిర్వాహకులు – ‘‘కలాంగారిని దగ్గరగా చూడాలని, ఆయనతో మాట్లాడాలని మా పిల్లలందరికీ కల. ఎంత ఆలస్యమయినా ఫరవాలేదు. మీరు రాగలరా ?’’ అని అడిగారు. దానితో చలించిపోయిన కలాం–‘‘ఇప్పడు నాకు మరో మార్గంలేదు. ఒక్క అరణ్యమార్గంలో ఇక్కడినుండి (బెంగళూరు) కారులో వస్తే తెల్లవారు జామున 2.30–3గంటలకు చేరుకోగలను. అప్పటివరకూ మీ పిల్లలు ఉండగలరా ?’’ అని బదులిచ్చారు. ‘‘పరమ సంతోషంతో కూర్చుంటారు’’ అని నిర్వాహకులు చాలా హుషారుగా సమాధానమిచ్చారు.‘అయితే, వస్తున్నా..’’ అన్నారాయన.
‘‘నాగరకతకు సంబంధించిన చిహ్నంగా ఆ రహదారి తప్ప వేరొకదారి లేదు. అంత భయంకరమైన అరణ్యమార్గంలో చంద్రుడి కాంతి ఒక్కటే తోడుగా నేను ఆరుగంటలకు వేనాడు బయల్దేరాను’’అని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత రెండున్నరకు వేనాడు చేరుకున్నారు. అంతదూరం ప్రయాణం చేసిన బడలికనుంచి ఉపశమనం పొందడానికి విశ్రాంతి మందిరానికి వెళ్లకుండా, కనీసం ముఖంకూడా కడుక్కోకుండా పిల్లలు ఎదురుచూస్తుంటారని నేరుగా పాఠశాలకు వెళ్ళారు.
తెల్లవారుఝాము మూడవుతున్నది. పిల్లలకళ్ళు మత్తుకు వాలిపోయి, తలలు పక్కకు ఒరిగిపోయి నిద్రముఖాలతో తూగుతూ ఉండాలి. కానీ కలాం గారొస్తున్నారన్న సంతోషంలో పౌర్ణమి చంద్రుడిలా వికసించిన ముఖాలతో వారందరూ ఎదురుచూస్తుంటే, ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఆనందంలో ఆయన ప్రసంగించినా సంక్షిప్తంగానే ముగించారు. దానికి ముందు ఆయన వారితో పది సూత్రాలతో పొదిగిన ఒక చక్కటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ దేశం వృద్ధిలోకి రావాలని, పిల్లలందరూ కూడా జీవితంలో మూడుపూవులూ ఆరుకాయల చందంగా ఎదగాలన్న ఆకాంక్ష ఆ సూత్రాలవెనుక ఉన్న సూత్రం.
(అబ్దుల్ కలాం జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలతో కాకినాడ గోశాలలో విద్యార్థులను ఉద్దేశించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు 2017లో చేసిన వ్యక్తిత్వ వికాస ప్రసంగం సంక్షిప్త పాఠం– ఈ వారం నుంచి).
కలాంను చూడాలన్న కల అది
Published Sun, May 13 2018 1:26 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment